ఈ నాయకులుంటే ఎంత? ఊడితే ఎంత?

చీపురుపల్లి (విజయనగరం జిల్లా), 14 జూలై 2013: ప్రజల కష్టాలను పట్టించుకోని ప్రభుత్వంతో పాటు బాధ్యతా రహితంగా ప్రవర్తిస్తున్న ప్రధాన ప్రతిపక్షంపై వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా విజయనగరం జిల్లా చీపురుపల్లిలో ఆదివారం సాయంత్రం జరిగిన భారీ బహిరంగ సభలో ఆమె కాంగ్రెస్, టిడిపిలపై నిప్పులు చెరిగారు.

'ధరలన్నీ భగ్గుమంటున్నాయి. గ్యాస్‌ సిలిండర్‌ 445 రూపాయలు అయిపోయింది. కరెంటు చార్జీలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ కాంగ్రెస్‌ పాలనలో పక్కా ఇళ్ల పథకానికి పాడె కట్టారు. 108, 104 మూలన పడ్డాయి. ఉన్న పెన్షన్లను కూడా రద్దుచేస్తున్న వీళ్లను నాయకులనాలా? రాక్షసులనాలా? కిరణ్‌ ప్రభుత్వం కనీసం మూడు గంటలు కూడా కరెంటు ఇవ్వడంలేదు. అది కూడా ఎప్పుడిస్తారో చెప్పలేం. రైతులు అల్లాడిపోతున్నారు. పరిశ్రమలకు నెలకు 12 రోజులు పవర్‌ కట్‌. కార్మికుల పరిస్థితి దయనీయం. పైగా, ఇవ్వని కరెంటుకు మూడింతల బిల్లు వసూలు చేస్తున్నారు. మద్యం ఏరులై పారుతోంది. మద్యం మాఫియా డాన్లను తీసుకొచ్చిందీ కాంగ్రెస్‌ పార్టీ. రెండు లక్షల రూపాయలు కడితే మద్యం దుకాణాలకు పర్మిట్‌ రూంలు ఇస్తారట. అంటే మద్యం దుకాణాలను అధికారికంగా బార్లుగా మారుస్తున్నారు. మన రాష్ట్రంలో మూడు మద్యం దుకాణాలు, ఆరు బార్లుగా మద్యం వ్యాపారం వర్ధిల్లుతోంది. మద్యం కుటుంబాల్లో ఎలా చిచ్చుపెడుతుందో, ప్రమాదాలకు ఎలా కారణమవుతుందో తెలిసి కూడా ఇలా ప్రోత్సహిస్తున్నారు.

పేదవాడు కూడా మంచి ఆరోగ్యానికి అర్హుడే అని మహానేత డాక్టర్‌ వైయస్ఆర్‌ ఒక డాక్టర్‌లా ఆలోచించి ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెడితే కిరణ్‌ ప్రభుత్వం దానికి తూట్లు పొడుస్తోందని దుయ్యబట్టారు. లక్షలాది మంది విద్యార్థులకు ఉచితంగా విద్యాభ్యాసాన్ని వైయస్ఆర్ చేయించారు గనుకే వారంతా మంచి మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్దారని చెప్పారు. అన్ని పథకాలనూ అద్భుతంగా చేసి చూపించిన రికార్డు ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డిగారు అని శ్రీమతి షర్మిల పేర్కొన్నారు. ఇప్పుడు మన రోజులు బాగో లేక రాజశేఖరరెడ్డిగారు వెళ్ళిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. మన రాష్ట్రంలో అభివ్రుద్ధి చచ్చిపోతోందని ఆవేదన వ్యక్తంచేశారు.

