హైదరాబాద్‌కు బాబుతోనే అధిక నష్టం


విజయవాడ:

‘చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌లో బిల్డింగ్‌లు కట్టారో లేదో గాని తానే ఆ నగరాన్ని అబివృద్ధి చేశానని అబద్ధాలు చెబుతున్నారు. నిజానికి చంద్రబాబు వల్ల హైదరాబాద్‌కు మేలు కంటే నష్టమే ఎక్కువ జరిగింది. హైదరాబాద్‌ నడిబొడ్డున వేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ స్థలాలను చంద్రబాబు తన వాళ్లకు పప్పు బెల్లాల్లా పంచి పెట్టేశార’ని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల నిప్పులు చెరిగారు. చంద్రబాబు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఐఎంజీ అనే ఊరూ పేరూ లేని సంస్థకు హైదరాబాద్ నడిబొడ్డున‌ కోట్లాది రూపాయల విలువైన 850 ఎకరాల భూమిని ధారాదత్తం చేశార’ని ఆమె గుర్తుచేశారు. కృష్ణా జిల్లాలో శ్రీమతి షర్మిల బుధవారంనాడు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. హనుమాన్‌జంక్షన్‌లో మొదలైన ఆమె యాత్ర నూజివీడు, రెడ్డిగూడెం తిరువూరు, ఇబ్రహీంపట్నం, నందిగామల్లో భారీ జనసందోహం మధ్య కొనసాగింది.

 రాష్ట్రం రెండు ముక్కలు కాకుండా  వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ చివరి వరకు పోరాడింద‌ని శ్రీమతి షర్మిల తెలిపారు. కానీ స్వార్థం కోసం అందరూ కలిసి రాష్ట్రాన్ని విభజించారని ఆమె ఆరోపించారు. ఇప్పుడు కొత్త రాష్ట్రాన్ని నిర్మించుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉందని చెప్పారు. వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీకి ఇచ్చే గొప్ప విజయంతో అది సాధ్యమ‌న్నారు. ప్రధాన మంత్రి కుర్చీలో ఎవరు కూర్చోవాలో ప్రజలే నిర్ణయించవచ్చన్నారు. కేంద్రం మెడలు వంచి మన రాష్ట్రానికి కావాల్సినవన్నీ చేయించుకుందామని పేర్కొన్నారు.

జగనన్న నాయకత్వంలో ఒక నూతన అధ్యాయాన్ని మొదలు పెడదామని, రాజన్న రాజ్యాన్ని మళ్ళి తెచ్చుకుందామని శ్రీమతి షర్మిల ప్రజలకు సూచించారు. శ్రీమతి షర్మిల వెంట యాత్రలో తోట చంద్రశేఖర్, కోనేరు రాజేంద్ర ప్రసాద్, కుక్కల విద్యాసాగర్, జోగి రమేశ్, మేకా ప్రతాప్ అప్పారావు, పడమట సురే‌శ్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

Back to Top