ప్రజా సమస్యల పరిష్కరానికి చొరవ చూపండి

వెంకటాచలం: ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు అధికారులు చొరవ చూపాలని సర్వేపల్లి ఎమ్మెల్యే గోవర్థన్‌రెడ్డి సూచించారు. వెంకటాచలంలోని తహసీల్దార్‌ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్‌ డే కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరై ప్రజలు ఇచ్చిన అర్జీలను స్వీకరించారు. కంటేపల్లి, సర్వేపల్లి, కసుమూరు, కనుపూరు తదితర గ్రామాల ప్రజలు తమ సమస్యలపై అర్జీలిచ్చారు. సర్వేపల్లిలో క్రిభ్‌కో కంపెనీ ఏర్పాటుకు భూములు కోల్పోయిన వారిని ఇప్పటికీ పరిహారం ఇవ్వలేదని ఇద్దరు రైతులు వినతిపత్రం ఇచ్చారు. అలాగే కంటేపల్లి హరిజనవాడలో అర్హులైన పేదలకు ఇళ్లస్థలాలు చూపాలని స్థానికులు అర్జీ ఇచ్చారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజలు ఇచ్చే అర్జీలను క్షేత్రస్థాయిలో పరిశీలన చేయించి సత్వర పరిష్కారానికి చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. అధికారుల పనితీరు ప్రజలకు సంతృప్తికరంగా ఉండాలని తెలియజేశారు. నెలల తరబడి అర్జీదారులను కార్యాలయాల వెంట తిప్పుకోవడం మంచిపద్దతికాదని సూచించారు. ప్రజల సమస్యలను పరిష్కరించే భాద్యత మీపైఉందనే విషయాన్ని మరువరాదన్నారు. క్రిభ్‌కో భూములు కోల్పోయిన లబ్దిదారులకు పరిహారం, కంటేపల్లిలో ఇళ్ల స్థలాలు చూపడం వెంటనే చేయాలని తహసీల్దార్‌ సోమ్లానాయక్‌కు సూచించారు.

Back to Top