అర్థంపర్థం లేని ఆరోపణలు కట్టిపెట్టండి: సోమయాజులు

హైదరాబాద్ 25 సెప్టెంబర్ 2013:

తమ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డికి బెయిలు లభించిన వెంటనే గౌరవాధ్యక్షురాలు శ్రీమతి విజయమ్మ సోనియా గాంధీకి ఫోనుచేసి కృతజ్ఞతలు చెప్పారన్న టీడీపీ నేతల వ్యాఖ్యలపై వైయస్ఆర్ కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు డి.ఎ. సోమయాజులు మండిపడ్డారు. వారిలా ఆరోపించడానికి ఆధారమేంటో వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. అర్థంపర్థం లేని ఆరోపణలు చేయడం మానాలని ఆయన హితవు పలికారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో బుధవారం మధ్యాహ్నం మీడియాతో మాట్లాడారు. తొమ్మిదేళ్ళు అధికారంలో ఉన్న టీడీపీ పార్టీ ఇలాంటి నీచస్థితికి ఎందుకు దిగజారవలసి వచ్చిందో వారే తేల్చుకోవాలని సూచించారు. దర్యాప్తు పూర్తయ్యిందని సీబీఐ చెప్పినందువల్లే శ్రీ జగన్మోహన్ రెడ్డికి బెయిల్ వచ్చిందని ఆయన స్పష్టంచేశారు. తమ పార్టీ అధ్యక్షునికి లభిస్తున్న ప్రజాదరణ చూసి టీడీపీ నేతలకు బాధ కలుగుతున్నట్లుందని వ్యాఖ్యానించారు. దర్యాప్తు పూర్తికాలేదని చెప్పినంత కాలం శ్రీ జగన్మోహన్ రెడ్డికీ బెయిల్ రాలేదనీ, సుప్రీం కోర్టు గడువు విధించడంతోనే సీబీఐ దర్యాప్తు పూర్తిచేసిందని పేర్కొన్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కయ్యామమనీ బీజేపీ నేత నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలను ఆయన ఖండించారు. శ్రీ జగన్మోహన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ వేధిస్తోందని అదే పార్టీ సీనియర్ నేతలు సుష్మాస్వరాజ్, అరుణ్ జైట్లీ చెబుతున్న విషయాన్ని సోమయాజులు గుర్తుచేశారు. ఈ సంగతిని నిర్మలా సీతారామన్ గమనించలేదా అన్ని ప్రశ్నించారు. 1998లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద వంద తప్పులతో చార్జి షీటు వేసిన బీజేపీ, అనంతరం ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి 20 సీట్లు తగ్గడంతో చంద్రబాబును తమలో కలుపుకుని చార్జిషీట్లను పట్టించుకోని సంగతి నిర్మలా సీతారామన్ కు తెలీదనీ, అప్పటికి ఆవిడ ఆ పార్టీలోనే లేరని చెప్పారు.

లోక్ సత్తా నేత జయప్రకాశ్ నారాయణ్ తన స్థాయి దిగజారి మాట్లాడుతున్నారనీ, ఇది తగదనీ ఆయన హితవు పలికారు. టీడీపీ, బీజేపీ, లోక్ సత్తా పార్టీలు శ్రీ జగన్మోహన్ రెడ్డిపై దుష్ప్రచారాన్ని మానాలని కోరారు. వ్యక్తిగతంగా కాకుండా అవినీతి మీద విమర్శలు చేస్తే తాము కూడా ఆయనతో కలుస్తామని చెప్పారు. ఐఎమ్‌జీ, ఇమార్ కేసులలో కూడా ఇదే వైఖరిని అవలంబించాలని సూచించారు. మనిషిని బట్టి వైఖరిని మార్చుకోకూడదన్నారు. పార్టీలనూ, వ్యక్తులనూ లక్ష్యంగా చేసుకుని మాట్లాడటం తగదన్నారు. బెయిలు కోరిన ప్రతిసారీ సీబీఐ దర్యాప్తు పూర్తికాలేదు కాబట్టి బెయిలు ఇవ్వద్దని చెప్పిందీ తప్ప మరే కారణమూ తెలపలేదనీ, దీనిని ఏ పార్టీ అయిన ఖండించగలదా అని అడిగారు. పూర్వాపరాలు తెలియకుండా ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని సోమయాజులు అభిప్రాయపడ్డారు.

Back to Top