రైతులను గుండెల్లో పెట్టుకున్న వైయస్ఆర్

పాయకరావుపేట (విశాఖ జిల్లా),

14 సెప్టెంబర్‌ 2013: సమైక్యాంధ్రే వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ విధానమని శ్రీమతి షర్మిల విస్పష్టంగా ప్రకటించారు. కోట్లాది మంది ప్రజల ఆకాంక్ష మేరకు వారి తరఫున పోరాడేందుకు పార్టీ ఎందాకా అయినా వెళుతుందని తెలిపారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగానే తాము ఉద్యమిస్తామన్నారు. పైనున్న కర్నాటక, మహారాష్ట్ర అవసరాలు తీరితేనే కాని కృష్ణా, గోదావరి నదుల నీటిని దిగువన ఉన్న మన రాష్ట్రానికి వదలని పరిస్థితిని ఇప్పటికే చూస్తున్నామన్నారు. మధ్యలో మరో రాష్ట్రం వచ్చి ఆ నదుల నీళ్ళను అడ్డుకుంటే సీమాంధ్ర రైతులు ఏమి కావాలని ఆమె ప్రశ్నించారు. మరో రాష్ట్రం వస్తే పోలవరం ప్రాజెక్టును ఏ నీళ్లతో నింపుతారన్నారు. రైతులను మహానేత డాక్టర్ వై‌యస్‌ రాజశేఖరరెడ్డి గుండెల్లో పెట్టుకుని చూసుకున్నారని అన్నారు. రైతులకు అండగా తాను ఉన్నానని ప్రతి రైతుకూ భరోసా కల్పించారని శ్రీమతి షర్మిల తెలిపారు. విశాఖ జిల్లా పాయకరావుపేటలో శనివారం రాత్రి నిర్వహించిన సమైక్య శంఖారావం బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు.

పావలా వడ్డీకే వైయస్ఆర్ రుణాలు ఇచ్చారని, విద్యార్థుల గురించి ఓ తండ్రిలా ఆలోచించారని శ్రీమతి షర్మిల అన్నారు. ప్రభుత్వమే ఉచితంగా చదివిస్తుందని‌ ఆయన భరోసా కల్పించారని తెలిపారు. పేదవాడు కార్పొరేట్ ఆస్పత్రి‌లో అత్యంత ఖరీదైన వైద్యాన్ని ఉచితంగానే పొందాలని ఆరోగ్యశ్రీ పథకాన్ని పెట్టారని శ్రీమతి షర్మిల గుర్తు చేశారు. తన హయాంలో వైయస్ఆర్ ఏనాడూ ఒక్క రూపాయి కూడా చార్జీలు పెంచలేదని, గ్యాస్‌, ఆర్టీసీ, విద్యు‌త్‌పై ఒక్క రూపాయి కూడా పెంచలేదని అన్నారు.

ప్రస్తుతం అధికారంలో ఉన్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమా‌నికి పాడె కట్టిందని, చేసిన పాపాలు సరిపోలేదని అన్నదమ్ముల మధ్య చిచ్చుపెట్టి చలి కాచుకుంటోందని శ్రీమతి షర్మిల తీవ్రస్థాయిలో మండిపడ్డారు. హైదరాబాద్ అభివృద్ధిలో సీమాంధ్రుల పాత్ర లేదా అని నిలదీశారు. హైదరాబా‌ద్ అభివృద్ధికి 60 ఏళ్లు పట్టిందని, ‌సీమాంధ్రలో మరో రాజధానిని అభివృద్ధి చేయాలంటే పదేళ్లు సరిపోతుందా? కాంగ్రెస్‌ సమాధానం చెప్పాలని ఆమె ప్రశ్నించారు. ఓట్లు, సీట్ల కోసం కాంగ్రెస్‌ పార్టీ కోట్లాది మందికి అన్యాయం చేయడానికి సిద్ధమైందని దుయ్యబట్టారు.

మన కర్మకొద్దీ అధికార పార్టీ ఇలా ఏడిస్తే, ప్రధాన ప్రతిపక్షం టిడిపి కూడా అలాగే ఉందని.. కోట్లాది మంది సీమాంధ్రులకు ఇంతలా అన్యాయం జరుగుతున్నా చంద్రబాబు గుడ్లప్పగించి చూస్తున్నారని శ్రీమతి షర్మిల మండిపడ్డారు. రాష్ట్ర విభజనకు కారణం చంద్రబాబేనని విమర్శించారు. తెలంగాణకు అనుకూలంగా ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకోవాలని చంద్రబాబును తాము పదేపదే అడుగుతూనే ఉన్నామని, ఆయన తాను చేసిన తప్పును ఒప్పుకుని చెంపలేసుకుని కోట్లాది మందికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పాలకపక్షంతోనే కుమ్మక్కై రాష్ట్ర విభజనకు మద్దతు పలుకుతున్నా‌రంటే అసలు చంద్రబాబును ప్రతిపక్ష నాయకుడనాలా? దుర్మార్గుడనాలా అని నిలదీశారు. చంద్రబాబు యాత్రల తీరు చూస్తే.. హత్యచేసి ఆ శవంపైనే పడి వెక్కివెక్కి ఏడ్చిన చందంగా ఉందని దుయ్యబట్టారు.

ఒక తండ్రిలా ఆలోచించి, ఎవరికీ అన్యాయం జరగకుండా నిర్ణయం తీసుకోవాలని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మొదటి నుంచీ ఒకే మాట చెబుతూ వచ్చిందని శ్రీమతి షర్మిల తెలిపారు. న్యాయం చేయడం కాంగ్రెస్‌కు ఇష్టం లేదని తేలిపోయింది కనుక, న్యాయం చేసే సత్తా దానికి లేదని నిర్ధారణ అయింది కనుక రాష్ట్రాన్ని యధాతథంగా.. సమైక్యంగా ఉంచాలని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ డిమాండ్‌ చేస్తోందన్నారు. రాష్ట్ర విభజన సంకేతాలు వచ్చిన వెంటనే వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులంతా మూకుమ్మడిగా రాజీనామాలు చేశారని తెలిపారు. కోట్లాది మంది ప్రజల కోసమే జగనన్న జైలు నిర్బంధంలో ఉన్నా, ఇబ్బందులు పడుతున్నా, తన కష్టాలను పక్కనపెట్టి వారం రోజుల పాటు నిరవధిక నిరాహార దీక్ష చేశారని శ్రీమతి షర్మిల పేర్కొన్నారు. విలువలతో కూడిన రాజకీయాలు చేసే దమ్ము కాంగ్రెస్, టిడిపిలకు లేదని ఆమె నిప్పులు చెరిగారు.

తాజా వీడియోలు

Back to Top