- విశాఖ నగరంలో కొనసాగుతున్న ప్రజా సంకల్ప యాత్ర- భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తి- వైయస్ఆర్‌సీపీ జెండాలు, ఫ్లెక్సీలతో నగరం ముస్తాబు
విశాఖపట్నం : ప్రజాకంటక పాలనపై సమరభేరి మోగిస్తూ రాయలసీమ, కోస్తాంధ్ర జిల్లాల మీదుగా ఉత్తరాంధ్రలోకి అడుగిడిన ప్రజా సంకల్ప యాత్ర శనివారం మహావిశాఖ నగరంలోకి అడుగుపెట్టింది. గ్రేటర్ విశాఖ పరిధిలోని 66వ వార్డులో కొత్తపాలెం వద్ద నగరంలోకి ప్రవేశించిన వైయస్ జగన్‌కు విశాఖవాసులు అపూర్వ స్వాగతం పలికారు. తమ కష్టాలు తెలుసుకుని.. కన్నీళ్లు తుడిచేందుకు ఎండనక వాననక పాదయాత్రగా వస్తున్న వైయస్ జగన్‌మోహన్‌రెడ్డికి అఖండ స్వాగతం పలికారు. 258వ రోజు ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా ఆదివారం ఉదయం వైయస్ జగన్ విశాఖటపట్నం నియోజకవర్గంలోని గోపాలపట్నం నుంచి పాదయాత్ర ప్రారంభించారు. అక్కడి నుంచి గోపులపట్నం జంక్షన్, బాజీ జంక్షన్, ఎన్‌ఏడీ జంక్షన్ మీదుగా ఓల్డు కరాస వరకు పాదయాత్ర సాగనుంది. వైయస్ జగన్ రాకతో పాదయాత్ర సాగే మార్గంలో పండుగ వాతావరణం నెలకొంది. అడుగడుగునా ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వైయస్ జగన్ ముందుకు సాగుతున్నారు.
మహానగరం సిద్ధంజననేత రాకతో విశాఖ మహానగరం ముస్తాబైంది. కొత్తపాలెం మొదలుకుని నగర పరిధిలో పాదయాత్ర సాగే దారుల్లో అడుగడుగునా స్వాగత ద్వారాలు, భారీ ఫ్లెక్సీలు, పార్టీ జెండాలు, తోరణాలతో మహానగరం సిద్ధమైంది. అలుపెరగని మహా పాద యాత్రికుడి అడుగులో అడుగు వేసేందుకు విశాఖ వాసులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. ఈ నెల 14వ తేదీన గన్నవరం మెట్ట వద్ద విశాఖ జిల్లాలోకి అడుగుపెట్టిన ప్రజా సంకల్ప యాత్ర అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 188.6 కిలోమీటర్లు పూర్తిచేసుకుని శనివారం విశాఖలోకి అడుగిడుతోంది. గ్రామీణ జిల్లాలో మూడు పట్టణాలు, 15 మండలాల మీదుగా పాదయాత్ర చేసిన జననేతకు ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. నర్సీపట్నం మొదలుకుని.. సబ్బవరం వరకు జరిగిన ఏడు బహిరంగ సభల్లో జన కెరటాలు ఎగసిపడ్డాయి. జననేత ఇచ్చిన హామీలు.. భరోసా.. వారిలో కొండంత స్థైర్యాన్ని నింపాయి. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి నేతృత్వంలో నగర పార్టీ అధ్యక్షుడు మళ్ల విజయప్రసాద్, పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు తైనాల విజయకుమార్, పార్లమెంటు కోఆర్డినేటర్ ఎంవీవీ సత్యనారాయణ, అసెంబ్లీ కో–ఆర్డినేటర్లతో కలిసి విస్తృత ఏర్పాట్లు చేశారు. గాజువాక మినహా సిటీలోని మిగిలిన అన్ని నియోజకవర్గాల మీదుగా పాదయాత్ర సాగేలా రూట్ మ్యాప్ తయారుచేశారు. కొత్తపాలెం వద్ద శంఖం పూరిస్తున్న జననేత భారీ కటౌట్‌తో కూడిన స్వాగత ద్వారం విశేషంగా ఆకట్టుకుంది. మహానగర పరిధిలో ఆదివారం సాయంత్రం భారీ బహిరంగ సభ జరగనుంది. కంచరపాలెం మెట్ట వద్ద నిర్వహించ తలపెట్టిన సభకు విశాఖ నగర పరిధిలో నలుమూలల నుంచి ప్రజలు భారీ ఎత్తున తరలి వస్తారని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే పార్టీ నాయకులు ఏర్పాట్లు పూర్తి చేశారు.