అంతమొందిస్తామంటూ టీడీపీ నేతల బెదిరింపులు

  • అంత కసి ఉంటే తనపై తీర్చుకోండి
  • అంతేగానీ మా ప్రజాప్రతినిధుల జోలికొస్తే ఊరుకోం
  • టీడీపీకి వైయస్ వివేకానందరెడ్డి హెచ్చరిక
వైయస్ఆర్ కడప అగ్రికల్చర్‌: టీడీపీ నాయకులు తనతో కానీ, తన కుటుంబంతో కానీ రాజకీయంగా ఎదుర్కొని తేల్చుకోవాలని వైయస్సార్‌సీపీ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి వైయస్‌ వివేకానందరెడ్డి సవాల్‌ చేశారు. అంత కసి ఉంటే తనపైన, తన కుటుంబంపైన తీర్చుకోవాలేగానీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులపై దాడులకు తెగబడటం నీచ రాజకీయాలకు నిదర్శనమని మండిపడ్డారు.

వైయస్సార్‌ జిల్లా కడపలోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. స్థానిక సంస్థలకు చెందిన ప్రజాప్రతినిధుల కుటుంబాలను అంతమొందిస్తామని టీడీపీ నేతలు బెదిరించడం ప్రజాస్వామ్యంలో పనికి రాదన్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రే ఇలాంటి చర్యలకు దిగమని చెప్పినట్లు అనుమానం కలుగుతోందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి బలహీనవర్గాలకు చెందిన వైయస్సార్‌సీపీ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లపై నిత్యం దాడులకు తెగబడుతుండటం దుర్మార్గమన్నారు. ఈ దాడులను చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదన్నారు.

జిల్లాలో నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగే పరిస్థితులు కనిపించడం లేదని, ప్రభుత్వమే దుర్మార్గాలకు పాల్పడుతుంటే ఎన్నికలు సజావుగా జరుగుతాయా? అని వివేకా అనుమానం వ్యక్తం చేశారు. జిల్లాలో అధికార పార్టీ కొనసాగిస్తున్న అరాచకాలు, దౌర్జన్యాలు, దాడులపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఎన్నికలను సజావుగా నిర్వహించడానికి వీలుగా జిల్లాకు ఎన్నికల పరిశీలకుడిని పంపించాలని కోరతామన్నారు.
Back to Top