న్యూఢిల్లీ :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి మంగళవారం లోక్‌సభలో ఉధృత స్థాయిలో ఆందోళన కొనసాగించారు. స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి బైఠాయించారు. ‘జై సమైక్యాంధ్ర’ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. శ్రీ జగన్ వెంట పోడియం వద్ద బైఠాయించిన ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎస్పీవై రెడ్డి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ నినదించారు. ‘సేవ్ డెమొక్రసీ ఇన్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ’, ‘కీప్ ఆంధ్రప్రదేశ్ యునెటైడ్’ అని మేకపాటి, ఎస్పీవై ప్లకార్డులు ప్రదర్శించారు. గత వారం కూడా పార్లమెంట్ సమావేశాల సందర్భంగా శ్రీ వైయస్ జగన్ ఎంపీలు మేకపాటి, ఎస్పీవైతో కలిసి విభజనకు వ్యతిరేకంగా ఆందోళన సాగించిన సంగతి తెలిసిందే.
రెండుసార్లు బైఠాయించిన జగన్:
లోక్‌సభ ఉదయం 11 గంటలకు సమావేశం కాగానే ఇతర పార్టీల సభ్యులతో పాటు జగన్, మేకపాటి, ఎస్పీవై పోడియం వద్దకు వెళ్లారు. శ్రీ జగన్, ఎస్పీవై అక్కడే బైఠాయించి నినాదాలు చేశారు. ఒక వైపు ఈ ముగ్గురు ఎంపీలు, మరోవైపున టీడీపీ, కాంగ్రెస్ సీమాంధ్ర ఎంపీలు, ఇంకా ఇతర పక్షాల సభ్యులు కలిసి సాగించిన ఆందోళనతో లోక్‌సభ దద్దరిల్లింది. సభ సాగడానికి సహకరించాలని స్పీకర్ మీరా కుమార్ చేసిన విజ్ఞప్తిని ఆందోళన చేస్తున్న సభ్యులు లెక్కపెట్టలేదు.
మధ్యాహ్నం 12 గంటలకు సభ వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైనప్పుడు ఉదయం దృశ్యాలే పునరావృతం అయ్యాయి. శ్రీ జగన్, ఎస్పీవై, మేకపాటి స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లి బైఠాయించి నినాదాలు చేశారు.
సభలో గందరగోళం నెలకొన్నా.. వివిధ శాఖల పార్లమెంటరీ స్థాయీ సంఘాల నివేదికలు, బిల్లులను సభలో ప్రవేశపెట్టడానికి స్పీకర్ అనుమతించారు. మంత్రులు, సభ్యులు.. మొత్తం 30 మంది నివేదికలు, సవరణ బిల్లులను సభ ముందు ఉంచారు. ఆఖరున.. తమిళనాడు, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ఎస్టీల జాబితాను సవరించడానికి వీలుగా రాజ్యాంగ సవరణ బిల్లును గిరిజన సంక్షేమ శాఖ మంత్రి కిషోర్ చంద్రదేవ్ బిల్లును సభకు సమర్పించారు. ఈ తతంగం అంతా పూర్తికావడానికి 15 నిమిషాలు పట్టింది. అంతసేపూ శ్రీ జగన్ పోడియం వద్ద కూర్చుని సమైక్య నినాదాలు చేస్తూనే ఉన్నారు.
దిగ్విజయ్‌కు జగన్ ఝలక్:
లోక్‌సభ వాయిదా పడిన తర్వాత ఎంపీలు మేకపాటి, ఎస్పీవై రెడ్డితో కలిసి శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి కొంతసేపు పార్లమెంటు సెంట్రల్‌హాలులో గడిపారు. వెలుపలికి వస్తున్న సమయంలో శ్రీ జగన్‌ను హాలు ద్వారానికి ఓ వైపున విలేకరులతో మాట్లాడుతున్న దిగ్విజయ్‌సింగ్ గమనించారు. ఆయన శ్రీ జగన్ వైపు తిరిగి... ‘జగన్, మిస్టర్ జగన్... ప్లీజ్ కం.. ప్లీజ్ కం’ అని పిలిచారు. దీనికి శ్రీ జగన్ ప్రతిస్పందిస్తూ తాను ఉన్న చోటు నుంచే చేతులెత్తి నమస్కారం పెట్టి ముందుకు కదలబోయారు. ఇది చూసిన దిగ్విజయ్, ‘మీరు నాతో మాట్లాడదల్చుకోలేదా?’ అని శ్రీ జగన్‌ను ప్రశ్నించారు. ‘అవును, నేను మాట్లాడదల్చుకోలేదు’ అని శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి బదులిచ్చి సహ ఎంపీలతో కలిసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు.