గుంటూరులో విజయమ్మ 'సమరదీక్ష'

గుంటూరు :

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ‌ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ ఈ నెల 19 నుంచి గుంటూరులో నిరవధిక దీక్ష (సమరదీక్ష)ను ప్రారంభించనున్నారు. రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్‌ పార్టీ ఏకపక్ష, నిరంకుశ నిర్ణయానికి నిరసనగా ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ కార్యక్రమాల కమిటీ కన్వీనర్ తలశిల రఘురాం, గుంటూరు జిల్లా కన్వీన‌ర్ మర్రి రాజశేఖర్, ‌పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఈ విషయం తెలిపారు. గుంటూరు బస్టాండ్‌ సమీపంలో ఏర్పాటు చేస్తున్న శ్రీమతి విజయమ్మ సమరదీక్ష దీక్షా వేదిక వద్ద శనివారం సాయంత్రం వారు విలేకరులతో మాట్లాడారు. సోమవారం ఉదయం 10 గంటల తరువాత బస్టాండ్ ఎదుట ఒక ప్రైవే‌ట్ స్థలంలో‌ శ్రీమతి విజయమ్మ దీక్ష ప్రారంభం అవుతుందని చెప్పారు.

శ్రీమతి విజయమ్మ సమరదీక్షను ముందుగా విజయవాడలో నిర్వహించాలని పార్టీ నిర్ణయించిందని, అయితే అవనిగడ్డ ఉప ఎన్నికను కారణంగా చూపి పోలీస్ కమిషన‌ర్ దీక్షకు అనుమతించలేదని‌ రఘురాం, రాజశేఖర్‌, రాంబాబు తెలిపారు. చట్టం మీద ఉన్న గౌరవంతో శ్రీమతి విజయమ్మ, పార్టీ ముఖ్య నాయకుల సూచనల మేరకు దీక్షా వేదికను గుంటూరుకు మార్చినట్లు వారు వివరించారు. అన్ని ప్రాంతాల వారికీ సమన్యాయం జరగాలన్న పార్టీ వైఖరిని అన్ని వర్గాల వారికి తెలియజేయడమే శ్రీమతి విజయమ్మ నిరవధిక నిరాహార దీక్ష లక్ష్యమని మర్రి రాజశేఖర్ తెలిపారు. విభజన ప్రకటన కంటే ముందే తమ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారని, పార్టీ అధ్యక్షుడు, గౌరవ అధ్యక్షురాలు కూడా రాజీనామాలు చేసి కాంగ్రెస్ పార్టీ నిరంకుశ నిర్ణయాన్ని ఎండగట్టారని గుర్తుచేశారు.

‌శ్రీమతి విజయమ్మ దీక్ష ప్రకటన అనంతరం రాష్ట్రంలో చిత్ర విచిత్రమైన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని, టిడిపి నాయకులు కూడా రాజకీయం కోసం హడావుడిగా నిరాహార దీక్షలు చేస్తున్నారని అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. అసలు టిడిపి విధానమేమిటో చంద్రబాబు ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. రెండు ప్రాంతాలకు సమన్యాయం చేయకపోతే రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలన్నది తమ పార్టీ విధానమని స్పష్టం చేశారు.

ఎన్ని అడ్డంకులు సృష్టించినా శ్రీమతి విజయమ్మ దీక్ష ఆగేది లేదని పార్టీ గుంటూరు నగర కన్వీనర్ లేళ్ళ అప్పిరెడ్డి తెలిపారు. సమావేశంలో విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గం ఇన్‌చార్జి కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, పార్టీ యువజన విభాగం జిల్లా కన్వీనర్ కావటి మనోహ‌ర్ నాయుడు, నియోజకవర్గ సమన్వయకర్తలు పాల్గొన్నారు.‌

విజయవాడలో విజయమ్మ దీక్షకు అనుమతి నిరాకరణ

శాంతిభద్రతలు, ఎన్నికల కోడ్ అమలు‌లో ఉన్న నేపథ్యంలో విజయవాడలో‌ శ్రీమతి వైయస్ విజయమ్మ సమరదీక్షకు అనుమతి ఇవ్వడంలేదని విజయవాడ నగర పోలీసు కమిషనర్ బత్తిన శ్రీనివాసులు తెలిపారు. విజయవాడలో ఆమరణ దీక్ష చేపడతామని‌ శ్రీమతి వైయస్ విజయమ్మ, ఆ తర్వాత ‌టిడిపి నాయకుడు దేవినేని ఉమామహేశ్వరరావు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దీక్షల కోసం సమర్పించిన దరఖాస్తులను ఎన్నికల కమిషన్‌కు పంపించామని, అక్కడి నుంచి అనుమతి వచ్చేవరకూ దీక్ష చేపట్టవద్దంటూ దేవినేని ఉమకు శుక్రవారమే నోటీసులు ఇచ్చారు. శనివారం ఉదయం దీక్షకు బయలుదేరిన ఉమ బృందాన్ని పోలీసులు అరెస్టు చేశారు.

కాగా, శనివారం సాయంత్రానికి రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి వివరణ వచ్చింది. దీక్షలను ఎన్నికల సంఘం నిషేధించదని, శాంతి భద్రతల వ్యవహారాన్ని స్థానిక యంత్రాంగమే చూసుకోవాలని‌ ఎన్నికల కమిషనర్ బన్వర్‌లాల్ స్పష్టం చేశారు. దీక్షలకు అనుమతినిచ్చేందుకు కమిషనర్ అంగీకరించలేదు. స్థానిక వై‌యస్ఆర్‌ కాంగ్రెస్‌ నాయకులు జలీల్‌ఖాన్, గౌతంరెడ్డి తదితరులు శనివారం సాయంత్రం ‌పోలీసు కమిషనర్ చాంబ‌ర్‌లో కలుసుకుని చర్చించినప్పటికీ ఫలితం లేకపోయింది. దీనితో శ్రీమతి విజయమ్మ సమరదీక్షా వేదికను గుంటూరుకు మార్చాలని నిర్ణయించారు.

Back to Top