మా రాజీనామాలు ఆమోదించాలని స్పీకర్‌ను కోరా

న్యూఢిల్లీ :‌

వైయస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి, తాను లోక్‌సభ సభ్యత్వాలకు చేసిన రాజీనామాలను ఆమోదించాలని‌ స్పీకర్ మీరాకుమా‌ర్‌ను కోరినట్టు పార్టీ ఎం.పి. మేకపాటి రాజమోహన్‌రెడ్డి చెప్పారు. రాజీనామాలను ఆమోదించుకోవడానికి శనివారం స్పీకర్‌ను కలిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.

‘నేను గత నెల 5న, మా పార్టీ అధ్యక్షుడు శ్రీ జగన్మోహన్‌రెడ్డి అదే నెల 10న రాజీనామాలను ఫ్యాక్సు ద్వారా పంపించాం. 24న స్పీకర్‌ను కలవాలనుకున్నా కుదరలేదు. ఇవాళ కలిశాం. మా ఇద్దరి రాజీనామాలను ఆమోదించాలని స్పీకర్‌ను కోరా. శ్రీ జగన్ హైదరాబా‌ద్ నుంచి రావడం కష్టం కనుక, ఆయన ఫో‌న్ నంబ‌ర్ ఇచ్చా. ఫోన్ ‌ద్వారా వ్యక్తిగతంగా మాట్లాడి రాజీనామా విషయాన్ని ధ్రువీకరించుకోమని చెప్పా. నేను చెప్పిన విషయాలను వాళ్లు రికార్డు చేసుకున్నారు. తప్పనిసరిగా మా రాజీనామాలను ఆమోదిస్తారని ఆశిస్తున్నాం’ అని‌ మేకపాటి చెప్పారు.

టిడిపి నాయకుల దుర్మార్గపు మాటలు:
‘వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ‌ ఎఐసిసి అధ్యక్షురాలు సోనియాకు ఫోన్ చేసి కృతజ్ఞతలు తెలిపినట్టు, ‌తాను, శ్రీమతి విజయమ్మ వెళ్లి రాహుల్‌ను కలిసినట్టు కొందరు టిడిపి నాయకులు దుర్మార్గమైన, అన్యాయమైన మాటలు మాట్లాడుతున్నారు’ అని మేకపాటి మండిపడ్డారు. ‘నేను గురువారం రాత్రి ఢిల్లీకి వచ్చా. శ్రీమతి విజయమ్మ శుక్రవారం ఉదయం వచ్చా రు. ఇక్కడి నుంచి నేరుగా జంతర్‌మంతర్‌లోని సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ధర్నాలో పాల్గొన్నాం. మధ్యాహ్నం 3 గంటల తరువాత శ్రీమతి విజయమ్మ హైదరాబాద్ వెళ్లిపోయారు. రాహు‌ల్‌ను కలిసిందేమిటి? సోనియాకు కృతజ్ఞతలు చెప్పిందేమిటి? అన్నీ తప్పుడు ఆరోపణలే’ అని టిడిపి నాయకుల తీరును మేకపాటి తీవ్రంగా దుయ్యబట్టారు. తొమ్మిదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన టిడిపికి ప్రజల్లో విశ్వసనీయత లేదన్నారు. అసత్య ప్రచారాలు టిడిపి మానుకోవాలి.

Back to Top