మొక్కవోని ధైర్యంతో ముందుకెళదాం

హైదరాబాద్:

పోరాటాల్లోంచి ఆవిర్భవించిన వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కుటుంబ సభ్యులమంతా గడచిన మూడేళ్ళలో లెక్కలేనన్ని కష్ట నష్టాలు, అవమానాలు, అన్యాయాలను దాటుకుంటూ మొక్కవోని ధైర్యంతో ముందుకు కొనసాగుతున్నామని పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్‌ విజయమ్మ గుర్తుచేసుకున్నారు. అందరం కోరుకున్న లక్ష్యం ఇంకా మరెంతో దూరంలేదన్నారు. మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి లక్ష్యాలు, మాటలే స్ఫూర్తిగా, ప్రజల అవసరాలు తీర్చడానికి ప్రాంతాలు, కుల, మత, రాజకీయాలకు అతీతంగా రాష్ట్రాన్ని సువర్ణయుగం వైపు నడిపించాలన్న ధ్యేయంతో శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి ముందుకు కొనసాతున్నారని చెప్పారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారంనాడు పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనవంగా నిర్వహించిన కార్యక్రమంలో శ్రీమతి విజయమ్మ పార్టీ జెండాను ఆవిష్కరించి, మహానేత వైయస్ఆర్‌ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు.

వచ్చే సార్వత్రిక, స్థానిక ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రె‌స్‌ పార్టీకి అఖండ విజయాన్ని చేకూర్చడమే ఈ రోజు మనందరి  ముందున్న కర్తవ్యం అని శ్రీమతి విజయమ్మ అన్నారు. ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు సార్వత్రిక, స్థానిక ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించేందుకు ముందుండి కృషి చేయాలని శ్రేణులకు ఆమె పిలుపునిచ్చారు.

‘లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు సమయం ఇంక రెండు నెలలే ఉంది. మీ మనిషిగా, శ్రీ జగన్ తల్లిగా, మహానేత వై‌యస్‌ఆర్ ‌సతీమణిగా ఇవాళ ప్రజలందరికీ ఒకే ఒక మాట చెబుతున్నా... వైయస్ఆర్ గుణాలను పుణికిపుచ్చుకుని తన తండ్రి కలలను నెరవేర్చడానికి ముందుకు వస్తున్న‌ శ్రీ జగన్‌ను ఆశీర్వదించండి’ అని కోరారు. మహానేత వైయస్‌లోని దీక్ష, పట్టుదల శ్రీ జగన్‌లో ఉన్నాయని, నాలుగున్నరేళ్ల పోరాటంలో జగన్‌బాబును చూసినపుడల్లా వైయస్ఆర్‌ను చూసినట్లే అనిపిస్తూ ఉందని ఆమె అన్నారు. ఎన్నో పార్టీలు పుట్టుకొస్తున్నాయని, కానీ వైయస్ఆర్‌సీపీ ఒక్కటే విలువలకు, విశ్వసనీయతకు కట్టుబడి చిత్తశుద్ధితో ప్రజల పక్షాన నిలిచి పోరాడుతోందని శ్రీమతి విజయమ్మ అన్నారు.

ఆత్మవిశ్వాసంతో పోరాడాలి :
ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతోనే మున్సిపల్, పంచాయతీరాజ్‌ ఎన్నికలు ఒకేసారి తెచ్చినా మొక్కవోని విశ్వాసంతో ఘన విజయం సాధించేందుకు పోరాడాలని శ్రీమతి విజయమ్మ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలన్నారు. ఎన్నికల వల్లనే వ్యవస్థాపక దినోత్సవాన్ని నిరాడంబరంగా జరుపుకొంటున్నామని, ఎన్నికల తరువాత  అధికారంలోకి వచ్చేది వైయస్ఆర్‌సీపీయే కనుక ఆ రోజు ప్రజల మధ్య ఘనంగా ప్రమాణ స్వీకారోత్సవం జరుపుకొందామని శ్రీమతి విజయమ్మ పార్టీ శ్రేణులను ఉత్సాహపరిచారు.

