పచ్చని రాష్ట్రంలో ఆ ముగ్గురి చిచ్చు

సత్యవేడు (చిత్తూరు జిల్లా):

ఓట్లు, సీట్ల కోసం, స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం సోనియా గాంధీ, కిరణ్ కుమా‌ర్‌రెడ్డి, చంద్రబాబు కలసి పచ్చని మన రాష్ట్రాన్ని ముక్కలు చేసే కుట్రకు పాల్పడుతున్నారని వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు‌ శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి నిప్పులు చెరిగారు. చిత్తూరు జిల్లాలో ‘సమైక్య శంఖారావం, ఓదార్పు యాత్ర’ నాలుగవ విడత రెండవ రోజు మంగళవారంనాడు శ్రీ వైయస్ జగ‌న్ సత్యవేడు నియోజకవర్గంలోని నారాయణవనం, గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని కార్వేటినగరం సభల్లో ప్రసంగించారు.

‘ఢిల్లీ అహంకారానికి, తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ఇప్పుడు యుద్ధం జరుగుతోంది. ఈ ముగ్గురూ తాము చేస్తున్న పాపాన్ని ఎవరూ చూడడం లేదని అనుకుంటున్నారేమో.. విభజనతో అన్యాయానికి గురవుతున్న 70 శాతం మంది ప్రజల ఉసురు వీరికి కచ్చితంగా తగులుతుంది. పై నుంచి దేవుడు చూస్తున్నాడు. త్వరలో ఎన్నికలు వస్తాయి.. ఆ ఎన్నికల్లో ప్రజలందరం కలసి వీళ్లను బంగాళాఖాతంలో కలుపుదాం.. 30 ఎంపీ స్థానాలను మనమే గెలుచుకుందాం. అప్పుడు రాష్టాన్ని వీళ్లెలా విభజిస్తారో చూద్దాం. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేవారినే ప్రధాని పదవిలో కూర్చోబెడదాం’ అని శ్రీ జగన్ పిలుపు ‌ఇచ్చారు.

కొడుకు కోసం మన పిల్లల జీవితాలతో సోనియా చెలగాటం :
‘రాష్ట్రంలో చదువుకున్న ప్రతి పిల్లవాడి గుండె చప్పుడూ సమైక్యాంధ్ర అని నినదిస్తోంది. సాగునీటి కోసం పరితపించే ప్రతి రైతన్న గుండె చప్పుడూ సమైక్యమనే ఘోషిస్తోంది. అయితే.. కోట్లాది ప్రజల గుండెచప్పుడు కిరణ్ కుమా‌ర్‌రెడ్డికి, చంద్రబాబుకు మాత్రం వినిపించడం లేదు. ఓట్లు, సీట్ల కోసం, తన కొడుకును ప్రధాన మంత్రి కుర్చీలో కూర్చోబెట్టడం కోసం సోనియా గాంధీ మన రాష్ట్రాన్ని విభజిస్తున్నారు. ఆమె కొడుకు కోసం మన పిల్లల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. అలాంటి సోనియా గాంధీని పట్టుకుని నిలదీయాల్సిన చంద్రబాబు.. ప్యాకేజీల కోసం కుమ్మక్కైపోయారు. చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో సీమాంధ్ర ఎమ్మెల్యేలతో సమైక్యాంధ్ర అనిపిస్తారు. తెలంగాణ సభ్యులతో విభజన అనిపిస్తార'ని శ్రీ జగన్‌ విమర్శించారు.

సోనియా గీసిన గీత దాటని కిరణ్‌:
సోనియా గాంధీ గీసిన గీతను కిరణ్‌కుమార్‌రెడ్డి దాటరు. ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చునేందుకు సోనియా చెప్పినట్లల్లా ఆయన ఆడుతున్నారు. సమైక్యాంధ్ర కోసం ఉద్యమాలు, సమ్మెలు చేస్తున్న ఉద్యోగులను పిలిపించి వారిని భయపెట్టి సమ్మె విరమించుకునేలా కిరణ్‌కుమార్‌రెడ్డి చేస్తారని ఆరోపించారు. విభజన ముసాయిదా బిల్లు రాష్ట్రానికి రాగానే తాను సంతకం చేసి, ప్రభుత్వ కార్యదర్శులందరితో సంతకాలు చేయించి కేవలం 17 గంటల్లోనే అసెంబ్లీకి పంపించారు. పైకేమో తాను సమైక్యవాదినని చెబుతారు. చెడిపోయి ఉన్న ఈ రాజకీయ వ్యవస్థల్లో కిరణ్‌కుమార్‌రెడ్డి, చంద్రబాబు కలిసి ప్రజల జీవితాలతో నాటకాలు ఆడుతున్నారని శ్రీ వైయస్‌ జగన్ నిప్పులు చెరిగారు.

‌మహానేత డాక్టర్‌ వైయస్ఆర్ బతికున్నప్పుడు రాష్ట్రాన్ని విభజించడానికి ఏ ఒక్కరికీ ధైర్యం చాల్లేద‌ని శ్రీ జగన్‌ ప్రస్తవించారు. విశ్వసనీయత అన్న పదానికి వైయస్ అర్థంలా నిలిచా‌రన్నారు. 'ఎన్నాళ్లు బతికామన్నది కాదు ముఖ్యం.. ఎంతకాలం బతికామన్నదే ముఖ్యం’ అని మహానేత అనేవారన్నారు.

Back to Top