వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు

 జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ 

రాష్ట్రంలో పతాక స్థాయికి దోపిడీ, అవినీతి

20 నెలల్లోనే ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత 

శాంతి భద్రతల పరిరక్షణలో ప్రభుత్వం విఫలం

చంద్రబాబు ఆటవిక పాలనకు ఇక అంతం 

కార్యక్రమంలో మండలి విపక్షనేత బొత్స ధ్వజం

తాడేపల్లి: తాడేపల్లిలోని వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో  77వ గణతంత్ర దినోత్సవ వేడులు ఘనంగా జరిగాయి. పలువురు పార్టీ నాయకులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అంతకు ముందు పార్టీ నాయకులంతా మహాత్మా గాంధీ, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్, నేతాజీ సుభాష్‌ చంద్రబోస్, డాక్టర్‌ వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి చిత్రపటాల వద్ద పుష్పాంజలి ఘటించారు. 
జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం, మాట్లాడుతూ బొత్స సత్యనారాయణ ఏమన్నారంటే..:

యథేచ్ఛగా రెడ్‌బుక్‌ రాజ్యాంగం:
    రెండేళ్ల పాలన కూడా పూర్తి కాకుండానే రాష్ట్రంలో పతాకస్థాయికి చేరిన భూదోపిడీ, దౌర్జన్యాలు, అవినీతితో ప్రజలు విసిగిపోయారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్న కూటమి ప్రభుత్వంపై అలుపెరుగుని పోరాటం చేస్తున్న వైయస్‌ జగన్‌ గారికి ప్రజలంతా అండగా నిలబడుతున్నారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ రాసిన రాజ్యాంగంతో కులమతాలు, ప్రాంతాలకు అతీతంగా దేశంలోని పౌరులందరికీ సమన్యాయం జరగాలని సమాన హక్కులు కల్పిస్తే దానికి విఘాతం కలిగించేలా రాష్ట్రంలో సీఎం చంద్రబాబు పాలన సాగిస్తున్నారు. రెడ్‌ బుక్‌ రాజ్యాంగంతో కూటమి నాయకులు 20 నెలలుగా సాగుతున్న వేధింపులు పరాకాష్టకు చేరుకున్నాయి. చట్టాలను ఉల్లంఘిస్తూ, పౌరుల హక్కులను కాలరాస్తూ, మీడియా స్వేచ్ఛకు విఘాతం కలిగిస్తూ ఆటవిక పాలన సాగిస్తున్నారు.

పేదల పక్షాన పోరాడుతున్నాం:
    రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. వ్యక్తిగత స్వార్థం, ప్రతిపక్షాలపై ద్వేషం, అధికారం ఉందనే అహంకారం, ఎల్లప్పుడూ తామే పదవుల్లో ఉండాలన్న ఆశతో కూటమి నాయకులు వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారు. కొంతమంది పోలీసులు అంబేడ్కర్‌ రాజ్యాంగాన్ని పక్కనపెట్టి రెడ్‌ బుక్‌ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ అమాయకులను అక్రమ కేసుల్లో ఇరికించి వేధిస్తున్నారు. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి గారి ఆలోచనా స్ఫూర్తితో ఏర్పాటు చేసుకున్న వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నిత్యం పేదల పక్షాన నిలబడి పోరాడుతుంది. అన్నివర్గాలకు అండగా నిలబడుతుంది.

ఆటవిక పాలనకు అంతం పలకాలి:
    గత ఐదేళ్ల వైయస్‌ జగన్‌ గారి పాలన రాష్ట్రంలో కొత్త చరిత్ర సృష్టించింది. దేశంలో ఎవరూ చేయని విధంగా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి ఒక నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. అనుభవశాలిని, విజనరీనని చెప్పుకునే చంద్రబాబు.. నాటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగించాల్సింది పోయి వ్యవస్థలు విధ్వంసం చేస్తున్నాడు. అందుకే ఈ ఆటవిక పాలనకు అంతం పలకాలి. వైయ‌స్ జగన్‌గారిని మళ్లీ ముఖ్యమంత్రిని చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు అందరూ సంఘటితమై మరింత ఉత్సాహంగా పని చేయాలని బొత్స సత్యనారాయణ పిలుపునిచ్చారు.

    ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, మురుగుడు హనుమంతరావు, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, టీజేఆర్‌ సుధాకర్‌ బాబు, మంగళగిరి నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డితో పాటు, పలువురు పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు, నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Back to Top