తూర్పు గోదావరిలో నేడు విజయమ్మ పర్యటన

అమలాపురం: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ మంగళవారం తూర్పుగోదావరి జిల్లాలోని తుఫాను బాధిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. సోమవారమే ఆమె జిల్లాకు రావాల్సి ఉంది.  పశ్చిమగోదావరి జిల్లాలో బాధితులు అడుగడుగునా ఆపి తమ గోడు చెప్పుకోవడంతో ఆ జిల్లా పర్యటనలో తీవ్ర జాప్యం ఏర్పడింది. సోమవారం రాత్రి భీమవరంలో బసచే సి, మంగళవారం ఉదయం జిల్లాకు వస్తారు. దిండి వద్ద జిల్లాలో అడుగుపెట్టనున్న విజయమ్మ రాజోలు, పి.గన్నవరం, అమలాపురం, ముమ్మిడివరం, కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, పిఠాపురం, ప్రత్తిపాడు, తుని నియోజకవర్గాల్లో తుపాను, నీటి ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తారు. ముంపు బారిన పడిన కాలనీలకు, గ్రామాలకు వెళ్లి సర్వస్వం కోల్పోయి కట్టుబట్టలతో రోడ్డున పడిన బాధితులను పరామర్శిస్తారు. వారి వెన్నుతట్టి ధైర్యం చెపుతారు. ముంపునకు గురైన పంట పొలాలను పరిశీలిస్తారు.

పర్యటన సాగనుందిలా...

భీమవరం నుంచి చించినాడ వంతెన మీదుగా జిల్లాలోకి ఉదయం పది గంటలకు ప్రవేశిస్తారు. 11 గంటలకు రాజోలు మండలం శివకోడులో వరి చేలను పరిశీలించి రైతులను పరామర్శిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు  పి.గన్నవరం నియోజకవర్గంలోని నాగుల్లంక వద్ద పంటపొలాలను చూస్తారు. ఒంటి గంటకు అమలాపురంలో పార్టీ జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి ఇంటి వద్ద భోజనం చేసి, కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటారు. 2.00 గంటలకు ఉప్పలగుప్తం మండలం భీమనపల్లి వద్ద పంట పొలాల పరిశీలించి రైతులతో మాట్లాడతారు.  2.30 గంటలకు ముమ్మిడివరం లోని ఎయిమ్సు కాలేజ్ ఎదురుగా ఉన్న పంట పొలాల పరిశీలిస్తారు. 3.30 గంటలకు  కాకినాడ రూరల్ మండలం పగడాలపేటలో మత్స్యకారుల కాలనీ సందర్శిస్తారు. సాయంత్రం 4.30 గంటలకు : పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలులో చేనేత కాలనీకి వెడతారు. 5.00 గంటలకు కత్తిపూడి, అన్నవరం పరిసర ప్రాంతాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తారు. 6.30 గంటలకు : తునిలో జిల్లా నాయకులు, కార్యకర్తలతో సమావేశమై అక్కడే బస చేస్తారు.
విజయమ్మ మంగళవారం జిల్లాలో జరిపే పర్యటనను విజయవంతం చేయాలని ఆ పార్టీ సీజీసీ సభ్యుడు, మాజీ మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్, జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. విజయమ్మ పర్యటించనున్న ప్రాంతాలను సోమవారం వారు పార్టీ నేతలతో కలిసి పరిశీలించారు. ఎయిమ్స్ కాలేజీ, అన్నంపల్లి ఎస్సీకాలనీ, నాగుల్లంక, శివకోడు తదితర ప్రాంతాల్లో విజయమ్మ చూడనున్న ముంపు బారినపడ్డ పంటపొలాలను పరిశీలించారు. అనంతరం పర్యటన ఏర్పాట్లపై పార్టీ ముఖ్యనేతలతో సమీక్షించారు. పార్టీ క్రమశిక్షణ సంఘం సభ్యుడు ఏజేవీబీ మహేశ్వరరావు, జిల్లా కిసాన్‌ సెల్ కన్వీనర్ రెడ్డి రాధాకృష్ణ, నీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి కొవ్వూరి త్రినాథరెడ్డి, పార్టీ జిల్లా కో ఆర్డినేటర్ మిండగుదిటి మోహన్, తాడి విజయభాస్కరరెడ్డి, భూపతిరాజు సుదర్శనబాబు, గుత్తుల సాయి, మండల కన్వీనర్లు మట్టపర్తి నాగేంద్ర, జగతా బాబ్జి, కాళే రాజబాబు తదితరులు పాల్గొన్నారు.

తాజా వీడియోలు

Back to Top