టీడీపీ పాలనపై ప్రజాగ్రహం వెల్లువెత్తింది

హైదరాబాద్, నవంబర్ 5: ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చని చంద్రబాబునాయుడి ప్రభుత్వంపై ఈ ఐదు నెలల్లోనే ప్రజాగ్రహం తీవ్రంగా వ్యక్తమవుతుందని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు చెప్పారు. వైఎస్సార్సీపీ పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ధర్నాలు విజయవంతమవడమే ఇందుకు నిదర్శనమని తెలిపారు.

బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజల నిరసన వెల్లువెత్తిందన్నారు. వైఎస్సార్సీపీ అధినేత శ్రీ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు అన్ని మండల, పట్టణ కేంద్రాల్లో ధర్నాలు చేసి ప్రభుత్వంపై నిరసన తెలియచేశారని వివరించారు. రుణాల మాఫీ జరగకపోవడం వల్ల నష్టపోతున్న రైతులు, డ్వాక్రా మహిళలు, చేనేత కార్మికులు, మరమగ్గాల వారు, పింఛన్ల తొలగింపునకు గురైన నిరుపేదలు పెద్ద సంఖ్యలో నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారని వివరించారు. మొత్తం 660కి పైగా మండలాల్లోని ఎమ్మార్వో కార్యాలయాల వద్ద ధర్నాలు జరిగాయని, ఆ తరువాత అధికారులకు ప్రజా సమస్యలపైన వినతి పత్రాలను సమర్పించారని తెలిపారు.

బుధవారంనాటి ధర్నాలు ఒక హెచ్చరిక మాత్రమేనని తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రజలకిచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలని, లేకపోతే ఉద్యమాలు మరింత తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. నిరసన కార్యక్రమాలు విజయవంతం చేసిన పార్టీ శ్రేణులు, ప్రజలకు అభినందనలు తెలిపారు. చంద్రబాబు అనంతపురం జిల్లాలో 2012 సంవత్సరంలో పాదయాత్ర చేసినప్పుడు రైతులు, మహిళలకు రుణాలు, వడ్డీలు చెల్లించవద్దని పదే పదే చెప్పారని.. తీరా అధికారంలోకి వచ్చాక తడవకో మాట చెబుతూ కాలం వెల్లబుచ్చుతున్నారని ఉమ్మారెడ్డి విమర్శించారు.

అధికారం కోసం అలివికాని హామీలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చాక పేద అరుపులు అరవడం వంచన, ప్రజాద్రోహం కాదా అని ప్రశ్నించారు. రుణమాఫీ అంశాన్ని ప్రభుత్వం గందరగోళంగా మార్చడంతో రైతులకు కొత్త రుణాలు రావడం లేదన్నారు. పాత రుణాలపై అపరాధ వడ్డీ కట్టాల్సి వస్తుందని, సున్నా శాతం, పావలా వడ్డీకి రుణాలు రాని పరిస్థితి ఏర్పడిందని అన్నారు.

తాజా వీడియోలు

Back to Top