తెలంగాణ పేరుతో మోసం!

భువనగిరి

29 అక్టోబర్ 2012 : అదిగో తెలంగాణ, ఇదిగో తెలంగాణ అంటూ కేసీఆర్ గత పదకొండేళ్లుగా ప్రజలను మోసం చేస్తున్నారని వైయస్ఆర్ సీపీ నాయకురాలు, మాజీ మంత్రి కొండా సురేఖ విమర్శించారు. కేసీఆర్‌వి దొంగమాటలని ఆమె దుయ్యబట్టారు. భువనగిరిలో సోమవారం జరిగిన బహిరంగసభలో మాట్లాడుతూ స్వార్థపూరిత రాజకీయాలతో తెలంగాణ ప్రజల ప్రాణాలను బలి తీసుకుంటున్నారని ఆమె కెసిఆర్‌ తీరుపై మండిపడ్డారు. పరకాల ఉప ఎన్నికలలో తాను నైతికంగా గెలిచానని ఆమె అన్నారు. ఓడిపోయానంటే తాను ఒప్పుకోననీ, అక్కడ గర్వంతో విర్రవీగిన టిఆర్ఎస్‌కు ముచ్చెమటలు పట్టించాననీ ఆమె చెప్పారు. కుళ్లు రాజకీయాలతో తనను ఓడించేందుకు ప్రయత్నించినా కేవలం 1500 ఓట్ల తేడాతో మాత్రమే వాళ్ల గెలవగలిగారని ఆమె వ్యాఖ్యానించారు. డబ్బు వసూలు చేస్తూ రాజకీయాలు సాగిస్తున్నారని సురేఖ టిఆర్ఎస్‌ నాయకులను తూర్పారబట్టారు. కోదండరామ్ నాయకత్వంలో తెలంగాణ మార్చ్ విజయవంతం కాగానే ఇప్పుడు ఉద్యమాలకు విరామం ఇద్దామంటూ కేసీఆర్‌ కొత్త పల్లవి అందుకున్నారని ఆమె విమర్శించారు. వైయస్ రెక్కల కష్టంతో వచ్చిన ప్రభుత్వం ఆయన సంక్షేమ పథకాలకు తూట్లు పొడుస్తున్నదని ఆమె నిందించారు. యువ తెలంగాణ నాయకుడు జిట్టా బాలకృష్ణారెడ్డి వైయస్ఆర్ సీపీలోకి రావడం టిఆర్ఎస్‌కు పెద్ద షాక్ అని ఆమె వ్యాఖ్యానించారు. అయితే ఇది ఆరంభం మాత్రమేనని, 2014 నాటికల్లా టిఆర్ఎస్ నామరూపాలు లేకుండా చేసేందుకు పూనుకోవాలని సురేఖ వైయస్ఆర్ సీపీ కార్యకర్తలకు, అభిమానులకు పిలుపు ఇచ్చారు.

Back to Top