హైదరాబాద్: పోలవరం సహా పలు సాగునీటి ప్రాజెక్టులన్నీ తానే పూర్తి చేసినట్టు అసెంబ్లీలో చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెబుతున్నారని, పోలవరం ప్రాజెక్టుకి శంకుస్థాపన చేసి వదిలేయడంతప్ప ఆయన చేసిందేమీ లేదని.. పైగా ఆయన చేసిన తప్పుల కారణంగా పోలవరం ప్రాజెక్టుకి తీవ్రమైన నష్టం జరిగిందని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ పునర్‌వ్యవస్థీకరణ చట్టం ప్రకారం కేంద్రం పూర్తి చేయాల్సిన పోలవరం ప్రాజెక్టును కమీషన్ల కక్కుర్తితో చంద్రబాబు తెచ్చుకుని నాశనం చేశాడని బుగ్గన వివరించారు. 2004-09 మధ్య పోలవరం ప్రాజెక్టుకు అన్ని అనుమతులు తీసుకొచ్చి కుడి ఎడమ కాలువ నిర్మాణంతోపాటు భూసేకరణ పనులన్నీ వైయస్సార్ పూర్తి చేశారని, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు 15 శాతం భూసేకరణకు రూ. వేల కోట్లు వెచ్చించారని చెప్పారు. అంతేకాకుండా స్పిల్ వే, స్పిల్ ఛానెల్, ఇన్ లెట్, అవుట్ లెట్ చానెల్స్ లేకుండా డయాఫ్రం వాల్ కట్టడం వల్ల పోలవరం ప్రాజెక్టుకి దెబ్బతిన్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. కేవలం ఇరిగేషన్ కాంపోనెంట్ మాత్రమే చెల్లించేలా రూ.20 వేల కోట్లతో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేలా చంద్రబాబు ఒప్పందం చేసుకోవడం చారిత్రక తప్పిదమని బుగ్గన అభిప్రాయపడ్డారు. 2019లో అధికారంలోకి వచ్చిన వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం చంద్రబాబు చేసిన తప్పులన్నీ సరిచేసుకుంటూ వచ్చిందని, పలుమార్లు ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు, అధికారులతో మాట్లాడి పోలవరం ప్రాజెక్టు వ్యయాన్ని రూ. 47 వేల కోట్లకు ఒప్పించామని చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చాక గతేడాది అక్టోబర్‌లో విడుదలైన రూ. 12,711 కోట్లు కూడా నాటి సీఎం వైయస్ జగన్ కృషితో వచ్చినవేనని స్పష్టం చేశారు. 2024 అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం గతంలో చేసిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోకుండా వాటినే రిపీట్ చేస్తూ వస్తుందని బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఆరోపించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. పోలవరం పనులపై చంద్రబాబు లెక్కలన్నీ సాంకేతికంగా తప్పులే అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టులో చాలా సమస్యలున్నాయని చెబుతున్నారు. భూసేకరణ, కాంట్రాక్టు లిటిగేషన్, రైట్ మెయిన్ కెనాల్ లిటిగేషన్ లాంటి సమస్యలను ఒక్కొక్కటిగా అధిగమిస్తూ వస్తున్నామని చెప్పారు. 