టీడీపీ బ్లాక్ పేపర్‌పై సోమయాజులు ఫైర్

హైదరాబాద్, 27 మార్చి 2013:

విద్యుత్తు సమస్యపై టీడీపీ విడుదల చేసిన 'బ్లాక్ పేపర్'పై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండిపడింది. పార్టీ ప్రధాన కార్యాలయంలో బుధవారం మధ్యాహ్నం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో రాజకీయ సలహాదారు డి.ఎ. సోమయాజులు, ఎమ్మెల్యేలు జి. శ్రీకాంత్ రెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, ట్రేడ్ యూనియన్ నాయకుడు జనక్ ప్రసాద్ విలేకరులతో మాట్లాడారు. బ్లాక్ పేపర్‌ను ఖండిస్తూ వారు ఫ్యాక్ట్ పేపరును విడుదల చేశారు. బ్లాక్ పేపర్ అంతా అవాస్తవాల పుట్టన్నారు.
గతంలో చంద్రబాబునాయుడు అనుసరించిన అస్తవ్యస్థ విధానాల వల్ల కూడా రాష్ట్రంలో విద్యుత్తు సంక్షోభం తలెత్తిందని సోమయాజులు ఆరోపించారు. విద్యుత్తు సమస్యపై చంద్రబాబుకు అవగాహన లేదన్నారు. టీడీపీ బ్లాక్ పేపర్లో సర్కారును నిలదీసే అంశాలు ఎక్కడని ఆయన ప్రశ్నించారు. గతంలో ఎన్నడూ లేనంత విద్యుత్తు కొరత ఎందుకొచ్చిందని సోమయాజులు సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రంలో పెట్టుబడులు గణనీయంగా పెరిగినా కరెంట్‌ ఛార్జీల పెంపు ఎందుకన్నారు. రైతులకు 7 గంటల కరెంట్‌ ఇస్తూ..ఛార్జీలు పెంచకుండా మహానేత వైయస్‌ ఎలా పాలించగలిగారో ఆయన వివరించారు. బడ్జెట్‌తో నిమిత్తం లేకుండా ఛార్జీలు పెంచుతున్న విషయం బాబుకు తెలియదా అని అడిగారు. విద్యుత్తు సమస్య విషయంలో చంద్రబాబు అవాస్తవాలు చెబుతున్నారనీ, అర్ధరాత్రి ఒప్పందాలు చేసుకున్నది ఆయన కాదా గుర్తు చేసుకోవాలన్నారు. విద్యుత్తు సమస్య ఎందుకొచ్చిందనే అంశం కూడా బాబుకు తెలియదన్నారు. విద్యుత్తు చార్జీలు ఎందుకు పెంచుతున్నారో ఆయన పట్టించుకోవడం లేదన్నారు. 


ప్రైవేటీకరణకు అనుకూలమెవరో అందరికీ తెలిసిందే

మహానేత రాజశేఖరరెడ్డిగారు ప్రైవేటీకరణకు అనుకూలమని అందులో పేర్కొన్నారనీ, చరిత్ర తెలిసిన ఎవరూ ఆ విషయాన్ని అంగీకరించరని సోమయాజులు స్పష్టం చేశారు. ఏటా సీఐఏతో ఒప్పందం కుదుర్చుకుని విదేశీ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్నది చంద్రబాబే అనే విషయం అందరికీ తెలుసన్నారు. దేశంలోని కంపెనీలు పెట్టుబడులు పెడతామంటే నిరాకరించిన చరిత్ర బాబుదన్నారు. 1995 ఫిబ్రవరి 17న అర్ధరాత్రి పది వేల మెగావాట్ల విద్యుదుత్పత్తికి సంబంధించిన 23 ఎమ్ఓయూలపై చేయించారనీ, అప్పట్లో ఆయన రాష్ట్ర ఆర్థిక, రెవెన్యూ మంత్రిగా ఉన్నారనీ తెలిపారు. ఆరోజు రాష్ట్రంలో 5000 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం ఉందనీ, దీనికి అదనంగా ప్రైవేటు కంపెనీలతో ఈ ఎమ్ఓయూలను కుదుర్చుకున్నారనీ చెప్పారు.  ఎమ్ఓయూలు కుదుర్చుకున్న వారిలో సగం మంది ఆదాయ పన్ను అసెస్సీలే కారన్నారు. అర్ధరాత్రి ఒప్పందాలేంటని అప్పట్లో అందరూ అసహ్యించుకున్నారని చెప్పారు. సంతకాలు చేసిన వారికి కోల్, గ్యాస్ లింకేజీలు కూడా లేవన్నారు. ఎవరు కనిపిస్తే వారిని పిలిచి సంతకాలు పెట్టించుకున్నారు. ఆరోజుల్లో దీనిని  ఇ.ఎ.ఎస్. శర్మ అనే విద్యుత్తు శాఖ కార్యదర్శి వ్యతిరేకించారని చెప్పారు. ఇవి హాస్యాస్పదంగా మారి కోర్టులు తప్పుపట్టడంతో ఎమ్ఓయూలు రద్దయ్యాయనీ, ఈ విషయం అందరికీ తెలుసుననీ సోమయాజులు తెలిపారు. 1994లో కోట్ల విజయభాస్కరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ముద్దనూరు థర్మల్ పవర్ స్టేషన్ ఆధునికీకరణకు బీహెచ్ఈఎల్ కంపెనీతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని కూడా చంద్రబాబు 1995లో రద్దు చేసి దాన్ని కూడా ప్రైవేటు కంపెనీకి ధారాదత్తం చేశారన్నారు.

