బాబును కాపీ కొట్టే కర్మ రాకూడదు

బద్వేలు (వైయస్ఆర్‌ జిల్లా),

7 సెప్టెంబర్ 2013: చంద్రబాబును కాపీ కొట్టే కర్మ ఎవ్వరికీ పట్టకూడదని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల వ్యాఖ్యానించారు. తన యాత్రను చూసి వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కాపీ కొడుతోందన్న చంద్రబాబు వ్యాఖ్యలపై ఆమె నిప్పులు చెరిగారు. ఆయన యాత్రను కాపీ కొట్టడానికి ఆయన ఏమైనా గాంధీనా లేక మదర్‌ థెరిసానా అని ఎద్దేవా చేశారు. వైయస్ఆర్‌ జిల్లా బద్వేలులో శనివారం రాత్రి నిర్వహించిన సమైక్య శంఖారావం బహిరంగ సభలో శ్రీమతి షర్మిల చంద్రబాబు, కాంగ్రెస్‌ పార్టీలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సీమాంధ్రను వల్లకాడు చేయాలన్నది కాంగ్రెస్‌ పార్టీ ఉద్దేశమా? అని ప్రశ్నించారు.

మహానేత డాక్టర వైయస్ రాజశేఖరరెడ్డి గతంలో చేసిన పాదయాత్రను అవహేళన చేసింది చంద్రబాబు కాదా? అని శ్రీమతి షర్మిల అన్నారు. పాదయాత్ర చేసిన రాజశేఖరరెడ్డిగారు ముఖ్యమంత్రి అయిపోయారని ఇప్పుడు తాను కూడా సిఎం అయిపోవాలన్న స్వార్ధంతో  చంద్రబాబు పాదయాత్ర చేశారని అన్నారు. ఆ మహానేత ఉచిత విద్యుత్‌ ఇస్తే.. తీగలపై బట్టలు ఆరేసుకోవాలని హేళన చేసి.. ఇప్పుడు మీరూ ఇస్తానని చెప్పడం వైయస్ఆర్‌ను కాపీ కొట్టడం కాదా అని ప్రశ్నించారు.

రాజశేఖరరెడ్డిగారు వెళ్ళిపోయిన తరువాత కేవలం ఈ నాలుగేళ్ళలోనే మన రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరిలా తయారైందని శ్రీమతి షర్మిల ఆవేదన వ్యక్తంచేశారు. అతలాకుతలం అయిపోయిందన్నారు. తెలుగువారి భిక్షతో గద్దెనెక్కిన కాంగ్రెస్‌ పార్టీ విభజన పేరుతో తెలుగువారి గొంతు కోసిందన్నారు. మహారాష్ట్ట్ర, కర్నాటక అవసరాలు తీరిన తరువాత కానీ మనకు కృష్ణా, గోదావరి నీళ్ళు వదలని పరిస్థితి ఉందన్నారు. మధ్యలో మరో రాష్ట్రం వస్తే ఆ రెండు నదుల నీళ్ళను అడ్డుకుంటే దిగువ ప్రాంతం మహా ఎడారిగా మారిపోదా? పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామని చెప్పినా గోదావరి నీటిని మధ్యలో వచ్చే రాష్ట్రం అడ్డుకుంటే దానికి నీళ్ళెక్కిడి నుంచి తీసుకువచ్చి నింపుతారని నిలదీశారు. గోదావరి నీళ్ళను కృష్ణా నదిలో కలిపి రాయలసీమకు నీటిని అందించాలని మహానేత వైయస్ఆర్‌ కల కన్నారని శ్రీమతి షర్మిల ప్రశ్నించారు.

హైదరాబాద్‌ అభివృద్ధిలో సీమాంధ్రుల పాత్ర లేదా? హైదరాబాద్‌ నుంచి ఇప్పుడు వెళ్ళిపోండి అంటున్నారంటే ఇది భావ్యమా అన్నారు. పెద్ద, చిన్న పరిశ్రమలు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు హైదరాబాద్‌లో మాత్రమే ఉంటే రాష్ట్రం విడిపోయి, హైదరాబాద్‌ను ఒక ప్రాతానికే ఇచ్చేస్తే సీమాంధ్రుల గతేం కావాలని ఆమె ప్రశ్నించారు. ఒక పక్కన నదుల నుంచి నీళ్ళివ్వరట... హైదరాబాద్‌నూ ఇవ్వరట... రాష్ట్ట్ర ఆదాయంలో సగం వచ్చే హైదరాబాద్‌ నిధుల గురించి మాట్లాడరట... కాని అడ్డగోలుగా ముక్కలు మాత్ర చేస్తారట! గతంలో మద్రాసును తీసేసుకున్నారు.. ఇప్పుడు హైదరాబాద్‌ను సీమాంధ్రులకు దూరం చేస్తారట. ఇదెక్కడి న్యాయం అని శ్రీమతి షర్మిల ప్రశ్నించారు.

