తెలుగుజాతి భవిష్యత్తుకు ఓటేయండి

విజయవాడ :

నరేంద్ర మోడీ కోసం ఓటు వేయమని చంద్రబాబు నాయుడు అడుగుతున్నారని, తాను మాత్రం తెలుగు జాతి భవిష్యత్తు కోసం ఓటడుగుతున్నానని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి తెలిపారు. 'తెలుగు జాతి భవిష్యత్తు కోసం ఓటేయండి.. తెలుగుజాతి పౌరుషం చూపించండి. మనకు కేంద్రం మెడలు వంచి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునే ప్రభుత్వం కావాలో లేక చంద్రబాబు నాయుడిలా కేంద్రం వద్ద మోకరిల్లి ఢిల్లీకి సలాం చేసే ప్రభుత్వం కావాలో మీరే తేల్చుకోండి’ అని‌ ప్రజలకు శ్రీ వైయస్ జగన్ సూచించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు, నెల్లూరు జిల్లా కావలి, ప్రకాశం జిల్లా కనిగిరి, చీరాల, కృష్ణా జిల్లా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాల్లో‌ శ్రీ జగన్ ఆదివారం ప్రచారం నిర్వహించారు. ‘వైయస్ఆర్ జనభేరి’ సభల్లో ప్రసంగించారు. ఆయా సభలకు పోటెత్తిన ప్రజలను‌ ఉద్దేశించి ఆయన ఉద్వేగంగా మాట్లాడారు. మండుటెండను, ఉక్కపోతనూ లెక్కచేయకుండా తన కోసం వేచి ఉన్న అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ ఎన్నికల్లో ఒకవైపు విశ్వసనీయత, నిజాయితీ ఉంటే.. మరోవైపు కుళ్లు, కుతంత్రాలు పోటీపడుతున్నాయని శ్రీ జగన్‌ స్పష్టం చేశారు. విశ్వసనీయతకు ఓటేసి..‌ మహానేత వైయస్ఆర్ సువర్ణయుగాన్ని తిరిగి తెచ్చుకుందామని పిలుపునిచ్చారు. ‘నరేంద్ర మోడీ, చంద్రబాబు, సోనియా... వీరెవ్వరికీ మన మీద కాని, మన రాష్ట్రం మీదకాని ప్రేమ లేదు. వీళ్లకు కావల్సిందల్లా ఓట్లు, సీట్లు మాత్రమే. వాటి కోసం ఏ గడ్డి అయినా తింటారు వీళ్లు. అందుకే రాష్ర్టంలో 25 ఎంపీ స్థానాలు మనమే గెలుచుకుని మన రాష్ట్రానికి మంచి చేసే వారినే ప్రధాని కుర్చీలో కూర్చోబెడదాం' అన్నారు.

'మరో మూడు రోజుల్లో మీ ఓటుతో మన తలరాతలు మార్చుకోబోతున్నాం. ప్రతి పేదవాడి మనసు ఎవరు తెలుసుకుని, వారి కోసం పనిచేస్తారో, ఏ వ్యక్తి చనిపోయాక కూడా ప్రజల గుండెల్లో జీవించి ఉండాలనుకుంటాడో అలాంటి వ్యక్తిని మనం సీఎం చేసుకోవాలి. అప్పుడే మన తలరాతలు మారతాయి’ అని శ్రీ వైయస్‌ జగన్‌ అన్నారు.

వీళ్ళసలు మనుషులేనా? :

‘వైయస్ రాజశేఖరరెడ్డి మన మధ్య నుంచి వెళ్లిపో‌యాక ఈ వ్యవస్థలో విశ్వసనీయత, నిజాయితీ ఎక్కడ ఉన్నాయో టార్చిలైటు వేసి వెతికినా కనపడని పరిస్థితి. రాజకీయ నాయకులు ఈ రోజు ఓట్లు, సీట్ల కోసం ఏ గడ్డి తినడానికైనా వెనకాడటం లేదు. రాజకీయాన్ని చదరంగంలా తయారు చేశారు. ఓట్లు, సీట్ల కోసం ఒక మనిషి మీద తప్పుడు కేసులు పెట్టడానికి, జైలుకు పంపడానికి, చివరికి రాష్ట్రాన్ని చీల్చడానికి కూడా వెనుకాడడం లేదు. ఈ వ్యవస్థను మార్చాలి.. ఈ వ్యవస్థలో నిజాయితీ తీసుకుని రావాలి. విశ్వసనీయత అనే పదానికి అర్థం తీసుకుని రావాలి' అని శ్రీ జగన్‌ పిలుపునిచ్చారు.

'మన రాష్ట్రాన్ని సోనియా గాంధీ అడ్డగోలుగా విడగొడుతుంటే, ఆమెకు చంద్రబాబు, ఈ బీజేపీ నాయకులే మద్దతు పలికారు. తెలంగాణలో ప్రచారం నిర్వహించినంతసేపూ.. తమ వల్లే రాష్ట్ర విభజన జరిగిందని మోడీ, చంద్రబాబు చెప్పుకున్నారు. ఏప్రిల్ 30 సాయంత్రం ఆరు గంటలకు ఎన్నికలు ముగియగానే మాట మార్చేశారు. ఏడు గంటలకు తిరుపతిలో సభ పెట్టి.. రాష్ట్రం ముక్కలు కావడానికి కారణం జగన్మోహన్‌రెడ్డే అని నా మీద అభాండాలు వేశారు. వీళ్లు మనుషులేనా అని అడుగుతున్నా. ఈ వ్యవస్థలో నిజాయితీ ఉందా? ఇటువంటి వాళ్లు ఏం పాలిస్తారు? ఏ నిజాయితీతో రాజకీయాలు చేస్తారు? ఏ విశ్వసనీయతతో రాజకీయం చేస్తారు?' అని శ్రీ జగన్‌ నిలదీశారు.

