'తెలంగాణపై మహానేత వైయస్‌కు ఎంతో ప్రేమ'

నాగర్‌కర్నూల్‌ (పాలమూరు జిల్లా): తెలంగాణ ప్రాంతం పట్ల, తెలంగాణ ప్రజల పట్ల దివంగత మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డికి అమితమైన ప్రేమ అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పాలమూరు జిల్లా నాయకుడు ఎం. భగవంత్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ అభివృద్ధి కోసం వైయస్ ‌అవిరళ కృషి చేశారని ఆయన అన్నారు. మహానేత వైయస్ ప్రవేశపెట్టిన ప్రతి సంక్షేమ పథ‌కాన్నీ తెలంగాణ నుంచే ప్రారంభించడం దీనికి ప్రబల నిదర్శనం అని ఆయన పేర్కొన్నారు. తన స్వగృహంలో బుధవారంనాడు భగవంత్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు.‌ సీమాంధ్రకు దీటుగా తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపించిన ఘనత వైయస్‌ఆర్‌దే అని భగవంత్‌రెడ్డి కొనియాడారు. తెలంగాణ రైతుల అభివృద్ధి కోసమే నాలుగు బృహత్తర నీటి ప్రాజెక్టులను వైయస్ ప్రారంభించారని గుర్తుచేశారు.

వైయస్‌ఆర్‌సిపిని రాయలసీమ పార్టీ అంటూ టిఆర్‌ఎస్ అ‌ధ్యక్షుడు కేసీఆర్, నాగం జనార్ద‌న్‌రెడ్డి వ్యాఖ్యానించడం సరికాదన్నారు.‌ ప్రజా సంక్షేమ పథకాల కోసం కేసీఆర్ ఏనాడైనా పోరాటాలు చేశారా అని భగవంత్‌రెడ్డి సూటిగా ప్రశ్నించారు. వైయస్‌ఆర్‌సిపి అధ్యక్షుడు శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డి తరఫున రాష్ట్ర ప్రజలకు భరోసా ఇచ్చేందుకే శ్రీమతి షర్మిల పాదయాత్ర చేస్తున్నారని వివరించారు. కొందరు స్వార్థ రాజకీయ నాయకులు అమాయకులైన యువకులను ప్రేరేపించి పాదయాత్రను అడ్డుకునేందుకు కుట్రలు చేస్తున్నారని భగవంత్‌రెడ్డి ఆరోపించారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా పాదయాత్రను అడ్డుకోలేరన్నారు.
Back to Top