2019 నాటికి గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే 72 శాతం ప్రాజెక్టును పూర్తి చేశామని, డయాఫ్రం వాల్, స్పిల్ వే వందశాతం, స్పిల్ వే కాంక్రీట్ 82 శాతం, 75 శాతం స్పిల్ ఛానెల్ వర్కులు, 70 కాఫర్ డ్యామ్ వర్కులు, ఆర్ఎంసీ పనులు 100 శాతం పూర్తి చేసి 82 శాతం ఎర్త్ వర్క్ లైనింగ్ పూర్తి చేశామని, లెఫ్ట్ మెయిన్ కెనాల్(ఎల్ఎంసీ) 91 శాతం పూర్తి చేసి ఎర్త్ వర్క్ 70 శాతం, లైనింగ్ 56 శాతం చేశామని... ఆర్ అండ్ఆర్ కూడా పూర్తి చేస్తున్నామని చంద్రబాబు అసెంబ్లీలో చెబుతున్నాడు. ఇదంతా చూస్తుంటే చంద్రబాబు చెప్పేదన్నా అబద్ధం కావాలి, లేదా అధికారులైనా తప్పుడు లెక్కలు ఇచ్చి ఉండాలి. ఆర్ఎంసీ వందశాతం పూర్తి చేసినప్పుడు ఎర్త్ వర్కు 82 శాతమే చేయడం ఏంటి? ఎర్త్ వర్కు లేకుండా ఆర్ఎంసీ 100 శాతం ఎలా పూర్తవుతుందో పెద్ద కాంట్రాక్టర్లకు కూడా అర్థంకాదు. ఎల్ఎంసీ 91 శాతం పూర్తయితే ఎర్త్ వర్క్ 70 శాతం చేయడం ఏంటి? ఇలా సాంకేతిక అంశాల పరంగా చూస్తే చంద్రబాబు చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలని ఎవరికైనా స్పష్టంగా తెలిసిపోతుంది. పోలవరం ప్రాజెక్టుకి ఈ దుస్థితి పట్టిందంటే దానికి వందశాతం తెలుగుదేశం పార్టీయే, చంద్రబాబే కారణం. శిలాఫలకం వేయడం మినహా చంద్రబాబు చేసిందేం లేదు స్పిల్ వే, స్పిల్ ఛానెల్, ఇన్ లెట్ చానెల్, అవుట్ లెట్ చానెల్, నదీ ప్రవాహాన్ని డైవర్ట్ చేయకుండా కాఫర్ డ్యాం పూర్తి కాకుండా డయాఫ్రం ఎలా కట్టాడో ఇప్పటికీ ఎవరికీ అర్థంకాని శేష ప్రశ్న. గోదావరి నీటిని ఆపకుండా, డైవర్ట్ చేయకుండా నది మధ్యలో గోడ ఎలా కట్టాడు. వరద నీటిని ఆ గోడ ఎలా తట్టుకుంటుంది? స‌్పిల్ వే స్పిల్ ఛానెల్ డయాఫ్రం వాల్ పూర్తి చేయకుండా డయాఫ్రం వాల్ ఎవరైనా కడతారా? జనాలు నవ్వుతారనే ఆలోచన లేకుండా పోలవరం మొదలు పెట్టింది తానేనని అసెంబ్లీలో చంద్రబాబు మరో పచ్చి అబద్ధం చెప్పాడు. టీడీపీ నాయకులు కూడా చంద్రబాబు మించిపోయి నాగార్జున సాగర్ కూడా ఆయనే కట్టాడని చెప్పేలా ఉన్నారు. అంతలా దిగజారిపోయి ఆయనకి భజన చేస్తున్నారు. ఇవన్నీ అబద్ధాలని వైయస్ఆర్‌సీపీ ప్రశ్నిస్తే మాపై కేసులు పెడుతున్నారు. ప్రపంచంలో ఏదైనా టెక్నాలజీ వచ్చినప్పుడు, ఏదైనా కొత్త ఆవిష్కరణ జరిగితే దాని గురించి సందర్భం లేకపోయినా మాట్లాడి తనకు అన్నీ తెలుసన్నట్టు కలరింగ్ ఇచ్చుకుంటాడు. ప్రజల నుంచి ఏదైనా డిమాండ్ వచ్చినప్పుడు వారి నోళ్లు మూయించడానికి శంకుస్థాపన పేరుతో శిలఫలకం వేయడం.. తర్వాత రోజుల్లో అది అభివృద్ధి చెందినప్పుడు అది నేనే మొదలుపెట్టానని ప్రచారం చేసుకోవడం