ఆల్ ఫ్రీ బాబును ‌ఎక్కడికక్కడే నిలదీయాలి :
'చంద్రబాబు వచ్చి అది చేస్తా, ఇది చేస్తా, అన్నీ ఫ్రీగా ఇస్తా అని చెబుతాడు. ఆయనను ఎక్కడిక్కడే నిలదీయండి. ఇవాళ ఫ్రీగా ఇస్తానంటున్న వాటిలో ఒక్కటంటే ఒక్కటి కూడా మీరు సీఎంగా ఉన్న తొమ్మిదేళ్లలో ఎందుకు ఇవ్వలేదు అని నిలదీయండి. రూ.2 కిలో బియ్యాన్ని రూ.5.25 చేసింది మీరు కాదా? మద్య నిషేధం అని చెప్పి గ్రామ గ్రామాన బెల్టుషాపులు తెచ్చింది మీరు కాదా? అని ప్రశ్నించండి. ఆసుపత్రుల్లో యూజర్ చార్జీలు వసూలు చేసింది మీరు కాదా? మీ హయాంలో ఏ ఒక్క గ్రామానికైనా వెళ్లి ప్రజల వైద్యం కోసం, ఉన్నత చదువుల కోసం డబ్బులు ఎలా తెస్తున్నారని అడిగారా? అని ప్రశ్నించండి‌' అని శ్రీ జగన్‌ ప్రజలకు పిలుపునిచ్చారు.

బాబు రైతు రుణ మాఫీ పచ్చి అబద్ధం :
'చంద్రబాబు ఒకరోజు ఆడవాళ్లకు సెల్‌ఫోన్లు ఫ్రీగా ఇస్తానంటాడు. మరుసటి రోజు టీవీలు ఇస్తానంటాడు. ఆ మరుసటి రోజు రైతు రుణాలు మాఫీ చేస్తానంటాడు. ఆ తర్వాత రోజు డ్వాక్రా రుణాలు రద్దు చేస్తానంటాడు. ఆ పక్క రోజు ఇంటికో ఉద్యోగం ఇస్తానంటూ పూటకో పచ్చి అబద్ధం చెబుతున్నాడు. మన రాష్ట్ర బడ్జెట్ రూ.1.25 లక్షల కోట్లు.. అయితే చంద్రబాబు రైతు రుణాల మాఫీ భారం రూ.1.27 లక్షల కోట్లు, డ్వాక్రా సంఘాల రుణాల మాఫీకి రూ.20 వేల కోట్లు కలిపి లక్షా యాభై వేల కోట్ల రూపాయల మేర హామీలిచ్చారు.
రాష్ట్రంలో రైతుల పంట రుణాలు రూ.1.27 లక్షల కోట్లు ఉన్నాయని బ్యాంకర్లు మీటింగ్‌లో చెబితే చంద్రబాబు తన పార్టీ నుంచి తమకు కావాల్సిన టీవీల దగ్గరకు వక్తలను పంపి ఆ రుణాలను తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ వక్తల్లో ఒకరు రైతు రుణాలు రూ.10 వేల కోట్లనీ, ఇంకొకరు రూ.20 వేల కోట్లనీ, మరొకరు రూ.30 వేల కోట్లు ఉన్నాయని చెబుతున్నారు. ఇప్పుడే ఇలా చేస్తున్నారంటే.. రైతు రుణ మాఫీ మీద చంద్రబాబుకున్న చిత్తశుద్ధి ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు' అన్నారు.

మూడున్నర కోట్ల ఉద్యోగాలా ?:
'ఇంటికో ఉద్యోగం ఇస్తానంటూ ప్రజల్ని మోసం చేయాలని చంద్రబాబు చూస్తున్నాడు. అసలు రాష్ట్రంలో ఎన్ని ఇళ్లున్నాయో చంద్రబాబుకు తెలుసా? మూడున్నర కోట్ల ఇళ్లున్నాయి. ఆయన సీఎంగా ఉన్న తొమ్మిదేళ్లలో 65 ప్రభుత్వరంగ సంస్థల్లోని 20 వేల మంది కార్మికులను వీధిపాలు చేశాడు. స్వాతంత్య్రం వచ్చిన 60 సంవత్సరాల నుంచి మన రాష్ట్రంలో మొత్తం 20 లక్షల ఉద్యోగాలు ఉంటే చంద్రబాబు మూడున్నర కోట్ల ఉద్యోగాలు ఎలా ఇస్తాడు? అసలు ఈయన మనిషేనా?' అని శ్రీ వైయస్‌ జగన్‌ ప్రశ్నించారు. 'చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు. అధికారం కోసం ఆయన ఎన్ని అబద్ధాలైనా ఆడతాడు. నేను చంద్రబాబు కంటే పాతికేళ్లు చిన్నవాడిని. విశ్వసనీయతతో మరో 30 ఏళ్లు రాజకీయం చేయాల్సిన వాడిని. అందుకే చంద్రబాబు లాగా నేను అబద్ధాల హామీలు ఇవ్వలేను’ అని శ్రీ జగన్మోహన్‌రెడ్డి అన్నారు.

Back to Top