త్వరలో వైయస్ఆర్ కాంగ్రెస్‌లో చేరతా: లక్ష్మీపార్వతి

ఏలూరు:

త్వరలో తాను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు ఎన్టీఆర్ టీడీపీ అధ్యక్షురాలు శ్రీమతి నందమూరి లక్ష్మీపార్వతి వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో శనివారం ఆమె విలేకరుల సమావేశంలో ప్రసంగించారు.  తన పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఎన్నికల సంఘానికి లేక పంపుతున్నట్లు పేర్కొన్నారు. ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ ఆశయాలను నెరవేర్చడానికి పదహారు సంవత్సరాలు ఎంతో కష్టపడ్డానని చెప్పారు.  ఎన్టీఆర్ ఆశయాలు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా తీరతాయని తాను నమ్ముతున్నానన్నారు. ఎన్టీఆర్ మరణం తర్వాత పరిణామాలపై త్వరలో తానొక పుస్తకాన్ని రాయనున్నట్లు లక్ష్మీ పార్వతి ప్రకటించారు. తనను అమ్మగా పొగిడినవారే తనపై ఎన్నో కుట్రలు చేశారని ఆమె అన్నారు. తన ఆశయాలు కొనసాగే అనుకూలమైన వేదిక వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కనిపించిందని ఆమె అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీదే విజయమని లక్ష్మీపార్వతి జోస్యం చెప్పారు.

Back to Top