మొదట్నుంచీ చంద్రబాబుకి అలవాటు. ఫిబ్రవరి 26, 2024న వైయస్ఆర్‌సీపీ హయాంలోనే కుప్పంకి నీరిస్తే తానే నీళ్లిచ్చానని చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నాడు. ప్రాజెక్టు అనుమతులు, భూసేకరణ, కుడి, ఎడమ కాలువ పనులన్నీ వైయస్సారే చేశారు పోలవరం ప్రాజెక్టుకి 1941లో ప్రపోజల్ వస్తే వైయస్సార్ ముఖ్యమంత్రి అయ్యేవరకు కూడా దానిపై కదలిక లేదు. 1980లో టంగుటూరు అంజయ్య ఒకసారి శిలాఫలకం వేశారు. వైయస్సార్ ముఖ్యమంత్రి అయ్యాకనే పర్యావరణ అనుమతులు అక్టోబర్ 2005, వన్యప్రాణుల రక్షణ చట్టం అనుమతి జూలై 2006, పునరావాస ప్రణాళిక అనుమతి ఏప్రిల్ 2007, సుప్రీంకోర్టు ద్వారా పాపికొండల వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం తరలింపు అనుమతి సెప్టెంబర్ 2008, అటవీశాఖ స్టేజ్ 1 డిసెంబర్ 2008, కేంద్ర ప్రణాళిక శాఖ అనుమతి ఫిబ్రవరి 2009, సెంట్రల్ వాటర్ కమిషనర్ సాంకేతిక అనుమతి జనవరి 2009, కేంద్ర ఆర్థిక శాఖ కమిటీ అనుమతి మార్చి 2009, అటవీ శాఖ స్టేజ్ 2 అనుమతి జూలై 2010లో వచ్చాయి. ఈ అనుమతులన్నీ వైయస్సార్ ముఖ్యమంత్రిగా ఉండగా వచ్చినవే. పోలవరం పనులు మొదలైందే వైయస్సార్ హయాంలో. 24.03.2005న స్పిల్ వే, అనుబంధ పనులకు రూ. 634 కోట్లతో టెండర్లు పిలిచారు. అర్త్ కం రాక్ ఫిల్ డ్యాం పనులకు ఆగస్టు 11, 2006న టెండర్లు పిలిచారు. 2009 ఆగస్టు 28న సెంట్రల్ వాటర్ కమిషన్ డిజైన్లకు అనుమతి లభించింది. హెడ్ వర్క్క్, డ్యాం వర్క్క్, ఇతర పనులకు వేర్వేరుగా టెండర్లు పిలిస్తే ఇబ్బంది వస్తుందని భావించిన వైయస్సార్ అన్నింటికీ ఒకే టెండర్లు వేయించిన మాట వాస్తవమా కాదో చంద్రబాబు చెప్పాలి. అప్పట్లో కుడికాలువ 330 క్యూమెక్స్ పారకం ఉంటే ఇది చాలదని 496 క్యూమెక్స్‌కి మార్చిన మాట వాస్తవం కాదా. అదేవిధంగా ఎడమ కాలువకు సంబంధించి 230 క్యూమెక్స్ పారకం ఉంటే దాన్ని 496 క్యూమెక్స్‌కి డిజైన్లు మార్చిన మాట వాస్తవమా కాదా. పెట్టుబడుల క్లియరెన్స్‌కి 25.02.2009న రూ.10,151 కోట్లకు ప్రభుత్వం అనుమతులు పొందిన విషయం నిజమా కాదా? కుడి కాలువకు భూసేకరణ నిమిత్తం 10,628 ఎకరాలు (86 శాతం) 2014కి ముందే చంద్రబాబు సీఎం కాకమునుమే అయిపోయింది. సగటు రూ. 3.67 లక్షలు చెల్లిస్తే, చంద్రబాబు మిగిలిన 14 శాతం భూసేకరణ కోసం 2014-19 మధ్య ఎకరాకు సగటున రూ. 47 లక్షలు చెల్లించాడు. అలాగే ఎడమ కాలువకు సంబంధించి 2004-14 మధ్య 10,343 ఎకరాలు (98 శాతం) భూ సేకరణపూర్తి చేశారు. దీనికోసం ఎకరాకు రూ. 2.30 లక్షల ప్రకారం చెల్లించడం జరిగింది. 