త్వరలో సమైక్య రైతు శంఖారావం: ఉమ్మారెడ్డి

హైదరాబాద్ 16 సెప్టెంబర్ 2013:

దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి వైయస్ షర్మిల చేపట్టిన సమైక్య శంఖారావం యాత్రలో సమైక్యాంధ్రనే కోరుకుంటున్నారనే స్పష్టమైన సందేశం సీమాంధ్ర ప్రజలనుంచి వెలువడిందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు. పార్టీ ప్రధాన కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ యాత్రకు కొనసాగింపుగా త్వరలో తమ పార్టీ సీమాంధ్ర జిల్లాల్లో సమైక్య రైతు శంఖారావం పేరుతో యాత్రను చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. రాష్ట్రాన్ని విడదీస్తే ఎక్కువగా దెబ్బతిని, ఇబ్బందుల పాలయ్యేది రైతులేనని చెప్పారు. కృష్ణా డెల్టాలోని ప్రాజెక్టులన్నీ మిగులు జలాలను ఆధారంగా చేసుకుని నిర్మించినేవేనన్నారు. వర్షాలు తక్కువగా ఉన్న రోజుల్లో మిగులు జలాలు లేక ఎదురయ్యే ఇబ్బంది అంతా ఇంతా కాదన్నారు. మహారాష్ట్ర, కర్ణాటక కాకుండా ఇప్పుడు మధ్యలో తెలంగాణ రాష్ట్రం వస్తే పరిస్థితిని ఊహించలేమన్నారు. దీనివల్ల రైతు ఎదుర్కొనే ఇబ్బందిని దృష్టిలో ఉంచుకుని ఈ యాత్రను తలపెట్టామని ఉమ్మారెడ్డి వివరించారు.
యాత్ర షెడ్యూలును త్వరలో విడుదల చేస్తామని ఆయన చెప్పారు. యాత్రలో వేలాది మంది రైతులు ట్రాక్టర్లతో వచ్చి సూచించిన ప్రాంతంలో ప్రదర్శనలో పాల్గొంటారని తెలిపారు. పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి విజయమ్మ ఈ యాత్రకు నేతృత్వం వహిస్తారన్నారు. సమైక్యాంధ్ర కావాలని కోరుకుంటున్న ప్రతి వర్గమూ ఈ యాత్రలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. రైతులే కాక వారికి సానుభూతిగా ఉంటే ప్రతి ఒక్కరూ ఇందులో పాల్గొనవచ్చన్నారు. మొదటి నుంచి తమ పార్టీ రాష్ట్ర ప్రజల శ్రేయస్సే ఆశయంగా పనిచేస్తోందని పేర్కొన్నారు.

Back to Top