ఢిల్లీలో సమైక్య దీక్షకు జగన్‌కు ఆహ్వానం

హైదరాబాద్, 25 సెప్టెంబర్ 2013:

సమైక్యాంధ్రకు మద్దతుగా ఢిల్లీలోని జంతర్‌మంతర్ ‌వద్ద తాము చేయ తలపెట్టిన నిరసన దీక్షకు మద్దతు ఇవ్వాలని‌ వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అధ్యక్షుడు‌ శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డికి సీమాంధ్ర సెక్రటేరియట్ ఉద్యోగుల ఫోరం విజ్ఞప్తి చేసింది. ఢిల్లీకి రావాలని ఆయనను ఉద్యోగులు ఆహ్వానించారు. సంఘం ప్రతినిధులు బుధవారం ఉదయం లోటస్‌పాండ్‌లో శ్రీ జగన్మోహన్‌రెడ్డితో భేటీ అయ్యారు.

బెయిలుపై విడుదలై మంగళవారం రాత్రే ఇంటికి వచ్చిన శ్రీ జగన్మోహన్‌రెడ్డి ముందుగా తమకు అపాయింట్‌మెంట్ ఇవ్వడంపై ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ‌ఆనందం వ్యక్తం చేశారు. సుమారు అరగంట పాటు జరిగిన ఈ సమావేశంలో సమైక్యాంధ్ర ఉద్యమం జరుగుతున్న తీరుతెన్నులపై ఉద్యోగులను శ్రీ జగన్మోహన్‌రెడ్డి అడిగి తెలుసుకున్నారు. సమావేశం అనంతరం సచివాలయ సీమాంధ్ర ఉద్యోగ సంఘాల నాయకులు మురళీ కృష్ణ, వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో శ్రీ జగన్మోహన్‌రెడ్డి నిజాయతీగా వ్యవహరిస్తున్నారని వారు అన్నారు.  సమైక్యాంధ్ర ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ఉంటుందని శ్రీ జగన్ హామీ ఇచ్చారన్నారు. ముందుగా ఎం‌పి పదవికి రాజీనామా చేసింది కూడా శ్రీ జగనే అని వారు గుర్తుచేశారు. ఉద్యమంలో స్వయంగా పాలుపంచుకోవాలని తాము శ్రీ జగన్‌ను కోరామన్నారు. ఢిల్లీ నిరసన ప్రదర్శనకు శ్రీ జగన్మోహన్‌రెడ్డి స్వయంగా వస్తే బాగుంటుందని పదేపదే వారు అడిగామన్నారు.

అయితే.. షరతులతో కూడిన బెయిల్ ఉన్నందున తాను హైదరాబాద్ నుంచి బయటకు రాలేని కారణంగా...‌ఈ 27న ఢిల్లీలో చేపట్టే తమ ధర్నాకు పార్టీ ప్రతినిధులను పంపిస్తానని శ్రీ జగన్మోహన్‌రెడ్డి తమకు చెప్పారని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు తెలిపారు.

తాజా వీడియోలు

Back to Top