2014-19 మధ్య 95 ఎకరాల భూసేకరణకు రూ.9.37 లక్షలు చెల్లించారు. ఇవన్నీ తెలిసి కూడా పోలవరం నేనే మొదలుపెట్టానని చంద్రబాబు చెప్పుకుంటాడు. కమీషన్ల కక్కుర్తితో ప్రాజెక్టుకు చంద్రబాబు వెన్నుపోటు పోలవరం ప్రాజెక్టును అడ్డం పెట్టుకుని రూ. వేల కోట్లు దోచుకోవడమే ఆయన చేసిన పని. పోలవరంకి జరిగిన నష్టం మొత్తం చంద్రబాబు కారణంగా జరిగిందే. 2014 ఏప్రిల్ కేబినెట్ నోట్‌లో విశాఖకి తాగునీటి అవసరాల కోసం, విశాఖ స్టీల్‌ప్లాంట్ కోసం 24 టీఎంసీలు పోలవరం ద్వారా తరలించాలని నిర్ణయించి ఆ తర్వాత దాన్ని పట్టించుకోకుండా వదిలేశారు. 2019లో వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకనే దాన్ని పునరుద్ధరించడం జరిగింది. 2014 నాటికే రూ. 5,135 కోట్లు ఖర్చయిందని అదే కేబినెట్ నోట్‌లో చెప్పారు. 2010-11 ధరల ప్రకారం పోలవరం పూర్తి చేయడానికి రూ.16 వేల కోట్లు అవసరమని, కానీ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్న కొద్దీ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా నిర్మాణ వ్యయం పెరుగుతుందని, దాంతోపాటు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం కూడా పెరిగిపోతుందని నోట్‌లో స్పష్టంగా రాసి ఉన్నా కేంద్రాన్ని అడగలేదు. పునర్‌వ్యవస్థీకరణ చట్టం ప్రకారం పెరిగిన ధరలకు అనుగుణంగా కేటాయింపులు చేయడానికి కేంద్రం సిద్ధంగా ఉన్నప్పటికీ, కేంద్రం పూర్తి చేయాల్సిన ప్రాజెక్టును కమీషన్ల కక్కుర్తితో రాష్ట్రమే పూర్తిచేస్తుందని అనుమతులు తెచ్చుకుని పోలవరాన్ని నాశనం చేసిన ఘనుడు చంద్రబాబు. ప్రాజెక్టును దక్కించుకోవాలన్న కక్కుర్తితో 2014లో 2011-12 రేట్లకు రూ.16 వేల కోట్లతో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని ఒప్పుకుని చారిత్రక తప్పిదం చేశాడు చంద్రబాబు. విశాఖకు తాగునీటి అవసరాలను కూడా పణంగా పెట్టి మరీ కేంద్రం నుంచి ప్రాజెక్టు తెచ్చుకున్నాడు. ఆ మేరకు ఏప్రిల్ 2014 తర్వాత ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణ ఖర్చును(ఇరిగేషన్ కాంపోనెంట్ ) మాత్రమే కేంద్రం భరించేలా సెప్టెంబర్ 8, 2016 అర్ధరాత్రి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో ఒప్పందం చేసుకున్నాడు. ఎలాగైనా ప్రాజెక్టుని దక్కించుకోవాలన్న కోరికతో ప్రాజెక్టు భూసేకరణ, విశాఖకి తాగునీటి అసవరాలు, స్టీల్ ప్లాంట్‌కి నీటి తరలింపు వంటి అంశాలను ఉద్దేశపూర్వకంగానే పక్కన పెట్టేశాడు. చంద్రబాబు ప్రభుత్వం చేసిన ఈ తప్పులన్నీ సరిదిద్దడానికి మాకు ఐదేళ్లు పట్టింది. రూ. 47 వేల కోట్లు చెల్లించేలా కేంద్రాన్ని ఒప్పించిన వైయస్ జగన్ రూ. 