కోట్లాది మంది తెలుగువారికి ఇంత అన్యాయం జరుగుతున్నా ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నోరెందుకు మెదపడం లేదని శ్రీమతి షర్మిల నిలదీశారు. మన రాష్ట్రాన్ని విడగొట్టి కాంగ్రెస్‌ పార్టీ చారిత్రక తప్పిదం చేస్తుంటే చంద్రబాబు ఎందుకు ప్రశ్నించరన్నారు. తెలంగాణకు లేఖ ఎందుకు ఇచ్చారు? ఎవరినడిగి ఇచ్చారని నిలదీయాలని ప్రజలకు శ్రీమతి షర్మిల పిలుపునిచ్చారు. ఒక పక్కన తెలుగువారి గొంతును పట్టపగలే కోసి ఆత్మగౌరవ యాత్ర ఎలా చేస్తారని చంద్రబాబును నిలదీశారు. ఆయనకు ఒక ఆత్మ అంటూ ఏడ్చిందా? అని ఎద్దేవా చేశారు.

మహానేత వైయస్ఆర్‌ ఉంటే రాష్ట్రం ముక్కలయ్యేది కాదని ప్రధాని సహా పలువురు పెద్దలు చెబుతున్నారని శ్రీమతి షర్మిల ప్రస్తావించారు. అయితే, రాష్ట్ర విభజనకు కారణం వైయస్ఆర్‌ అంటూ నెపాన్ని నెట్టి చంద్రబాబు నాయుడు అబద్ధాలు చెబుతున్నారని దుయ్యబట్టారు.

రాష్ట్రాన్ని కాంగ్రెస్‌ పార్టీ అడ్డగోలుగా విడగొడుతూ నిర్ణయం తీసుకుంటున్నదన్న సంకేతాలు అందిన వెంటనే వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు ‌శ్రీమతి విజయమ్మ, అధ్యక్షుడు శ్రీ జగన్మోహన్‌రెడ్డి, పార్టీ ఎమ్మెల్యేలందరూ రాజీనామాలు చేసిన వైనాన్ని ఆమె ప్రస్తావించారు. కానీ కాంగ్రెస్‌, టిడిపి నాయకులు పదవులను గబ్బిలాల్లా పట్టుకుని వేళ్ళాడుతున్నారని దుయ్యబట్టారు. సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, సీమాంధ్ర కేంద్ర మంత్రులు, ఎంపిలు ఢిల్లీ దర్బార్‌కు వంగి వంగి సలామ్‌లు చేస్తున్నారని తూర్పారపట్టారు. సమన్యాయం చేయలేకపోతే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మొదటి నుంచీ డిమాండ్‌ చేస్తోందన్నారు.

విలువలతో కూడిన రాజకీయాలు చేయడం చేతగాని కాంగ్రెస్, టిడిపిలు కుమ్మక్కై, అబద్ధపు కేసులు పెట్టి అన్యాయంగా జగనన్నను జైలులో పెట్టించాయని శ్రీమతి షర్మిల ఆవేదన వ్యక్తంచేశారు. కానీ జైలులో ఉన్నా జగనన్న జననేతే అన్నారు. జైలు నిర్బంధంలో ఉన్నా జగనన్న రాష్ట్ర ప్రజల కోసం ఏడు రోజుల పాటు నిరాహార దీక్ష చేశారని తెలిపారు. కానీ బోనులో ఉన్న పులి పులే అన్నారు. త్వరలోనే జగనన్న వస్తారని, మనందరినీ రాజన్న రాజ్యం వైపు నడిపిస్తారని హామీ ఇస్తున్నానన్నారు. న్యాయం చేసే సత్తా లేనప్పుడు విభజించే హక్కు కాంగ్రెస్‌కు ఎక్కడిదని ప్రశ్నించారు.

Back to Top