న్యాఫ్తాతో విద్యుదుత్పత్తికి అనుమతిచ్చిన ఘనుడు బాబు

ఈ ఘట్టం తర్వాత 31-03-1997న 2000 మెగావాట్ల విద్యుదుత్పత్తికి వీలుగా ఆరు కంపెనీలకు ఎనిమిది స్వల్ప వ్యవధి గ్యాసాధారిత ప్రాజెక్టులకు అనుమతిచ్చారన్నారు. కేవలం నాఫ్తాతో విద్యుదుత్పత్తి చేయాలనేది నిబంధనని చెప్పారు. ప్రపంచంలో ఎవరూ న్యాఫ్తాతో విద్యుదుత్పత్తికి పూనుకోరన్నారు.  వంద లేక నూట యాబై మెగావాట్లకు వాడుకోవచ్చు కానీ, రెండు వేల మెగావాట్లకు న్యాఫ్తా వినియోగం అబ్బురమన్నారు. న్యాఫ్తా యూనిట్ విలువే పదిహేను రూపాయలుంటుందన్నారు. అందరికీ తలో ధరకూ అనుమతిచ్చారన్నారు. ఇలాంటి పనికి గ్లోబల్ టెండర్లెందుకని ఆయన ప్రశ్నించారు. దీనిపై గాలి ముద్దు కృష్ణమ నాయుడు అప్పట్లో యాబై తక్కువ కాకుండా ప్రెస్ కాన్ఫరెన్సులు పెట్టారన్నారు. ఈ అంశంమీద మహానేత వైయస్ఆర్ సీఎల్పీ నాయకుడిగా ఎన్నికైన తర్వాత అసెంబ్లీలో లేవనెత్తి అందరికీ 97 పైసల ధర నిర్ణయింపజేశారన్నారు. ఇది అందరికీ తెలిసిన వాస్తవమన్నారు.  ఇవన్నీ ప్రజలు మర్చిపోయారని భావిస్తూ, తనకు ప్రైవేటు రంగంతో సంబంధమే లేనట్టు బ్లాక్ పేపర్లో చంద్రబాబు రాయడాన్ని సోమయాజులు ఎద్దేవా చేశారు. న్యాఫ్తా ఏమిటని అందరు గొడవ చేస్తే గ్యాస్ తెస్తామని 2000 సంవత్సరంలో చంద్రబాబు తన పరపతిని ఉపయోగించి గ్యాస్ ఇస్తామని గెయిల్ నుంచి లేఖ తెచ్చారన్నారు. తన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి నానా పాట్లూ పడ్డారన్నారు. ఆ రోజు 'మీరడిగారు కాబట్టి గ్యాస్ అందిస్తామని లేఖ ఇచ్చామనీ, ఇవ్వలేకుంటే జరిమానాలు కట్టడం లాంటివేమీ ఉండవనీ గెయిల్ స్పష్టం చేసిందన్నారు. ఈ లేఖమీద చంద్రబాబు సంతకం చేసిన మాట వాస్తవం కాదని చెప్పాలని ఆయన సవాలు చేశారు. ఆ పేపర్లు ఇప్పటికీ ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. అన్నీ క్యాబినెట్‌కి అనుగుణంగా మార్చేశారని చెప్పారు.

