సంక్షేమ పథకాలు వైయస్ మనో ఫలకాలు

రాయదుర్గం:

2004 ఎన్నికలకు మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి సుదీర్ఘ పాదయాత్ర చేపట్టి, ప్రజల కష్టాలను స్వయంగా చూశారనీ, వాటిని తీర్చే ఉద్దేశంతో అధికారంలోకి రాగానే వివిధ పథకాలను అమలు చేశారనీ   రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి కొనియాడారు. రాయదుర్గంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుతం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వైయస్ మది నుంచి పుట్టుకొచ్చినవేనన్నారు. అవి కాంగ్రెస్ పథకాలు కావు కాబట్టే వాటిని ఈ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు.  కొందరు చెబుతున్నట్లు కాంగ్రెస్ పథకాలే అయితే ఆ పార్టీ పాలిత రాష్ట్రా ల్లో ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ఎవరి ఆలోచనలకూ తట్టని విధంగా మహానేత వైయస్ పలు పథకాలు చేపట్టారనీ, వీటిని అమెరికా సైతం ప్రశంసించిందనీ రామచంద్రారెడ్డి గుర్తు చేశారు. పథకాల అమలులో ప్రభుత్వ చేతగానితనాన్ని ప్రశ్నించడంలో టీడీపీ ఘోరంగా విఫలమైందన్నారు. అందుకే చంద్రబాబు పాదయాత్రకు ప్రజాస్పందన కరువైందన్నారు. ఫీజు రీయింబర్సుమెంట్‌కూ, ఆధార్ కార్డుకూ  లంకె పెట్టి, ఆరోగ్యశ్రీలో కొన్ని జబ్బులను తొలగించడం హేయమని ఆయన ధ్వజమెత్తారు. ప్రభుత్వ తీరును  ఎండగడుతూ షర్మిల చేపట్టిన పాదయాత్రకు జనం నీరాజనాలు పలుకుతున్నారని పేర్కొన్నారు. వికలాంగులూ, అంధులూ సైతం స్వచ్ఛందంగా తరలివస్తున్నారన్నారు. లేపాక్షి హబ్ భూములను రైతులకు తిరిగి ఇప్పిస్తామని చంద్రబాబు చెప్పడం సిగ్గుచేటన్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడానికి పరిశ్రమలు ఎంతో అవసరమని ఆయన స్పష్టం చేశారు.

Back to Top