తోటపల్లి ప్రాజెక్టుకు వైయస్ఆర్‌ రూ. 450 కోట్లు కేటాయించి, పనులు చేపట్టారని శ్రీమతి షర్మిల ప్రస్తావించారు. ఆ ప్రాజెక్టు పూర్తయితే లక్షా 80 వేల ఎకరాలకు సాగునీరు అందించేదన్నారు. కానీ రాజశేఖరరెడ్డి వెళ్ళిపోయిన తరువాత ఈ ప్రభుత్వం ఇక్కడి పుల్ల తీసి అక్కడ పెట్టలేదన్నారు. చీపురుపల్లి నుంచి శాసనసభకు ఎన్నికైన మంత్రి బొత్స సత్యనారాయణ స్థానికుల సమస్యలు పట్టించుకోరని దుమ్మెత్తిపోశారు. కనీసం ఈ నియోజకవర్గం ప్రజలకు మంచినీరు కూడా ఇవ్వడంలేదని విమర్శించారు. ఇలాంటి నాయకులు ఉంటే ఎంత? ఊడితే ఎంత? అని శ్రీమతి షర్మిల నిప్పులు చెరిగారు. కాంగ్రెస్‌ ప్రభుత్వానిది గాంధేయ వాదమా? లేక బ్రాందేయ వాదమా? అని శ్రీమతి షర్మిల ఎద్దేవా చేశారు.

ఒకవైపు పాలకపక్షం ఇంత దారుణంగా ఉంటే, మరోవైపు ప్రతిపక్ష నేత చంద్రబాబు కూడా మన రాష్ట్రంలో మద్యం ధరలు పెరిగాయని, తాము అధికారంలోకి వస్తే అందరికీ అందుబాటులోకి మద్యం ధరలు తెస్తామని చెబుతున్నారు. మన ఖర్మ కొద్దీ ఇలాంటి ప్రతిపక్ష నాయకుడున్నారు. పాపం ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీ పెడితే ఆ పార్టీలోంచే ఆయనను పంపేసిన ఘనుడు చంద్రబాబు నాయుడు. పెన్షన్‌ కావాలని ఎవరైనా వెళ్తే, అప్పటికే పెన్షన్‌ పొందుతున్న ఎవరైనా చనిపోతేనే కొత్త పెన్షన్‌ ఇస్తానని చెప్పేవారు. ఎనిమిదేళ్లలో ఎనిమిది సార్లు కరెంటు చార్జీలు పెంచారు.

అబద్ధపు కేసులు పెట్టి, కుట్రలు పన్ని, సిబిఐని ఉసిగొలిపి జగనన్నను అన్యాయంగా జైలులో పెట్టారని శ్రీమతి షర్మిల ఆవేదన వ్యక్తంచేశారు. జగనన్నను రాజకీయంగా ఎదుర్కొనే దమ్మూ ధైర్యం కాంగ్రెస్, టిడిపి నాయకులకు లేదని ఆమె వ్యాఖ్యానించారు. విలువలతో కూడిన రాజకీయాలు చేసే చేవ వారికి లేదన్నారు. జగనన్న బయటే ఉంటే ఆ రెండు పార్టీలకూ మనుగడ ఉండదని వారికి ముందే తెలుసన్నారు. అందుకే నీచమైన రాజకీయాలు చేస్తున్నారన్నారు. బోనులో ఉన్నా సింహం సింహమే అని, జగనన్నను ఎవరూ ఆపలేరని ధీమాగా చెప్పారు.

జగనన్న త్వరలోనే బయటకు వస్తారని, మనందరినీ రాజన్న రాజ్యం దిశగా నడిపిస్తారని శ్రీమతి షర్మిల చెప్పారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి వేసే ప్రతి ఓటూ ప్రజల జీవితాల్లో వెలుగు నింపడం ఖాయం అన్నారు. సభ ప్రారంభం కావడానికి ముందు నుంచే చీపురుపల్లిలోని సభా ప్రాంగణమంతా జగన్‌ నినాదాలతో హోరెత్తింది. సభకు వచ్చిన అశేష జనం శ్రీమతి షర్మిలకు సాదరంగా స్వాగతం పలికారు.
Back to Top