ప్రైవేటు ఎక్కువ.. ప్రభుత్వ సంస్థకి తక్కువ


1997లో జీవీకేకీ, స్ప్రెక్ట్రం(కంబైన్డు సైకిల్ గ్యాస్ బేస్‌డ్ పవర్ ప్రాజ్టక్టు) కి మెగావాట్ కి ఐదు కోట్ల రూపాయలకి సంతకం చేసిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. అదే ఏడాది ఏపీఎస్ఈబీకీ ఏపీజీపీసీఎల్ కంపెనీకి నడుమ మెగావాట్ 2.7 కోట్ల రూపాయలకు ఒప్పందం కుదిరిందన్నారు. 174 మెగావాట్లకి 474 కోట్ల కాగా.. జీవీకె, స్పెక్ట్రంలకు 200 మెగా వాట్లకి వెయ్యి కోట్లకు అనుమతించింది వాస్తవం అవునా కాదా అని సోమయాజులు టీడీపీ అధినేత చంద్రబాబును నిలదీశారు. ఇన్ని చేసి రాజశేఖరరెడ్డిగారిమీద అభియోగాలు మోపడంలో మీ ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు. వీటిని సవరించడానికి మహానేత ప్రయత్నిస్తే ఒప్పందాలు కుదిరిపోయాయి కనుక మార్చడానికి కుదరదన్నారన్నారు.

నీ హయాంలో ఆపరేటింగ్ ప్రాఫిట్సు ఎందుకు తగ్గాయి బాబూ!


1989-94 మధ్య ఏపీఎస్ఈబీ ఆపరేటింగ్ ప్రాఫిట్సు తెచ్చుకున్న విషయం వాస్తవమా కాదా అని సోమయాజులు చంద్రబాబును ప్రశ్నించారు. 1994-2004 వరకూ ఏ సంవత్సరమూ లాభం రాకపోగా నష్టం వచ్చిన విషయం నిజం కాదా అని అడుగుతూ ఈ అంశాన్ని బ్లాక్ పేపర్లో ప్రస్తావించి ఉంటే బాగుండేదని ఆయన ఎద్దేవా చేశారు. ఈ నష్టం మొత్తం ఇరవై వేల కోట్ల రూపాయలనీ, దీనిని బడ్జెట్లో సర్దుబాటు చేశారనీ చెప్పారు. ఇలాంటి సంఘటన చరిత్రలోనే లేదని పేర్కొన్నారు. ఏటా విద్యుత్తు చార్జీలు పెంచుతామని ప్రపంచ బ్యాంకుతో ఒప్పందం కుదుర్చుకున్న  విషయాన్ని బ్లాక్ పేపర్లో ఎందుకు ప్రస్తావించలేదని అడిగారు. ఇవన్నీ దాచిపెట్టి రాజశేఖరరెడ్డిగారిని తప్పుపట్టేలా ఎందుకు మాట్లాడుతున్నారు... ఎవరికీ విషయాలు గుర్తుండవనుకుంటున్నారా అని ప్రశ్నించారు.
 1994 మార్చినాటికి ఆస్తులు 101రూపాయలుంటే అప్పులు వంద రూపాయలున్న స్థితినుంచి 2004నాటికి ఆస్తులు 45 అప్పులు వంద రూపాయలకు వచ్చిందని చెప్పారు. ఎమ్ఎ ఎకనమిక్సు చదివిన చంద్రబాబు తాను ఏపీఎస్ఈబీని చాలా గొప్పగా నడిపానని ఎలా చెబుతారన్నారు. పైసా చార్జీలు పెంచకుండా రాజశేఖరరెడ్డిగారు ఐదేళ్ళు దివ్యంగా పాలించిన విషయం మరిచారా అని ప్రశ్నించారు.


