– నారాయణరెడ్డి హత్య జరిగి 48 గంటలైనా ఒక్క అరెస్టూ లేదు
– నిందితులను పట్టుకోవడంలో పోలీసుల వైఫల్యం స్పష్టం
– దారుణ హత్యను ఎస్పీ లైట్ తీసుకోవడం దారుణం
– సోషల్ మీడియా అరెస్టులపై ఉండే వేగం భద్రతపై లేదే..?
– రాయలసీమలో ఫ్యాక్షనిజాన్ని పెంచి పోషిస్తుంది బాబే..
– వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి
హైదరాబాద్ః వైయస్‌ఆర్‌సీపీ కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గ ఇంచార్జి నారాయణరెడ్డి హత్య జరిగి 48 గంటలు గడిచినా ఒక్కర్ని కూడ అరెస్టు చేయకపోవడం దారుణమని పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు రోజురోజుకు క్షీణిస్తున్నాయని అన్నారు. పోలీసులు నిర్లక్ష్యం వీడి నారాయణరెడ్డి హత్య కేసు నిందితులను పట్టుకోవాలని సూచించారు. సాక్షాత్తు ఉపముఖ్యమంత్రిపైనే ఆరోపణలు వస్తే నిరూపించుకోవాల్సింది పోయి.... పోలీసులే నిందితులకు కొమ్ముకాయడం దారుణమన్నారు. పోలీసులు మనసు పెడితే హత్య కేసులో నిందితులను పట్టుకోవడం ఏమంత పెద్ద పనికాదన్నారు. ట్రాక్టర్‌ను పట్టుకున్నామని చెప్పడం దౌర్భాగ్యమన్నారు.
వైయస్‌ఆర్‌ను ఆదర్శంగా తీసుకోండి
పరిటాల రవి హత్య కేసులో దివంగత నాయకుడు వైయస్‌ఆర్ సీబీఐ విచారణకు ఆదేశించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. వైయస్ జగన్ నిర్దోషి అని సీబీఐ వెల్లడించింది. అదే విధంగా మీరు కూడా రంగా కేసులో ఇప్పటికైనా సీబీఐ దర్యాప్తుకు ఆదేశించే ధైర్యం ఉందా. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి సంఘటనలు రాష్ట్రంలో చాలానే జరిగాయి. వాటిల్లో ఏ ఒక్కదానిపైనైనా విచారణకు ఆదేశించే దమ్ము చంద్రబాబుకు ఉందా..? నారాయణరెడ్డి హత్య చేయబడి 48 గంటలు దాటిపోయింది. రాష్టమంతా ఆందోళన వ్యక్తం చేశారు. అయినా ఇంతవరకు ఒక్క అరెస్టు కూడా జరగలేదు. ఎస్పీ దీనిపై సమాధానం చెప్పాలి. సోషల్ మీడియా విషయంలో పక్కరాష్ట్రాలకు వెళ్లి మరీ అరెస్టులు చేస్తారు. ఇంత ఘోరాతి ఘోరంగా హత్యలు జరిగితే ఎందుకు అరెస్టులు జరగలేదు. డీజీపీ, ఎస్పీ సమాధానం చెప్పాలి. సాక్షాత్తు డిప్యూటీ సీఎం మీద ఆరోపణలు చేసినప్పుడు దానిని నిరూపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాజకీయ ఎదుగుదల కోసం ప్రత్యర్థులను చంపాలనుకోవడం దుష్ట ఆలోచన అని శ్రీకాంత్ రెడ్డి దుయ్యబట్టారు.
