షర్మిల పాదయాత్ర కాంగ్రెస్, టిడిపిలకు చెంపపెట్టు!

తాడిమర్రి 26 అక్టోబర్ 2012 : షర్మిల మూడు వేల కిలోమీటర్ల ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర పాలక కాంగ్రెస్, ప్రతిపక్ష టీడీపీలకు చెంపపెట్టులాంటిదని నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. బుధ, గురువారాల్లో ఆయన షర్మిల వెంట పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, జననేత వైఎస్ జగన్‌ను ప్రజల నుంచి దూరం చేయడానికి రెండు పార్టీలు కుమ్మక్కై సాగిస్తున్న నీచ రాజకీయాల వల్ల నిష్కారణంగా జగన్ జైలుకు వెళ్లారని ఆయన విమర్శించారు. తాత్కాలికంగా వారు రాక్షస ఆనందం పొందుతున్నా రానున్న కాలంలో వారు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన హెచ్చరించారు. షర్మిల పాదయాత్ర ప్రజాసమస్యలు తెలుసుకోవడం కోసమైతే చంద్రబాబు పాదయాత్ర అధికారం కోసమని ఆయన అన్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజలు విశ్వసిస్తున్నారనడానికి షర్మిల పాదయాత్రకు లభిస్తోన్న అపూర్వ స్పందనే రుజువు అని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు తన పరిపాలనలో ప్రజలను ఏనాడూ పట్టించుకోలేదనీ, అందుకే పరపతీ, విశ్వసనీయత పోగొట్టుకున్నారనీ మేకపాటి వ్యాఖ్యానించారు. గొప్ప మానవతావాది కూతురిగా షర్మిల చేపట్టిన పాదయాత్రను చూస్తుంటే, నాటి ప్రజాప్రస్థానం కన్నా ఎక్కువ ఆదరణ కనిపిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు.

Back to Top