ఉచిత విద్యుత్తుకూ పాతరేస్తారేమో..?!

మహబూబ్‌నగర్:

పథకానికి సరిపడినన్ని నిధులున్నా జిల్లాలో ఆర్డీఎస్ పనులు చేపట్టలేకపోయారని వైయస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల చెప్పారు. మహబూబ్‌నగర్ జిల్లాను చంద్రబాబు దత్తత తీసుకున్నప్పటికీ  చేసేందేమీ లేదన్నారు. పాలమూరు జిల్లా అభివృద్ధి చెందిందంటే అది మహానేత వైయస్ఆర్ హయాంలోనేనని ఆమె స్పష్టంచేశారు.  మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర సందర్భంగా ఆమెకు ఐజ మండల కేంద్రంలో గ్రామస్థులు ఘనస్వాగతం పలికారు. గీత కార్మికులు, బుడగజంగాలు సమస్యలు విన్నవించుకున్నారు.  మన పాలకులు ఏసీ గదుల్లో ఉంటూ ప్రజాసమస్యలు పట్టించుకోకుండా గాలికొదిలేస్తున్నారన్నారు. మహానేత డాక్టర్ వైయస్  రాజశేఖరరెడ్డి అమలుచేసిన ఉచిత విద్యుత్తు పథకాన్ని మున్ముందు కాంగ్రెస్ పెద్దలు ఎత్తేసినా అడిగే దిక్కులేదని చెప్పారు. ప్రజల సమస్యలను పట్టించుకోని చేతకాని ప్రభుత్వానికి అధికారంలో కొనసాగే అర్హతలేదన్నారు. మరో ప్రజాప్రస్థానం యాత్రలో భాగంగా ఆదివారం వెంకటాపురం స్టేజీ నుంచి యాత్ర ప్రారంభించి అయిజ దాటి ఐదు కిలోమీటర్ల వరకు కొనసాగించారు. ఈ సందర్భంగా పర్దిపురం గ్రామంలో షర్మిల మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ పెద్ద చదువులు చదువుకోవాలనే ఆలోచన వైయస్ రాజశేఖరరెడ్డికి ఉండేదని, అంతే పెద్ద మనసు జగనన్నకు కూడా ఉందని రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటువేసి జగనన్నను ముఖ్యమంత్రిని చేయాలని విజ్ఞప్తి చేశారు. ఐజ ఆర్టీసీ బస్టాండు వద్ద ఏర్పాటుచేసిన బహిరంగ సభలో షర్మిల మాట్లాడుతూ ముస్లింలంటే వైయస్‌కు ప్రత్యేక గౌరవమన్నారు. అందుకే వారు అన్ని రంగాల్లో రాణించాలనే ఉద్దేశంతో చదువు, ఉద్యోగాల్లో నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించాలని గుర్తుచేశారు. మహబూబ్‌నగర్ జిల్లా ప్రజలంటే ఎంతో త్యాగధనులని తన తండ్రి రాజశేఖరరెడ్డి ఎప్పుడూ చెబుతుండేవారని గుర్తుచేశారు. తీవ్రమైన కరవు వచ్చి స్థానికంగా పనులు లేకపోవడంతో ఇతర ప్రాంతాలకు నెలల తరబడి వలసలు వెళ్తున్నారన్నారు. చంద్రబాబు నాయుడు హయాంలో జిల్లాను దత్తత తీసుకున్నా ఏనాడు కూడా చిత్తశుద్ధితో జిల్లా ప్రజలను ఆదుకోలేదన్నారు. వైయస్ హయాంలో పాలమూరు జిల్లాను దత్తత తీసుకోకపోయినా ఈ ప్రాంత ప్రజల ఇబ్బందులను గుర్తించి వేలకోట్లు ఖర్చుచేసి నె ట్టెంపాడు, కల్వకుర్తి, భీమా, కోయిల్‌సాగర్ వంటి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారన్నారు. చంద్రబాబు హయంలో కరెంటు బిల్లులు చెల్లించలేదని ఇంటి వద్ద మగవాళ్లు లేకపోతే మహిళలను స్టేషన్‌లో వేయించి కేసులు పెట్టించాడన్నారు. అలాంటి వ్యక్తి తాను ఉచిత విద్యుత్తు ఇస్తానంటూ మోసంచేసేందుకు జనం ముందుకు వస్తున్నాడన్నారు. వైయస్ బతికి ఉంటే రోజుకు 9 గంటల పాటు ఉచిత విద్యుత్తు సరఫరా చేసేవారని తెలిపారు. జగన్‌కు అన్ని వర్గాల నుంచి ఆదరణ లభిస్తుందనే ఉద్దేశంతోనే కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కయ్యి జైల్లో పెట్టించాయన్నారు. జగనన్న త్వరలోనే బయటకు వస్తారని ప్రతిఒక్కరూ ఆయన్ను ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ సెంటిమెంటును అడ్డుపెట్టుకొని విద్యార్థులను బలితీసుకుంటున్న పార్టీలకు బుద్ధిచెప్పాలని పిలుపునిచ్చారు.

Back to Top