బాబు, వెంకయ్యలు రాష్ట్రానికి రాహుకేతుల్లా తగులుకున్నారుతిట్టడం కోసం పనిగట్టుకొని పాచిమోహాలతో టీడీపీ మంత్రుల ప్రెస్మీట్లుజై ఆంధ్రప్రదేశ్ సభ సక్సెస్ ను ఓర్వలేక వైయస్ జగన్‌పై వ్యక్తిగత దాడిదమ్ముంటే జగన్ ప్రశ్నలకు టీడీపీ నేతలు సమాధానం చెప్పాలివైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్రెడ్డిసభ విజయవంతం చేసిన ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపిన పార్టీ
హైదరాబాద్: విశాఖపట్నంలో జై ఆంధ్రప్రదేశ్ సభలో ప్రతిపక్షనేత వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అడిగిన ప్రశ్నలకు దమ్ముంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమాధానం చెప్పాలని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదాపై వైయస్ జగన్ గళాన్ని ప్రజలకు వినిపించకుండా ప్రభుత్వం ఎన్నో కుట్రలు, కుతంత్రాలు చేసిందన్నారు. అయినా విశాఖ సముద్ర అలలకంటే పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారన్నారు. హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సభను విజయవంతం చేసినందుకు ప్రజలందరికీ వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతోందని చెప్పారు.
సభా విజయవంతాన్ని భరించలేక, తట్టుకోలేక....చెవిటి పెద్దమ్మ చాంతాడు ఎక్కడా అంటే మా ఆయన పుట్టిళ్లు బెజవాడ అన్న చందంగా టీడీపీ విమర్శలు చేస్తోందని ఎద్దేవా చేశారు. 14వ ఆర్థిక సంఘం ఎక్కడా అభ్యంతరం పెట్టలేదని, హోదా వస్తే పరిశ్రమలకు రాయితీలు కల్పించడం ద్వారా ఉద్యోగ అవకాశాలు మొత్తం విరాజిల్లుతాయని వైయస్ జగన్ హోదా అవసరం గురించి చెబుతుంటే హోదాను చిదిమివేసేందుకు టీడీపీ నేతలు కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. జన సంద్రం హోదాను కోరివచ్చిన వారా కాదా అనే విషయాలను చర్చించకుండా, ఇద్దరు మంత్రులు వైయస్ జగన్‌పై వ్యక్తిగత దాడికి దిగుతున్నారని మండిపడ్డారు. వ్యక్తిగత దాడులు చేయడం మానుకొని అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని చురకంటించారు.
మరి రాష్ట్రం ఎందుకు దిగజారిందిహెరిటేజ్ సంస్థను లాభాల బాటలోకి తీసుకువచ్చిన చంద్రబాబు ప్రజల జీవితాలను ఎందుకు తన పరిపాలనతో మెరుగుపర్చలేకపోయారని భూమన ప్రశ్నించారు. 2012 సంవత్సరంలో రూ. 200 ఉన్న షేర్‌ను 2014లో దాని విలువ రూ. 910కి ఎలా చేరిందని వైయస్ జగన్ నిలదీశారని దానికి మంత్రులు, హెరిటేజ్ సంస్థ ప్రతినిధి సాంబశివరావు మూడు రకాలుగా ప్రతిపక్షనేతపై దాడికి తెగబడ్డారని మండిపడ్డారు. హెరిటేజ్ సంస్థకు ఏరకంగా లాభాలు వచ్చాయంటూ వైయస్ జగన్ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కర్నూలులో నవనిర్మాణ దీక్ష సందర్భంగా జరిగిన బహిరంగ సభలో హెరిటేజ్ సంస్థ నా శ్రీమతి, నా కోడలు ఆధ్వర్యంలో అత్యద్బుతంగా జరుగుతుందని సాక్షాత్తు ముఖ్యమంత్రి చెప్పారని గుర్తు చేశారు. మీ కుటుంబ ఆధ్వర్యంలో హెరిటేజ్ అంత సశ్చీలతతో అభివృద్ధి చెందితే మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రం ఎందుకు 450 శాతం కంటే అధికంగా దిగజారాయని ప్రశ్నించారు. బహిరంగ సభలో వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత మీకులేదా అని నిలదీశారు.
మోడీనే కాదు ఎవరినైనా నిలదీస్తాంప్రత్యేక హోదా ఎందుకు తీసుకురాలేకపోయారు అని ప్రశ్నిస్తే టీడీపీ మంత్రి దేవినేని పాచిమోహంతో పత్రికా సమావేశం పెట్టి వైయస్ జగన్‌పై వ్యక్తిగత దాడికి దిగుతున్నారని భూమన మండిపడ్డారు. బహిరంగ సభలో ప్రధాని మోడీ గురించి విమర్శించలేదే అని ప్రశ్నిస్తున్నారని, మోడీని తిట్టకపోతే టీడీపీ అంగీకరించే పరిస్థితుల్లో లేదని స్పష్టంగా వారే చెబుతున్నారన్నారు. బీజేపీ నేతలు టీడీపీతో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రత్యేక హోదా కోసం మోడీని కాదు కదా.. ఎవరినైనా నడిరోడ్డులో నిలబెట్టి బట్టలు ఊడదీసి ప్రత్యేక హోదా తీసుకురావడం కోసం అన్ని కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. సాక్షాత్తు మోడీ గుండెలు అదిరేలా ఢిల్లీ జంతర్‌మంతర్‌లో ధర్నా చేసి అరెస్టు అయిన వ్యక్తి వైయస్ జగన్ అని మంత్రులకు గుర్తుకు రావడం లేదా అని ప్రశ్నించారు. మోడీని తిట్టమని టీడీపీ అధికారికంగా ప్రకటన ఇస్తే బాగుటుందన్నారు.