50 వేల కోట్లకు పూర్తయే ప్రాజెక్టును కేవలం రూ.20 వేల కోట్లకే పూర్తి చేస్తామని చంద్రబాబు కేంద్రంతో ఒప్పుకుని వచ్చి రాష్ట్రానికి తీరని ద్రోహం చేశాడు. వాటన్నింటిపై కేంద్రంతో మాట్లాడి రూ. 50 వేల కోట్లకు పెంచుతూ కేంద్రాన్ని ఒప్పించాం ఇది సరిద్దడానికి మాకు ఐదేళ్లు సరిపోయింది. పోలవరం ప్రాజెక్టు అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడి అని ప్రధాని మోడీ, ఆర్ధిక మంత్రితో, జలవనరుల శాఖ మంత్రితో పలుమార్లు మాట్లాడి వారిని ఒప్పించారు. రాష్ట్ర విభజనతో ఏపీ తీవ్రంగా నష్టపోయిందని పునర్‌వ్యవస్థీకరణ చట్టం ప్రకారం పోలవరం ప్రాజెక్టును కేంద్రమే పూర్తి చేయాలని వారితో సంప్రదింపులు జరిపి ప్రాధేయపడి నాటి ముఖ్యమంత్రి వైయస్ జగన్ మూసేసిన ఫైల్‌ను రీఒపెన్ చేయించారు. రెండు దశల్లో ప్రాజెక్టును పూర్తి చేసేవిధంగా 41.15 మీటర్లకు మొదటి ఫేజ్, 45.72 మీటర్లకు రెండో ఫేజ్ గా నిర్ణయించాం. భూసేకరణ మాత్రం రెండేళ్లు నీళ్లు నింపిన తర్వాత మూడో ఏడాది రెండో విడత భూసేకరణ చేసేలా ఒప్పందం చేసుకుని వచ్చాం. ఆ మేరకు పోలవరం ప్రాజెక్టు అథారిటీకి, సెంట్రల్ వాటర్ కమిషన్, కేంద్ర ఆర్థిక శాఖ, కేంద్ర జల్ శక్తికి, ఏపీ ప్రభుత్వం మధ్య రాతపూర్వకంగా ఒప్పందాలు జరిగాయి. దీంతోపాటు గత చంద్రబాబు ప్రభుత్వం వదిలేసి విశాఖకు సంబంధించి సాగునీటి తరలింపుని విస్మరిస్తే దానిపై కూడా జనవరి 10, 2022న ఏపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు అథారిటీకి లేఖ రాసి రూ. 7 వేల కోట్లు మంజూరు చేయాలని కోరడం జరిగింది. ఆ విధంగా మొదటి ఫేజ్ లో 41.15 మీటర్ల వద్ద, ప్రాజెక్టు రెండో ఫేజ్‌లో 45.72 మీటర్ల వద్ద కలిగే ప్రయోజనాలను వివరిస్తూ పీపీఏ, సెంట్రల్ వాటర్ కమిషన్, ఏపీ ప్రభుత్వానికి లేఖలు రాశాయి. చివరికి జూన్ 5, 2023న సవరించిన రేట్లతో ప్రాజెక్టు నిర్మాణం, విశాఖ తాగునీటి అవసరాల కోసం ప్రాజెక్టు నిర్మాణం, డయాఫ్రం వాల్‌కి జరిగిన నష్టం వంటి సమస్యలన్నీ క్లియర్ చేసుకునే విధంగా 41.15 లెవల్‌కి రూ. 12,911 కోట్లు విడుదల చేయడానికి కేంద్రం ఆమోదం తెలిపింది. గత చంద్రబాబు ప్రభుత్వం మొదటి ఫేజ్‌కి రూ.20 వేల కోట్లకే ప్రాజెక్టుని పూర్తి చేసేలా ఒప్పందం చేసుకుని వస్తే దానికి అదనంగా మరో రూ.12,911 కోట్లు చెల్లించేలా కేంద్రాన్ని నాటి సీఎం వైయస్ జగన్ ఒప్పించి ఆ మేరకు అనుమతులు తీసుకొచ్చారు. రూ. 20 వేల కోట్లకు చంద్రబాబు ఒప్పుకుని వచ్చిన ప్రాజెక్టును పూర్తి నీటిమట్టం 45.72 మీటర్లకు పూర్తిచేయడంతోపాటు పునరావాసం భూసేకరణ చేసేలా రూ. 