పోలీసులు కళ్లు తెరవాలి
రాష్ట్రంలో టీడీపీ నాయకులు సీఎం ఆదేశాలతో పోలీసులపై దాడులు చేస్తున్నారని శ్రీకాంత్‌రెడ్డి ఫైర్ అయ్యారు. కడపలో పార్టీ ప్లీనరీలో ఎస్పీని స్మగ్లింగ్ కు ఎంకరేజ్ చేస్తున్నారని చెప్పుకుని వేధిస్తారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఎస్సైని కింద కూర్చోబెడతారు. విజయవాడలో బోండా ఉమ, కేశినేని నాని ఐపీఎస్ ను అవమానిస్తారు. ఐపీఎస్‌ను తెలుగుదేశం పార్టీ సర్వీస్‌గా మార్చారు. నిజాయతీగా వాళ్ల పనిని వాళ్లని చేయనీయడం లేదు. నిజాయతీతో పనిచేసేవారిని ట్రాన్స్‌ఫర్లతో వేధిస్తారు. సాక్షాత్తు ఏలూరు ఎస్సై పెట్టిన కేసును ఎత్తేస్తానని ముఖ్యమంత్రి హామీ ఇస్తారు. ఇలాటి పరిస్థితుల్లో సామాన్యులకు ఏం భద్రత కల్పిస్తారు. ఒంగోలులో ఇద్దరు నాయకులు ఎదురెదురుగా వస్తే తన్నుకునే పరిస్థితి ఉంటే ప్రజలను ఏం రక్షిస్తారు. నక్సలిజానికి నువ్వే బలికావాల్సింది. వైయస్‌ఆర్ వచ్చాక నక్సలిజాన్ని అణచివేశారు. ఇప్పుడు మీరు వచ్చాక మళ్లీ ఫాక్షనిజాన్ని ప్రోత్సహిస్తున్నారంటూ గడికోట బాబుపై విరుచుకుపడ్డారు.
రాయలసీమ గూండాలు, పులివెందుల రౌడీలు అని అసభ్య పదజాలం వాడేది మీరే. భూమా నాగిరెడ్డిని మా పార్టీలో ఉన్నప్పుడు ఎన్నో విధాలుగా వేధించావ్. ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి బెదిరించావ్. పార్టీ మారాక మరోరకంగా వేధించి ఆయన చావుకు కారణమయ్యావ్. ఏకంగా మీ నాయకులపై 132 జీవోలు విడుదల చేసి కేసులన్ని ఎత్తివేయించావ్. అధికార పార్టీలో ఉంటే ఒక రకంగా .. ప్రతిపక్షంలో ఉన్నవాళ్లను మరో విధంగా చూడటం సరికాదు. మాకు గతంలోనే 2ప్లస్ 2 భద్రత ఉండేది. పోలీస్ వ్యవస్థ అంతా మీ కనుసైగల్లో ఉండాలని కోరుకోవడం దౌర్భాగ్యం. పోలీసులను కూడా కోరుకుంటున్నా ఐజీ స్థాయి అధికారిపైనే దాడి చేసిన పచ్చ పార్టీ నాయకులు రేపు డీజీపీ మీద కూడా దాడి చేయరని గ్యారంటీ ఏంటి. మీరు నిజాయతీగా వ్యవహరించాలని కోరుకుంటున్నా. హత్యలు, కేసులు, బెదిరింపులతో పైచేయి సాధించాలని చూడటం తప్పు. మూడేళ్లలో 500 మంది వైయస్‌ఆర్‌సీపీ నాయకులను చంపారు. ఎంపీటీసీలను కిడ్నాప్‌లు చేయడం. రెవెన్యూ అధికారిని జుట్టు పట్టి కొడితే ఇంటికి పిలిచి పంచాయతీ చేయడం దుర్మార్గం.
2019లో మళ్లీ అధికారంలోకి రావాలంటే ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేయ్. గెలిపించలాని అధికారులను కోరడం కాదు. ప్రజలకు మంచి పనులు చేసి వారి మన్ననలు చూరగొను. అధికారులు నీ టార్చర్ చూడలేక అల్లాడిపోతున్నారు. ఎస్సైలు, కానిస్టేబుళ్లు ఎన్నాళ్లు అవమానభారంతో భరిస్తారు. తిరగబడండి.ప్రతిపక్ష పార్టీ ఎంపీ ప్రయాణికుల కోసం మాట్లాడితే దాన్ని వక్రీకరించి మూడు వారాలు బెయిల్ రాకుండా జైల్లో నిర్బంధించడం.. లుక్ అవుట్ నోటీసులు జారీ చేయడం ప్రజాస్వామ్యమా...?మీ పార్టీ నాయకులు పోలీసుల మీద చేస్తున్న ఆగడాలకు మీరే వంత పాడుతుంటే పోలీసులు స్వేచ్ఛగా ఎలా పనిచేస్తారు. నక్సలిజాన్ని, ఫాక్షనిజాన్ని వైయస్‌ఆర్ లేకుండా చేస్తే ఇప్పుడు బాబు మళ్లీ అదే పరిస్థితులు కొనసాగిస్తున్నారంటూ వైయస్ జగన్ మండిపడ్డారు.