ఉన్న బొగ్గును విడిచి దిగుమతులెందుకు

రాజశేఖర రెడ్డిగారి హయాంలో కెపాసిటీ ఎడిషన్ లేకపోవడం వల్ల కేవలం అయిదువేల మెగావాట్ల విద్యుత్తే ఉత్పత్తయ్యిందని చంద్రబాబు బ్లాక్ పేపర్లో పేర్కొనడం అర్థరహితమని పేర్కొన్నారు. గ్యాస్ లేదు, బొగ్గు లేదు, జలవిద్యుత్తు ప్రాజెక్టులకు నీరు లేదు.. దీనిని విస్మరించి సామర్థ్యాన్ని జోడించ లేదనడం తగదన్నారు. ఈ విషయం ప్రతి చిన్నపిల్లవాడికీ తెలుసన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిష్క్రియగా మారి నిర్ణయం తీసుకోలేకపోవడం వల్ల ఈ పరిస్థితి నెలకొందని ఆ పేపర్లో రాయాలన్నారు. ఐదారేళ్ళ కిందట 200 కోల్ బ్లాకులను బొగ్గు శాఖ ప్రైవేటు సంస్థలకు కేటాయిస్తే, నిల్వలు సరిపోవనే ఉద్దేశంతో పర్యావరణ మంత్రి జైరామ్ రమేశ్ వాటికి అటవీ, పర్యావరణ అనుమతులు రద్దు చేశారన్నారు. ప్రపంచంలో పది శాతం బొగ్గు నిల్వలు మన దేశంలోనే ఉన్నాయనీ, బొగ్గు లేకుంటే అది వేరే విషయమనీ చెప్పారు. పనిస్తే చేయడానికి ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారన్నారు. ఇంత విజ్ఞానం, నిల్వలు ఉండి బొగ్గును విదేశాలనుంచి దిగుమతి చేసుకోవాల్సిన అవసరమేమొచ్చిందని సోమయాజులు ప్రశ్నించారు. విదేశీ మారక నిధులు లేవని ప్రధాని స్వయంగా చెబుతున్నారనీ, దీనివల్ల ఉత్పన్నమయ్యే పరిస్థితులను చంద్రబాబు తన బ్లాక్ పేపరులో ప్రస్తావించడం మాని రాజశేఖరరెడ్డిగారిని తప్పుపట్టడమేమిటని ఆయన అడిగారు. బొగ్గు, గ్యాస్ నిల్వలతో అసలాయనకు సంబంధమేమిటన్నారు.

ఆదాయం పెరిగినా సంక్షేమానికి పైసా లేదు

2008-09లో బడ్జెట్ లక్ష తొమ్మిది వేల కోట్లు. వచ్చే లక్షా ఇరవై ఏడు వేల కోట్లని చెబుతున్నారు. ఆర్థిక మాంద్యం ఉండికూడా ఇంత రాబడి పెరిగిందన్నారు. బడ్జెటేతర అంటే మున్సిపల్, ఆర్టీసీ, మంచినీటి వ్యవస్థ వంటి వాటి ఆదాయం 250 శాతం వరకూ పెరిగిందన్నారు. రోజూ డీజిల్, పెట్రోలు ధరలు పెరుగుతున్నాయి. రెవెన్యూ రాబడి కాకుండా ఇంత ఆదాయం, అప్పులు తానెప్పుడూ చూడలేదన్నారు. ఇంత రాబడి ఉండి కూడా పేదలకు ఇచ్చే పింఛను ఒక్క రూపాయి కూడా పెంచలేదన్నారు. ఇళ్ళ విషయమూ అంతేనన్నారు. ప్రభుత్వం అంటే బీదల గురించి కాదా అని సోమయాజులు ప్రశ్నించారు. వీటిని బ్లాక్ పేపర్లో ఎండగట్టకుండా రాజశేఖరరెడ్డిగారిని తప్పుపట్టడమేమిటని ఆయన చంద్రబాబును నిలదీశారు. ఇలాంటి ప్రభుత్వాన్ని కాపాడటానికి ఎందుకు ప్రయత్నిస్తున్నావని అడిగారు. ఈ విషయాల్ని ప్రజలకు వివరించి ఉంటే బాగుండేదన్నారు. బెస్టు బిజినెస్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు పొందిన చంద్రబాబు సక్రమంగా ఎందుకు ఆలోచించిలేకపోతున్నారో అర్థం కావడం లేదని సోమయాజులు చెప్పారు.

Back to Top