టికెట్ ఇస్తే- సగం ఎమ్మెల్యేలు వైయస్‌ఆర్‌సిపిలోకే

కావలి (శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా): వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇస్తామ‌ని చెబితే తమ పార్టీలో చేరేందుకు సగం మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని నెల్లూరు ఎం‌పి, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు మేకపాటి రాజమోహన్‌రెడ్డి తెలిపారు. వైయస్‌ఆర్‌సిపి జిల్లా కన్వీనర్ కాకాణి గోవర్ధ‌న్‌రెడ్డి, కావలి నియోజకవర్గం నాయకుడు రామిరెడ్డి ప్రతాప్‌ కుమార్‌రెడ్డితో కలిసి కావలి రూరల్ మండలంలోని మత్స్యకార గ్రామాల్లో మంగళవారం నిర్వహించిన ‌‘జగన్ కోసం‌.. జనం సంతకం’ కార్యక్రమంలో మేకపాటి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రాజమోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. సీట్లు ఖాళీ లేక టికెట్లు ఇవ్వడం కుదరకపోవడంతో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఆగిపోయారన్నారు.  వైయస్‌ఆర్‌సిపి అధ్యక్షుడు శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డి జైల్లో ఉంటేనే చిత్తూరు జిల్లాకు చెందిన ఇద్దరు టిడిపి ఎమ్మెల్యేలు ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి తమ పార్టీలో చేరారన్నారు. అదే శ్రీ జగన్ జైలు బయటకి‌ వస్తే.. టిడిపి దుకాణం మూసుకోవాల్సి వస్తుందని చంద్రబాబు భయపడుతున్నారని మేకపాటి వ్యాఖ్యానించారు. అందువల్లే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు అధికార కాంగ్రెస్‌ పార్టీతో కుమ్మక్కయ్యారని ఎద్దేవా చేశారు.

ఇంతకు ముందు జారీ చేసిన ప్రభుత్వ జీఓలన్నీ చట్టబద్ధమైనవే అని ఇప్పుడు తన మంత్రులను రక్షించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చెబుతోందన్నారు. అలాంటప్పుడు ఆ జీఓల జారీలో క్విడ్‌ ప్రో కో ఉందంటూ శ్రీ జగన్‌ను సిబిఐ అరెస్టు చేయడం అక్రమమే కదా అన్నారు. రాజన్న రాజ్యం మళ్లీ రావాలంటే అది శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డి వల్ల మాత్రమే సాధ్యం అవుతుందని రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారని రాజమోహన్‌రెడ్డి తెలిపారు. అందుకే శ్రీ జగన్ కోసం జనం సంతకం కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొంటున్నారన్నారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా కాంగ్రె‌స్, ‌టిడిపిలకు డిపాజిట్లు దక్కే అవకాశం లేదన్నారు.
Back to Top