సింగిల్‌ విండోల్లో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ హవా

హైదరాబాద్‌ :

ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ఎన్నికల్లో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ ‌దూసుకుపోతోంది. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని ఎర్రావారిపాళెం సింగిల్‌విండో డెరైక్టర్ల ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. మొత్తం 13 స్థానాలకు గాను ఆరో చోట్ల వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ మద్దతుదారులు‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్వతంత్ర అభ్యర్థులు మూడుచోట్ల, కాంగ్రెస్, ‌టిడిపిల మద్దతుదారులు ఇద్దరేసి చొప్పున ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ఎన్.మురళి తెలిపారు.

‌ఇదిలా ఉండగా, ‌ప్రకాశం జిల్లాలో 16 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ మద్దతుదారులు తమ హవా కొనసాగిస్తున్నారు. తాజా షెడ్యూల్ ప్రకారం ఈ 16 సొసైటీల్లో శుక్రవారం నామినేషన్ల ఉపసంహరణ ముగిసింది. ఐదు సొసైటీల్లో మెజార్టీ వార్డుల్లో వై‌యస్‌ఆర్‌ కాంగ్రెస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగిలిన వాటిలో కూడా నామమాత్రపు పోటీయే నెలకొన్నది.

ఒక్కొక్క ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో 13 డెరైక్టర్ స్థానాలుంటాయి. సంతనూతలపాడు మండలం గురవారెడ్డిపాలెం సొసైటీలో‌ 11, బేస్తవారిపేటలో 10, గలిజేరుగుళ్లలో 8, పెద్దారవీడులో 8, అద్దంకి మండలం ధర్మవరం సొసైటీలో 7 స్థానాల్లో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ బలపరిచిన వారు ఏకగ్రీవ‌ంగా ఎన్నికయ్యారు. దీంతో ఆ సొసైటీల్లో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పాగా వేయనున్నది.

Back to Top