మంత్రి నారాయణను బర్తరఫ్ చేయాలి.


విజయవాడ:  గుంటూరు జిల్లాలో కలుషిత నీళ్లు తాగి 10 మంది మరణించడం,20 మందికి పైగా కిడ్నీలు పాడపోవడం, వందలాది మంది ఆసుపత్రులు పాలు కావడానికి నైతిక బాధ్యత వహిస్తూ  పురపాలక శాఖ మంత్రి నారాయణను వెంటనే మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలని వైయస్‌ ఆర్‌ సీపీ ఎమ్మెల్యే అనిల్‌ కుమార్‌ యాదవ్‌ డిమాండ్‌ చేశారు. విజయవాడపార్టీ కార్యాలయంలో మంగళవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. కలుషిత నీటిని తాగి మరణించిన సంఘటనలన్నీ ప్రభుత్వ హత్యలుగా భావించి కేసులు నమోదు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. 
రాజధానికి సమీపంలోని ప్రధాన నగరంలో కలుషిత నీటి సమస్యగురించి స్థానికి ఎమ్మెల్యే పదే పదే ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోవడం  పురపాలక శాఖ, ప్రభుత్వ పాలన తీరుకు నిదర్శనమని ఆయన మండిపడ్డారు. ఈ సంఘటన జరిగిన పది రోజుల తరువాత కూడా మరణాలకు బాధ్యులెవరన్న దానిపై చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటన్నారు.  అధికారుల నిర్లక్ష్యం కారణంగానే అమాయకులైన ప్రజలు మరణించారంటూ స్వయంగా టిడిపి ఎమ్మెల్యేనే ప్రస్తావించినా, పురపాలక మంత్రి నారాయణలో  కనీస స్పందన కరువవ్వడం దారుణమని అన్నారు. ఆయన కళాశాలల్లో పిల్లలు పిట్టల్లా రాలినా స్పందించరనీ, కలుషిత నీరు తాగి ప్రజలు మరణించినా స్పందించే మానవత్వం లేని మంత్రి నారాయణకు ఒక్క నిముషం కూడా మంత్రిగా కొనసాగే నైతిక అర్హత లేదని ఆరోపించారు. ఈ ఘటనకు మంత్రి బాధ్యత వహించకుంటే, మంత్రితోపాటు, గుంటూరు మున్సిపల్‌ కమిషనర్‌ ను కూడా వెంటనే బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.

ప్రత్యేక హోదాపై లఘు చర్చ పేరుతో కొత్త డ్రామా

ప్రత్యేక హోదా కావాలంటూ అసెంబ్లీలో రెండు సార్లు తీర్మానం చేసిన పంపిన తరువాత మరోసారి లఘు చర్చ పేరుతో చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో కొత్త డ్రామాకు తెరదీశారని అనిల్‌ కుమార్‌ ఆరోపించారు.  గతంలోని తీర్మానాలు తుంగలోకి తొక్కించిన చంద్రబాబు నాయుడు , ఇప్పుడు ప్రజా ఆగ్రహాన్ని చూసి యూటర్న్‌ తీసుకున్నారన్నారు. ప్రత్యేక హోదాపై ఇప్పుడు చర్చ జరగాల్సింది అసెంబ్లీలో కాదని, కేంద్ర ప్రభుత్వం వద్ద అని పేర్కొన్నారు. ఓటుకు నోటు కేసులో ఎక్కడ జైలుకు వెళ్లాల్సి వస్తుందేమో అన్న భయంతో ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టింది చంద్రబాబు కాదా అని సూటిగా ప్రశ్నించారు. 
ఆనాడు అర్దరాత్రి కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీ ప్యాకేజిని ప్రకటిస్తే, స్వాగతించి,సత్కారాలుచేసిందెవ రో ప్రజలందరికీ తెçలుసునన్నారు. కాంగ్రెస్‌ పార్టీ విభజన చట్టంలో హోదాను చేర్చడం లేదంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్న చంద్రబాబు గారూ, ఈ నాలుగేళ్లలో ఎన్నోసార్లు చట్ట సవరణలు జరగ్గా, విభజన చట్టంలో సవరణలు ఎందుకు చేయించక లేకపోయారని సూటిగా ప్రశ్నించారు. 

తమ జిల్లాకు చెందిన దుగరాజపట్నం పోర్టు విషయంలో చంద్రబాబు నాయుడు చేసిన మోసం గురించి ప్రస్తావిస్తూ, ఆపోర్టు వద్దని లేఖ రాసిన విషయంవాస్తవం కాదా చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఇప్పుడు కూడా ప్యాకేజి ఇస్తే చాలు ఏదో విధంగా సర్దుకుపోదాం అన్నట్లుగా నామమాత్రపు ఆందోళనలుతప్ప చిత్తశుద్దితో పనిచేయడం లేదన్నారు. ఇప్పటికైనా ప్రజలను మోసం చేయకుండా కేంద్రంతో  పోట్లాడాలని డిమాండ్‌ చేశారు. ఇంకా ఎన్‌డిఎ లోనే కొనసాగుతూ ,రాష్ట్ర హక్కులకోసం పోరాటం చేస్తున్నామంటూ బాబు ద్వంద్వ వైఖరితో వ్యవహరిస్తున్నారన్నారు. 
Back to Top