రాష్ట్ర గతినే మార్చిన వైయస్‌!

కొత్తవలస (విజయనగరం జిల్లా),

8 జూలై 2013: 'ఈ రోజు రాజశేఖరరెడ్డి గారి 64వ జయంతి. వైయస్ఆర్‌ అనే ఒక్క పదం.. ఈ రాష్ట్ర గతినే మార్చేసింది. వైయస్ఆర్‌ అనే ఒక్క పదం.. ఈ రాష్ట్ర రాజకీయాలనే మలుపు తిప్పింది. వైయస్ఆర్‌ అనే ఒక్క పదం.. రాజకీయాలకు కొత్త అర్థం చెప్పింది. వైయస్ఆర్‌ అనే ఒక్క పదం.. నాయకులంటే ఎలా ఉండాలో భావితరాలకు ఆదర్శం చెప్పింది. వైయస్ఆర్‌ అన్న పదం.. రైతులకు అభయ హస్తం అయ్యింది. వైయస్ఆర్‌ అన్న పదం.. పేదలకు.. దీనులకు ఆపన్న హస్తం అయ్యింది. వైయస్ఆర్‌ అన్న పదం..  పేద విద్యార్థుల పట్ల వరం అయ్యింది. వైయస్ఆర్‌ అన్న పదం.. పేద రోగుల పట్ల సంజీవని అయ్యింది. గర్భిణులకు, చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న వారి ప్రాణాలకు 108 ద్వారా ప్రాణాలు పోసింది. వైయస్ఆర్‌ అన్న పదం.. రెండు రూపాయలకే అన్నం పెట్టింది. ఒక్క కొత్త పన్ను వేయకుండానే, ఒక్క పైసా చార్జీలు పెంచకుండానే 8 కోట్ల ఆంధ్ర జనాభా శ్రేయస్సు కోరింది వైయస్ఆర్‌ అన్న పదం!' ఇలా కొనసాగింది శ్రీమతి షర్మిల ప్రసంగం. ప్రజా కంటకంగా మారిన కాంగ్రెస్‌ ప్రభుత్వం తీరుకు.. దానితో అంట కాగుతూ రక్షణ కవచంలా నిలిచిన ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు వైఖరికి నిరసనగా వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి తరఫున ఆయన సోదరి శ్రీమతి షర్మిల చేస్తున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర 203వ రోజు సోమవారం సాయంత్రం విజయనగరం జిల్లా కొత్తవలస చేరింది. ఈ సందర్భంగా కొత్తవలసలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో శ్రీమతి షర్మిల అశేష ప్రజానీకాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.

'మన రాష్ట్రంలోనే కాకుండా దేశ వ్యాప్తంగా తెలుగువాడి గౌరవాన్ని పెంచింది వైయస్ఆర్‌ అన్న పదం.. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా పాలన సాగించి దేశానికే మార్గదర్శకంగా నిలిచారు రాజశేఖరరెడ్డిగారు. మొత్తం మీద ఈ రాష్ట్ర ప్రజల జీవితాల్లో వైయస్ఆర్‌ యుగం అన్నది ఒక స్వర్ణయుగంగా నిలిచిపోయింది. ప్రజలలో నుంచే పుట్టి.. ప్రజల కోసమే బ్రతికిన రాజశేఖరరెడ్డిగారి జీవితంలో ప్రజలే ముఖ్యమైన పాత్ర పోషించారు. వారి గుండెల్లో ఆయన ఇప్పటికి.. ఎప్పటికీ చెరపలేని స్థానాన్ని సంపాదించుకున్నారు.'

