రేపటి నుంచి 'శ్రీకాకుళం'లో మరో ప్రజాప్రస్థానం

శ్రీకాకుళం, 20 జూలై 2013:

మహానేత రాజన్న తనయ, వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర ఆదివారం నాడు శ్రీకాకుళం జిల్లాలోకి ప్రవేశిస్తున్నది. తండ్రి దివంగత సిఎం, మహానేత డాక్టర్ వై‌యస్ఆర్ అడుగుజాడల్లో.. ‌అన్న శ్రీ జగన్మోహన్‌రెడ్డి సూచన మేరకు శ్రీమతి షర్మిల చేస్తున్న ఈ సుదీర్ఘ, చారిత్రక పాదయాత్రకు చివరి మజిలీ శ్రీకాకుళం జిల్లా కావడం గమనార్హం. ఆదివారం నుంచి శ్రీమతి షర్మిల పాదయాత్ర శ్రీకాకుళం జిల్లాలో కొనసాగుతుందని వైయస్ఆర్‌ కాంగ్రెస్ శాసనసభా పక్ష ఉపనేత ధర్మాన కృష్ణదా‌స్, పార్టీ శ్రీకాకుళం జిల్లా కన్వీన‌ర్ ధర్మాన పద్మప్రియ ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. ‌విజయనగరం జిల్లాలో సాగుతున్న శ్రీమతి షర్మిల పాదయాత్ర పార్వతీపురం నియోజకవర్గం మీదుగా ఆదివారం మధ్యాహ్నం వీరఘట్టం మండలం కడకెల్ల వద్ద శ్రీకాకుళం జిల్లాలోకి ప్రవేశిస్తుందని వారు పేర్కొన్నారు.

ఇచ్ఛాపురం వరకు కొనసాగే శ్రీమతి షర్మిల మరో ప్రజాప్రస్థానాన్ని విజయవంతం చేయడానికి‌ శ్రీకాకుళం జిల్లాలోని వైయస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన అన్ని విభాగాల నాయకులు, కార్యకర్తలు, వైయస్ అభిమానులు సహకరించాలని ‌కృష్ణదాస్, పద్మప్రియ విజ్ఞప్తి చేశారు. మహానేత వైయస్‌కు, ఆయన కుటుంబానికి జిల్లా ప్రజల్లో ఎంతటి ఆదరణ ఉందో అందరికీ తెలిసిందేనని, అందుకే వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి జిల్లాలో విశేష ఆదరణ లభిస్తోందన్నారు. ఈ నేపథ్యంలో ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు శ్రీమతి షర్మిల చేస్తున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్రకు శ్రీకాకుళం జిల్లా తుది మజిలీ కావడం జిల్లాకే గర్వకారణమని వారు పేర్కొన్నారు. పాదయాత్ర సందర్భంగా ప్రజలు తమ సమస్యలను నేరుగా శ్రీమతి షర్మిలకు వివరించవచ్చునని కృష్ణదాస్, పద్మప్రియ తెలిపారు.

ప్రజలకు ఎలాంటి కష్టం వచ్చినా వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అండగా ఉం‌టున్నదని, శ్రీమతి షర్మిల పాదయాత్ర ఉద్దేశం కూడా అదే అయినందున ప్రజలు ఈ ప్రభుత్వ పాలనలో ఎదుర్కొంటున్న కష్టాలను ఆమె దృష్టికి తేవాలని కృష్ణదాస్, పద్మప్రియ సూచించారు. గతంలో వైయస్ఆర్ ప్రవేశపెట్టిన పథకాలు ప్రతి కుటుంబానికి చేరాయన్నారు. ప్రస్తుత ప్రభుత్వ పాలనలో ‌ఆ పథకాలన్నీ ఒక్కొక్కటిగా కనుమరుగైపోతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. ఇలాంటి సమస్యలు తెలుసుకునేందుకే అలుపెరుగకుండా పాదయాత్ర నిర్వహిస్తున్న శ్రీమతి షర్మిలను మరింత ప్రోత్సహించేందుకు పార్టీ సమన్వయకర్తలు, జిల్లా కమిటీ సభ్యులు, యువజన, విద్యార్థి విభాగాలు, పార్టీలోని ఇతర అన్ని విభాగాల ముఖ్యులు తరలిరావాలని, జిల్లాలోకి ప్రవేశించే సమయంలో శ్రీమతి షర్మిలకు ఘనంగా స్వాగతం పలకాలని కృష్ణదాస్, పద్మప్రియ విజ్ఞప్తి చేశారు.

తాజా వీడియోలు

Back to Top