47 వేల కోట్లకు తిరిగి ఒప్పించడం జరిగింది. కేంద్రం ఇచ్చిన పోలవరం నిధులు దారిమళ్లింపు 2024 మళ్లీ చంద్రబాబు అధికారంలోకి వచ్చాక సెప్టెంబర్ 6, 2024న రూ.12,911 కోట్లు నిధుల విడుదల సందర్భంగా మొదటి ఫేజ్ అని రాయకుండా మొత్తం ప్రాజెక్టుని అనేలా కేంద్రం మెన్షన్ చేయకుండా వదిలేస్తే కూటమి ప్రభుత్వం కనీసం నోరు మెదపకుండా సమస్యను మళ్లీ మొదటికి తీసుకొచ్చారు. విడుదల చేసిన రూ. 12 వేల కోట్ల నిధులపై పూర్తి స్పష్టత ఇవ్వాలని మా ఎంపీ వైవీ సుబ్బారెడ్డి దీనిపై రాజ్యసభలో కేంద్రాన్ని ప్రశ్నించారు. అప్పటికీ గానీ కేంద్రం రెండు ఫేజుల్లో ప్రాజెక్టు ఉంటుందని ఒప్పుకోలేదు. మొత్తం ప్రాజెక్టుని రూ. 20,398 కోట్లకు టీడీపీ ప్రభుత్వం ఒప్పుకుని వస్తే మేం దాన్ని రూ. 47,725 కోట్లకు పెంచాం. అందులో మొదటిదశలో రూ. 30436 కోట్లకు అనుమతులు తీసుకొచ్చాం. అందులో బ్యాలెన్స్ డబ్బు రూ. 12,911 కోట్లు కూటమి ప్రభుత్వం వచ్చాక విడుదల చేశారు. ఫేజ్ 2లో మరో రూ. 17500 కోట్ల వరకు రాబోతున్నాయి. ఇదంతా వైయస్ఆర్‌సీపీ సాధించిన ఘనతే. వైయస్ఆర్‌సీపీ సాధించిన నిధులు కూటమి ప్రభుత్వం వచ్చాక విడుదలయ్యాయి. అందులో మొదటివిడతలో అక్టోబర్ 9, 2024 రూ. 2348 కోట్లు విడుదల చేస్తూ సింగిల్ నోడల్ ఏజెన్సీలో పెట్టమని చెప్పినా కూటమి ప్రభుత్వం పట్టించుకోలేదు. జల్ శక్తి కోప్పడితే ఎట్టకేలకు జనవరి 14, 2024లో ఖర్చు చేశారు. రెండో విడత మార్చి 12, 2025న రూ. 2700 విడుదల చేస్తే అందులో రూ. 200 కోట్లు మాత్రమే వినియోగించే రూ. 2500 కోట్లు దారిమల్లించారు. కొత్తగా 5 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చిన వైయస్ జగన్ ఇప్పుడు కొత్తగా సాగునీటి ప్రాజెక్టులకు ఐదేళ్లలో రూ. 60 వేల కోట్లు ఖర్చుచేస్తానని చంద్రబాబు చెబుతున్నాడు. మేం 2024 ఫిబ్రవరిలోనే కుప్పంకి నీళ్లిస్తే హంద్రీనీవా నీటిని కుప్పం ప్రజలకు ఇస్తానని చంద్రబాబు చెబుతున్నాడు. గాలేరు-నగరికి సాగు-తాగు నీరు ఇస్తానని చెబుతున్నాడు. వాస్తవం చూస్తే 2004లో జలయజ్ఞం కింద దివంగత మహానేత వైయస్సార్ 83 ప్రాజెక్టులు చేపట్టి ఆయన చనిపోయే నాటికి 43 ప్రాజెక్టులు పూర్తిచేశారు. ఆవిధంగా 32 లక్షల ఎకరాలకు సాగునీరు అందించారు. 1996 లో హంద్రీనీవాకి చంద్రబాబు శిలాఫలకం వేసి వదిలేశాడు. 2004లో ఆయన దిగిపోయేనాటికి రూ. 14 కోట్లు మాత్రమే ఖర్చు చేశాడు. ఆ ఖర్చు కూడా బహిరంగ సభలు, ఉద్యోగుల జీతాలకే సరిపోయింది. వైయస్సార్ సీఎం అయ్యాక హంద్రీనీవా ప్రాజెక్టు కోసం రూ. 6950 కోట్లు ఖర్చు చేశాడు. 80 శాతం పనులు పూర్తి చేశారు. శ్రీశైలం నుంచి 795 అడుగులకే ముచ్చుమర్రి దగ్గర ఆగస్టు 31, 2007న పంపింగ్ మొదలుపెట్టారు. చంద్రబాబు ఖర్చు చేసిన రూ. 