మహానేత వైయస్ఆర్ మరణించిన‌ ఈ నాలుగున్నరేళ్లలో ఎన్నో ఇబ్బందులు పడి ఎన్నో పోరాటాలు చేశామని శ్రీమతి విజయమ్మ అన్నారు. జైల్లో ఉండి కూడా శ్రీ జగన్ ప్రజా సమస్యల పరిష్కారం కోసం తన చేత యాత్రలు, దీక్షలు,‌ శ్రీమతి షర్మిల చేత పాదయాత్రలు చేయించారని అన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని పోరాటం చేశామన్నారు. పోరాటాల్లోనే పుట్టిన వైయస్ఆర్‌సీపీ ఇప్పటికీ అదే బాటలో నడుస్తోందని శ్రీమతి విజయమ్మ అన్నారు. పార్టీ పెట్టినపుడు తనతో వచ్చే వారికి మూడేళ్లు కష్టాలు తప్పవని శ్రీ జగన్‌ ఆనాడే చెప్పారని, ఆ తరువాత 30 ఏళ్ల పాటు సువర్ణయుగాన్ని తెచ్చుకుందామని కూడా పేర్కొన్నారని, దాన్ని సాకారం చేసుకుందామని అన్నారు. మహానేత వైయస్ఆర్ రెక్కల కష్టంతో తెచ్చిన అధికారాన్ని అనుభవించిన ప్రభుత్వం గత నాలుగున్నరేళ్లుగా ప్రజలను విస్మరించి, ఇపుడు డిపాజి‌ట్ కోల్పోయే స్థితి తెచ్చుకుందన్నారు.

‌చంద్రబాబు ఒక్క మంచి పనైనా చేశారా? :
తొమ్మిదేళ్లు సీఎంగా ఉన్నచంద్రబాబు నాయుడు తన పాలనలో ప్రజలకు పనికి వచ్చే ఒక్క మంచి పనైనా చేశారా అని శ్రీమతి విజయమ్మ ప్రశ్నించారు. ఒక ప్రాజెక్టు గాని, ఒక్క ఫ్యాక్టరీగాని ఆయన నిర్మించలేదన్నారు. తన పాలనను తిరిగి తెస్తానని చెప్పే ధైర్యం కూడా చంద్రబాబు చేయలేకపోతున్నారని శ్రీమతి విజయమ్మ విమర్శించారు. ఎఫ్‌డీఐలపై ఓటింగ్, అవిశ్వాసం వంటి విషయాల్లో కాంగ్రెస్‌తో కుమ్మక్కై పనిచేశారన్నారు. ఇది చాలక లేఖ ఇచ్చి రాష్ట్ర విభజనకు సహకరించారని ఆమె దుయ్యబట్టారు. చివరి వరకూ పదవిని అంటిపెట్టుకున్న కిరణ్‌కుమార్‌రెడ్డి ఇపుడు తాను సమైక్య చాంపియన్ అని చెబుతున్నార‌ని ఎద్దేవా చేశారు.

అడ్డగోలు రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎన్ని పోరాటాలు చేసినా కేంద్రంలో కాంగ్రెస్, బీజేపీ కలిసిపోయి విడదీశాయన్నారు. విభజనకు వ్యతిరేకంగా మనం సుప్రీంకోర్టులో పోరాడుతున్నామని శ్రీమతి విజయమ్మ చెప్పారు. భూభాగాన్ని విడదీసినా తెలుగువారిని వేరు చేయలేరని ఏ ప్రాంతం వారికి కష్టం వచ్చినా మరో ప్రాంతం వారు ఆదుకుంటారని శ్రీ జగన్ చెప్పారని ఆమె గుర్తుచేశారు. ఇరు ప్రాంతాల ప్రజల హృదయాల నుంచి వై‌యస్‌ను తుడిచివేయలేరన్నారు.

జగన్‌ తరఫున మాట ఇస్తున్నా :
‘ఈ రోజు నేను నా కుమారుడి తరఫున మీ అందరికీ మాట ఇస్తున్నా.. రెండు ప్రాంతాల్లో ఉన్నా అందరమూ తెలుగు వారమే.. మనదంతా తెలుగుజాతి. ఏ రోజున కూడా మనంతట మనం విడిపోలేదు. జర్మనీ, బ్రిటిష్ వారికి యుద్ధం వస్తే వారి కోసం మనల్ని ఒకప్పుడు విడదీశారు. ఈ‌ రోజు ఇటలీ వాళ్లు ఓట్లు, సీట్ల కోసం విడగొట్టారు. అయినా రెండు ప్రాంతాల ప్రజల సంక్షేమం కోసం వైయస్ఆర్‌సీపీ పాటుపడుతుంది’ అని విజయమ్మ మాట ఇచ్చారు.

తాజా ఫోటోలు

Back to Top