ప్రత్యేక హోదా ఎందుకు తీసుకురాలేకపోయారో దానికి సమాధానం చెప్పకుండా టీడీపీ మంత్రులు పీతల సుజాత, అయ్యన్నపాత్రుడు జై ఆంధ్రప్రదేశ్ సభ జరుగుతుండగా తప్పుడు ప్రకటనలు ఇచ్చారని మండిపడ్డారు. ఇప్పటికీ ప్రభుత్వ రంగంలో లక్షా 30,151 ఉద్యోగాలను ఇచ్చామని, 2,23,385 ప్రైవేట్ ఉద్యోగాలు ఇప్పంచామని నిసిగ్గుగా అబద్దాలు చెబుతున్నారని విరుచుకుపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వానికి సిగ్గు, ఎగ్గు, లజ్జ ఉంటే సీఎం డ్యాష్ బోర్డులో ఈ ప్రభుత్వ ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చారో వారి పేర్లతో సహా రేపు సాయంత్రంలోగా ప్రకటించాల్సిందిగా డిమాండ్ చేశారు. లేకపోతే పచ్చి అబద్దాలు చెప్పి ప్రజలను పక్కదారి మళ్లించి హోదా అవసరం లేదని చెప్పడానికి వక్రమార్గాలు ఎంచుకున్నామని టీడీపీ నేతలు ప్రజలకు క్షమాపణలు చెప్పాలన్నారు.
అధికారం కోసం వెంకయ్య, వచ్చాక బొంకయ్యజై ఆంధ్రప్రదేశ్ నినాదంతో వైయస్‌ఆర్ సీపీ నిర్వహించిన సభ చారిత్రాత్మక సభగా జరిగిందని విశాఖ ప్రాంత వాసులంతా చెప్పుకుంటున్నారని భూమన స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా గళం వైయస్ జగన్ గొంతు ద్వారానే ప్రపంచానికి తెలుస్తుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారన్నారు. అనేక పోరాటాలు, ఉద్యమాలు చేసిన ప్రతిపక్షనేత ప్రత్యేక హోదా పోరాటం చేస్తూ ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నారన్నారు. రెండున్నర సంవత్సరాల్లో బాబు ప్రభుత్వం ఒక్క హామీని కూడా నెరవేర్చకపోగా చెప్పని వాగ్ధానాలను కూడా చేశామని బొంకుతున్నారని ఫైరయ్యారు. ఏరు దాటక ముందు ఏటి మల్లన్న, ఏరు దాటాకా బోడి మల్లన్న సామెత అన్న చందాన... అధికారంలోకి వచ్చేంత వరకు వెంకయ్య, అధికారంలోకి వచ్చాక బొంకయ్య అనే సామెతను స్థిరపరుచుకుంటున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు, వెంకయ్యలు కృష్ణార్జులులా కాపాడుతారని ఓట్లు వేస్తే అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రానికి రాహుకేతువులా తగులుకున్నారని విమర్శించారు. ప్రజలకు ద్రోహం చేస్తూ హోదా అవసరం లేదు గొప్ప ప్యాకేజీని తీసువచ్చి ప్రజలకు మేలు చేస్తున్నామని సన్మానాలు చేయించుకుంటున్నారని విమర్శించారు.
వైయస్ జగన్ సభ విజయవంతాన్ని తట్టుకోలేకుండా ఒక్కసారిగా రాక్షసుల్లా ఆయన వ్యక్తిత్వంపై దాడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిచ్చగాడిని రాజును చేస్తే బంగారు బొచ్చలో అడుక్కున్న చందంగా అధికారంతో ప్రజలకు మేలు చేయకపోగా ప్రతిపక్షంలో ఉన్నట్లు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. టీడీపీ బ్రాండ్ అంబాసిడర్ వెంకయ్య ప్రత్యేక హోదాను బలవంతంగా పెరికివేస్తున్నారు. ఎన్ని రకాలుగా విమర్శించినా వైయస్ జగన్ పోరాటం నుంచి వెనుదిరిగే ప్రసక్తేలేదన్నారు. ఇలాంటి సభలను మరిన్ని జరిపి ప్రజల ఆశీస్సులు పొందుతాం. ప్రత్యేక హోదా వచ్చేవరకు ఉధృతంగా పోరాటం కొనసాగిస్తూనే ఉంటామని హెచ్చరించారు. ఇప్పటికైనా చంద్రబాబు, వెంకయ్యలు హోదా గళంలో చేతులు కలపండి లేకపోతే చేతగాని వారిమని చేతులు జోడించి నమస్కరించాలని సూచించారు.