14 కోట్లు ఎక్కడ వైయస్సార్ చేసిన రూ. 6950 కోట్లెక్కడ? వెలిగొండ ప్రాజెక్టుకి 1996లో ఫౌండేషన్ రాయి వేసి ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా వదిలేశాడు. వైయస్సార్ సీఎం అయ్యాక రూ. 3580 కోట్లు ఖర్చు చేసి సింహభాగం పనులు పూర్తి చేశారు. ఆ తర్వాత మళ్లీ 2019లో వైయస్ జగన్ సీఎం అయ్యాక వెయ్యి కోట్లు ఖర్చు చేసి వెలిగొండ టన్నెల్ పనులు పూర్తి చేశారు. వైయస్ జగన్ సీఎం అయ్యాక సంగం బ్యారేజీ, నెల్లూరు బ్యారేజీ పనులు పూర్తి చేశారు. గాలేరు-నగరి పనులు చేశారు. వెలిగొండ టన్నెల్ పనులు చేశారు. పులిచింతల, గండికోట, చిత్రావతి, సోమశిల, కందలేరు, బ్రహ్మంసాగర్ పునరావాసం పనులు పూర్తి చేసి కొత్తగా 5 లక్షల ఎకరాలు నీళ్లిచ్చాం. యూరియా కొరతపై చంద్రబాబు రోజుకో మాట 1.70 లక్షల టన్నుల యూరియా అందుబాటులో ఉందని చెబుతూనే కూటమి ప్రభుత్వం రైతులకు ఒక్క బస్తా యూరియా అందించలేకపోతుంది. యూరియా గురించి అడిగితే కూటమి ప్రభుత్వం కేసులు పెట్టి రైతులను వేధిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీ రైతుల తరఫున మాట్లాడితే చంద్రబాబు భరించలేకపోతున్నారు. ఇంకోపక్క కలెక్టర్ సదస్సులో యూరియా సరఫరాలో విఫలమయ్యామని చంద్రబాబే ఒప్పుకున్నాడు. ఆర్డీవోలకు వినతిపత్రం ఇవ్వడానికి వెళ్తుంటే ప్రభుత్వం భయపడిపోతోంది. మాజీ మంత్రులను హౌస్ అరెస్టులు చేసి అడ్డుకున్నారు. యూరియా సరఫరా కేంద్రాల వద్ద కిలోమీటర్ల కొద్దీ కనిపించే క్యూలైన్లీ అబద్దాలేనా? ఉదయం నుంచి సాయంత్రం వరకు క్యూ లైన్లలో నిలబడినా బస్తా యూరియా దొరకడం లేదని రైతులు చెప్పే మాటలు కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోదా? చంద్రబాబు నియోజకవర్గం కుప్పంలోనూ యూరియా కొరతతో రైతులు అల్లాడిపోతుంటే ఆయన కళ్లకు కనిపించలేదు. టీడీపీ నాయకులు విలేజ్ సెక్రటరీలను బెదిరించి యూరియాని ఎక్కడికక్కడ బ్లాక్ మార్కెటింగ్‌కి తరలించి కృత్రిమ కొరత సృష్టించారు. రైతులకు దక్కాల్సిన యూరియాని వారే పంచుకుతిన్నారు. యూరియా బ్లాక్ మార్కెట్‌కి తరలించిన టీడీపీ నాయకుల మీద టీడీపీ నాయకులే దాడులు చేసి ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్న ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. ఇవన్నీ ప్రతి గ్రామంలో రైతుల కళ్లెదుటే జరిగినవి. చంద్రబాబు దాచేస్తే దాగేవి కావు. పంటల సేకరణ జరగడం లేదు కాబట్టే రైతు నష్టపోతున్నాడు వైయస్ఆర్‌సీపీ హయాంలో 2023లో మిరప మద్దతు ధర రూ. 7 వేలుంటే దక్కిన ధర రూ. 21 వేలు. కూటమి ప్రభుత్వం వచ్చాక రూ. 2వేలకు మించి పలకడం లేదు. పత్తికి 2023లో మద్దతు ధర రూ. 7,020 రైతుకు రూ. 