అనంత్‌కుమార్ మృతికి వైయ‌స్ జ‌గ‌న్ సంతాపం

విజ‌య‌న‌గ‌రం: కేంద్రమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు అనంత్‌కుమార్‌(59) ఆకస్మికంగా కన్నుమూశారు. ఆయ‌న మృతికి వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సంతాపం తెలిపారు. ఈ మేర‌కు ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతిని తెలిపారు. కుటుంబ స‌భ్యుల‌కు భ‌గ‌వంతుడు ధైర్యం, భరోసా, ఓదార్పు ఇవ్వాల‌ని ప్రార్థించారు. అనంత‌కుమార్‌ కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో సీనియర్‌ మంత్రిగా పలు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.  కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న అనంత్‌కుమార్‌ బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున రెండు గంటలకు తుదిశ్వాస విడిచారు.  1959 జూలై 22న జన్మించిన అనంత్‌కుమార్‌ విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో చురుకుగా పాల్గొన్నారు. 1996లో తొలిసారి దక్షిణ బెంగళూరు నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. అదే స్థానం నుంచి ఆయన ఆరుసార్లు లోక్‌సభకు ఎన్నికవుతూ వచ్చారు. అనంత్‌కుమార్‌ వాజ్‌పేయి కేబినెట్‌లో విమానయాన శాఖ మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖతో పాటు ఎరువులు, రసాయన శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 

Back to Top