వైయ‌స్ఆర్‌సీపీ విద్యార్థి విభాగం ఆధ్వ‌ర్యంలో దీక్ష‌లు

వైయ‌స్ఆర్ జిల్లా:  కేంద్ర బ‌డ్జెట్‌లో రాష్ట్రానికి జ‌రిగిన అన్యాయానికి నిర‌స‌న‌గా ఈ నెల 4న రాష్ట్ర‌వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వ‌ర్యంలో ఒక రోజు  నిరాహార దీక్ష చేప‌ట్ట‌నున్న‌ట్లు విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్య‌క్షుడు స‌లాంబాబు తెలిపారు. ఈ మేర‌కు క‌డ‌ప‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ..కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ప్ర‌వేశ‌పెట్టిన బ‌డ్జెట్‌లో ఏపీకి అన్యాయం జ‌రిగింద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. విభ‌జ‌న చ‌ట్టంలోని ప్ర‌త్యేక‌హోదా, విశాఖ రైల్వే జోన్‌, వెనుక‌బ‌డిన ప్రాంతాలకు ప్ర‌త్యేక ప్యాకేజీ వంటి అంశాల‌కు బ‌డ్జెట్‌లో చోటు ద‌క్క‌లేద‌న్నారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి నిధులు సాధించ‌డంలో చంద్ర‌బాబు ప్ర‌భుత్వం విఫ‌ల‌మైంద‌ని మండిప‌డ్డారు.  క‌రువు పీడిత ప్రాంతాలైన రాయ‌ల‌సీమ‌, ఉత్త‌రాంధ్ర‌ల‌కు ప్ర‌త్యేక ప్యాకేజీ ఇచ్చి, ఇక్క‌డి సాగునీటి ప్రాజెక్టుల‌ను కేంద్రం పూర్తి చేయాల‌ని స‌లాంబాబు డిమాండ్ చేశారు. శ‌నివారం త‌ల‌పెట్టిన నిరాహార‌దీక్ష‌లో విద్యార్థులంద‌రూ పాల్గొని విజ‌య‌వంతం చేయాల‌ని స‌లాంబాబు పిలుపునిచ్చారు.
Back to Top