9,500 నుంచి రూ.10,600 వేలకు పైగానే అమ్ముకున్నాడు. కానీ ఇప్పుడు మద్దతు ధర చూస్తే రూ. 7621 కాగా దక్కింది మాత్రం రూ. 4 వేల నుంచి రూ. 5800 మాత్రమే. ప్రభుత్వం మద్దతు ధరకు సేకరణ చేయకపోవడంతో మార్కెట్ ధరలు దారుణంగా పతనమై రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వైయస్ఆర్‌సీపీ హయాంలో వ్యవసాయం పండగలా జరిగితే నేడు వ్యవసాయం దండగ అనేలా ఉంది. నాడు మా ప్రభుత్వంలో దగ్గరుండి మద్దతు ధరలకు పంటలు కొనుగోలు చేశాం కాబట్టే ఏ పంట చూసినా మద్దతు ధర కన్నా దక్కిన ధరే ఎక్కువగా ఉంది. మార్క్‌ఫెడ్ ద్వారా 2019-24 వరకు పప్పు శెనగకి రూ. 1750 కోట్లు, మొక్కజొన్నకు రూ. 2180 కోట్లు చెల్లించి పంట సేకరణ చేశాం. వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో వైయస్సార్ రైతు భరోసా ద్వారా రైతులకు రూ. 34,288 కోట్లు, కౌలు రైతులకు సీసీఆర్సీ కార్డుల ద్వారా రూ. 731 కోట్లు బీమా, రూ. 424 కోట్లు పంట నష్టపరిహారం అందించి ఆదుకున్నాం. కౌలు రైతులకు పెట్టుబడి సాయం కింద రూ. 751 కోట్లు చెల్లించాం. నేడు కౌలు రైతులను పట్టించుకున్న పాపానపోవడం లేదు. కూటమి ప్రభుత్వం ఉచిత పంటల బీమా ఊసే ఎత్తడం లేదు. జీఎస్డీపీ పెరిగితే ఆదాయం పెరగాలి కదా? ఎక్కడైనా మూడు నెలలకు స్థూల ఉత్పత్తి ఉంటుందా? కేవలం మూడు నెలల లెక్కలు తీసుకుని కేంద్రాని కన్నా ఎక్కువ సాధించామని గొప్పలు చెప్పుకుంటున్నారు. అంత బాగున్నప్పుడు దాని ప్రకారమే ఆదాయం ఎందుకు పెరగడం లేదు? వైయస్ఆర్‌సీపీ హయాంలో 2019-24 మధ్య స్థూల ఉత్పత్తి 9.98 శాతం పెరిగింది. ఆదాయం కూడా 10 శాతం పెరిగింది. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం 10.5 శాతం స్థూల ఉత్పత్తి పెరిగితే కేవలం 3 శాతం ఆదాయమే పెరిగిందని చెబుతున్నారు. ఇవన్నీ నమ్మగలిగే లెక్కలేనా? కలెక్టర్ కాన్ఫరెన్సులు పెట్టి ఎప్పుడూ చెప్పే సోది మళ్లీ చెబుతున్నాడు. కూటమి ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలంతా సంతోషంగా ఉన్నారని ఆయనే చెప్పుకుంటున్నాడు. సీనియర్ అధికారులను పక్కన కూర్చోబెట్టుకుని సూపర్ సిక్స్ అమలు చేసేశామని ఆయనే చెప్పుకోవడాన్ని బట్టి ఏం సంకేతాలు పంపుదామని అనుకుంటున్నట్టు? ఒక్క సిలిండర్, అరకొరగా తల్లికి వందనం ఇవ్వడం తప్ప చేసిందేమీ లేదు. ప్రతిపక్షం పట్ల చంద్రబాబు ధోరణి అరెస్ట్ అయితే, ప్రభుత్వం పట్ల ప్రజల్లో విశ్వాసంగా వరస్ట్‌గా ఉంది. చంద్రబాబు తనకు తానే సర్టిఫికెట్లు ఇచ్చుకుని గొప్పలు చెప్పుకుంటే సరిపోదు.. ప్రజాస్వామ్యంలో ప్రజలిచ్చిన సర్టిఫికెట్ లే ఫైనల్ అనే విషయాన్ని గుర్తెరిగితే మంచిది.