'యెదుగూరి సందింటి రాజశేఖరరెడ్డి గారు డాక్టర్‌ చదువు పూర్తిచేసుకుని సొంత ఊరికి వచ్చే సరికి ఆయన తండ్రి అంటే మా తాతగారు వైయస్‌ రాజారెడ్డిగారు ఒక ఆసుపత్రిని కట్టించారు. 1973 నుంచి ఆ ఆస్పత్రిలో రాజశేఖరరెడ్డిగారు ఉచితంగానే వైద్య సేవ చేశారు. ఇంకా ఎక్కువ మందికి సేవ చేయవచ్చనే ఉద్దేశంతో 1978లో ఆయన రాజకీయాల్లో అడుగుపెట్టారు. పదిసార్లు తిరుగులేని నాయకునిగా ఎంపికయ్యారు రాజశేఖరరెడ్డిగారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా.. నాలుగుసార్లు ఎం.పి.గా ఎన్నికయ్యారు. ఎన్నో ప్రజా సమస్యల్లో పోరాటం చేశారు రాజశేఖరరెడ్డిగారు. చివరగా చంద్రబాబు విధానాలకు నిరసనగా ప్రజల తరఫున ఒక ధర్మపోరాటానికి దిగి మండుటెండలో పాదయాత్ర చేశారు. 2009లో ఘన విజయం సాధించి ముఖ్యమంత్రి అయ్యారు రాజశేఖరరెడ్డిగారు. ముఖ్యమంత్రి అయ్యాను కదా అని, కోరిక నెరవేర్చుకున్నాను కదా అని ఎప్పుడూ అనుకోలేదు. నమ్మిన ప్రజలకు ఎంత చేసినా తక్కువే అని పదే పదే గుర్తుచేసుకున్నారు. నన్ను నమ్మి ఓటు వేసిన ప్రజల బాగు కోసం శాయశక్తులా కృషి చేస్తానని కులాలు, మతాలు, ప్రాంతాలు, పార్టీలకు అతీతంగా ఆలోచించి ప్రతి తెలుగువాడూ సంతోషంగా ఉండాలని తపించారు రాజశేఖరరెడ్డిగారు. అన్ని వర్గాల వారికీ మేలు చేయాలని ఆయన పరితపించారు.'

'ఆయన తపనలో నుంచే పుట్టాయి అద్భుతమైన పథకాలు. ఆ పథకాల ద్వారా మన రాష్ట్రంలో కోట్లాది మంది లబ్ధి పొందారు. ఆ మహానేత వెళ్ళిపోతే 660 మంది గుండెలు ఆగిపోయాయి అంటే.. రాజశేఖరరెడ్డిగారు ప్రజల గుండెల్లో ఎంతటి స్థానాన్ని సంపాదించుకున్నారో ప్రపంచం అంతా చూసింది. రాజశేఖరరెడ్డిగారి రెక్కల కష్టం మీద అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ ఉంది తప్ప.. ఇది రాజశేఖరరెడ్డి ప్రభుత్వం కానే కాదు. ఆయన ఆశయాలు, సిద్ధాంతాలను ఖూనీ చేసి, ఆయన ప్రతి పథకానికీ తూట్లు పెడుతోంది ఈ కాంగ్రెస్‌ ప్రభుత్వం.'

'ఇప్పుడు ఉన్నది చంద్రబాబు అడుగుజాడల్లో నడుస్తున్న చంద్రబాబు పాలన పార్టు 2. చంద్రబాబు పాలనలో మాదిరిగానే కరెంటు లేక, సాగునీరు లేక, మద్దతు ధర లేక రైతులంతా అప్పులపాలై పోతున్నారు. బాబు హయాంలో లాగే ఇప్పుడు అన్ని ఖర్చులూ పెరిగిపోయాయని, బతుకు భారం అయిపోయిందని ఎక్కడకు వెళ్ళి మహిళలు అల్లాడిపోతున్నారు. నారావారి పాలన సారావారి పాలనగా సాగినట్టు ఇప్పుడు కిరణ్‌ హయాంలో మద్యం ఏరులై పారుతోంది. చంద్రబాబు హయాంలో సంక్షేమం ప్రచారానికి మాత్రమే పరిమితమైనట్టు కిరణ్‌ పాలనలో కూడా ప్రకటనలకే పరిమితమైపోయింది. చంద్రబాబు గారి అడుగుజాడల్లో నడుస్తూ, శిష్యుడిగా మారిన కిరణ్‌కుమార్‌రెడ్డి అంటే ఆయనకు మక్కువ. అందుకే అన్ని ప్రతిపక్షాలూ కలిసి అవిశ్వాస తీర్మానం పెడితే.. ప్రజల కష్టాలను పాదయాత్రలో కళ్ళారా చూశానంటున్న చంద్రబాబు ఈ కాంగ్రెస్‌ ప్రభుత్వం మీద ఈగ కూడా వాలడానికి వీలులేదంటూ విప్‌ జారీ చేసి మరీ కూలిపోకుండా కాపాడారు. తన మీద ఉన్న అవినీతి కేసులపై విచారణ జరగకుండా చేసుకునేందుకే కాంగ్రెస్‌ పార్టీతో చంద్రబాబు చీకటి ఒప్పందాలు చేసుకున్నారు. కాంగ్రెస్‌ పార్టీతో కుమ్మక్కయ్యారు.' అని శ్రీమతి షర్మిల నిప్పులు చెరిగారు.

