తుగ్గలిలో షర్మిల ప్రసంగానికి విశేష స్పందన

తుగ్గలి (కర్నూలు జిల్లా), 9 నవంబర్‌ 2012: మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర చేస్తున్న షర్మిలకు కర్నూలు జిల్లా ప్రజలు భారీ ఎత్తున మద్దతు పలికారు. తుగ్గలి జాతీయ రహదారి వద్ద శుక్రవారం రాత్రి నిర్వహించిన బహిరంగ సభలో షర్మిల మాట్లాడారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడిన ప్రతి మాటకూ సభకు హాజరైన జనం నుంచి విశేష స్పందన వచ్చింది.

సొంత మామను వెన్నుపోటు పొడిచి చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చారన్నప్పుడు జనం నుంచి మంచి స్పందన లభించింది. బహిరంగ సభకు హాజరైన ప్రతి ఒక్కరూ ఈలలు, చప్పట్లు, కేకలతో హుషారుగా షర్మిలకు మద్దతు పలికారు. టిడిపి ప్రభుత్వం రాష్ట్రంలో విపరీతంగా విద్యుత్‌ బిల్లులు పెంచేసినప్పుడు రైతులు ఉద్యమిస్తుంటే చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌లో పోలీసుల చేత కాల్పులు జరిపించారు. అప్పుడు చంద్రబాబు నాయుడు పరామర్శించారని, ఎవరిని అనుకున్నారని ప్రశ్నించిన షర్మిల 'కాల్పులు జరిపిన పోలీసులను' అన్నప్పుడు కూడా ప్రజలు బాగా ప్రతిస్పందించారు. రాజన్నకు, జగనన్నకు ఉన్నది విశ్వసనీయత అన్నప్పుడు, చంద్రబాబుకు లేనిది విశ్వసనీయతే అన్నప్పుడూ అదే స్పందనను వారు వ్యక్తం చేశారు.

చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు కలిసి ఉమ్మడిగా నీచ రాజకీయాలు చేస్తున్నారన్నప్పుడు సభకు వచ్చిన వారంతా తమ స్పందనను కేకలు, ఈలలతో వ్యక్తం చేశారు. దేవుడు ఉన్నాడన్నది ఎంత నిజమో, మంచివాళ్ళ పక్షాన దేవుడు నిలబడతాడన్నప్పుడూ అదే స్పందన వచ్చింది. వెలిగే సూర్యుడ్ని ఎలా ఆపలేమో జగనన్ననూ ఎవరూ ఆపలేరన్న సందర్భంలోనూ ప్రజలు విశేషంగా స్పందించారు. తన పాదయాత్రకు మద్దతు తెలుపుతూ, తన మాటలు వినేందుకు వచ్చిన ప్రతి అన్నకూ, తమ్ముడికీ, ప్రతి అక్కకూ చెల్లికీ, పెద్దలకూ, పిన్నలకూ చేతులెత్తి, శిరసు వంచి నమస్కరిస్తున్నానని షర్మిల అన్నప్పుడూ ప్రజలు మరింత ఉత్సాహంగా స్పందించారు.
Back to Top