కాంగ్రెస్‌, టిడిపి నాయకులు కుమ్మక్కై, అబద్ధపు కేసులు పెట్టి జగనన్నను జైలు పాలు చేశారని శ్రీమతి షర్మిల ఆవేదన వ్యక్తంచేశారు. మన రాష్ట్రంలో మూడో పార్టీ గానీ, మూడో వ్యక్తి గానీ ఉండకూడదన్నది ఆ పార్టీల ఉద్దేశంగా ఉందని ఆమె విమర్శించారు. రాష్ట్రంలోనే కాక దేశంలో కూడా కాంగ్రెస్‌ పార్టీని అధికారంలో నిలబెట్టిన వ్యక్తి రాజశేఖరరెడ్డిగారు అన్నారు. ఏ పథకం చేసినా ఇందిరమ్మ, రాజీవ్‌ అని వాళ్ళ పేర్లే పెట్టి తన నిజాయితీని రాజశేఖరరెడ్డి చాటుకున్నారని చెప్పారు. రాజశేఖరరెడ్డి బ్రతికి ఉన్నప్పుడు ఇంద్రుడు.. భగీరథుడు అని పొగిడి ఆయన మరణించిన తరువాత ఆయన పేరును ఈ దుర్మార్గపు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎఫ్ఐఆర్‌లో దోషిగా చేర్చిందని నిప్పులు చెరిగారు. ఆయన వారసుడిగా జగనన్న స్థిరపడిపోతే ఆ రెండు పార్టీలకు మనుగడ ఉండదని, దుకాణాలు మూసుకోవాలని తెలిసి వంద మంది కలిసి వేయి కుట్రలు పన్ని, వ్యవస్థలను వాడుకుని శ్రీ జగన్మోహన్‌రెడ్డిని తొక్కేయాలనుకుంటున్నారని శ్రీమతి షర్మిల నిప్పులు చెరిగారు. కానీ బోనులో ఉన్నా సింహం సింహమే అన్నారు. మంచివాడైన జగనన్న పక్షాన దేవుడు నిలబడతారన్నారు. ఉదయించే సూర్యుడ్ని ఆపలేనట్లే జగనన్ననూ ఎవరూ ఆపలేరన్నారు. జగనన్నను ఆపడం టిడిపి, కాంగ్రెస్‌ నాయకుల తరం కాదన్నారు.

మరికొన్ని రోజుల్లో స్థానిక ఎన్నికలు, ఆ తరువాత సార్వత్రిక ఎన్నికలు కూడా వస్తున్నాయని శ్రీమతి షర్మిల చెప్పారు. ప్రజల చేతిలో ఉన్న ఓటు అనే ఆయుధం వృథా అయిపోవడానికి వీల్లేదన్నారు. కాంగ్రెస్, టిడిపిలకు గట్టిగా బుద్ధి చెప్పిన రోజున జగనన్నను ఆశీర్వదించిన రోజున రాజన్న రాజ్యం తప్పకుండా సాధ్యమవుతుందన్నారు. వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి ప్రజలు వేసే ప్రతి ఓటూ జగనన్న నిర్దోషి అని చాటి చెబుతుందన్నారు. జగనన్న త్వరగా బయటికి రావడానికి బాటలు వేస్తుందన్నారు.

రాబోయే రాజన్న రాజ్యంలో జగనన్న తప్పకుండా ముఖ్యమంత్రి అవుతారని, రాజన్న సువర్ణ యుగాన్ని మళ్ళీ స్థాపిస్తారని శ్రీమతి షర్మిల పేర్కొన్నారు. రాజన్న ప్రతీ కలనూ జగనన్న నెరవేరుస్తారన్నారు. రాజన్న ఇచ్చిన ప్రతి మాటనూ జగనన్న నిలబెడతారని ఆమె హామీ ఇచ్చారు. ప్రతి ఎకరాలకూ నీళ్ళివ్వాలన్న రాజన్న కలను జగనన్న నెరవేరుస్తారన్నారు. జగనన్న సిఎం అయ్యాక అమలు చేసే సంక్షేమ పథకాల గురించి శ్రీమతి షర్మిల వివరించారు.

తాజా వీడియోలు

Back to Top