రైతన్న కోసం ప్రత్యేక నిధి ఏర్పాటు

దైవందిన్నె(కోడుమూరు):

రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలూ హాయిగా జీవించేందుకు వైయస్ఆర్ కాంగ్రెస్ కృషి చేస్తుందని పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైయస్ షర్మిల భరోసా ఇచ్చారు. ప్రస్తుతం రైతులు పంటకు గిట్టుబాటు లభించక, పిల్లలు చదువుకోలేక, పింఛన్లు అందక నానా ఇబ్బందులకూ గురవుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. జగనన్న ముఖ్యమంత్రి అయితే రైతుకు పంటను నష్టానికి అమ్ముకునే పరిస్థితి రానీయకుండా చూస్తారని చెప్పారు. అందుకోసం మూడు వేల కోట్లతో నిధి ఏర్పాటుచేస్తారని తెలిపారు. అమ్మ ఒడి పథకం కింద పిల్లలు చదువుకోడానికి నెలకు రూ. 500 ఇస్తారన్నారు. వృద్ధులు, వింతతు పింఛను రూ. 700, వికలాంగ పింఛను వెయ్యి రూపాయలవుతాయని ఆమె వివరించారు. కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గంలోని దైవందిన్నెలో శనివారం రాత్రి ఏడు గంటలకు ఏర్పాటైన కార్యక్రమంలో ఆమె ప్రసంగించారు. పాదయాత్రలో తనను కలుస్తున్న ప్రజల కష్టనష్టాలు తెలుసుకుంటున్నాననీ, అందరి వెతలు తీరేలా ఏడాదిలోగా రాజన్న రాజ్యం వస్తుందనీ చెప్పారు.

విద్యార్థుల దుస్తులు చూసి చలించిన షర్మిల
 
     ప్రజలు ఇంకొక్క ఏడాది ఓపిక పట్టాలనీ, అనంతరం సమస్యలు తీరిపోతాయనీ షర్మిల చెప్పారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం కె.తిమ్మాపురం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను ఆమె శనివారం సందర్శించారు. అక్కడ చినిగిన దుస్తుల్లో ఉన్న విద్యార్థులను చూసి షర్మిల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. విద్యా కార్యకర్తలు తమ సమస్యలను షర్మిలకు విన్నవిస్తూ.. విద్యార్థులకు సరిపడా తరగతి గదులు లేవని తెలిపారు. తమకు కనీసం జీతాలు కూడా సరిగా చెల్లించడం లేదని పేర్కొన్నారు. టీచర్లు ముగ్గురే ఉండడంతో తరగతులు నిర్వహించడం ఇబ్బందిగా ఉంటోందని చెప్పారు. ఇందుకు షర్మిల స్పందిస్తూ ప్రజలు మరో ఏడాది ఓపిక పట్టాలని కోరారు. అనంతరం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి, జగన్ రాజన్న పాలన తెస్తారన్నారు. సమస్యలన్నింటినీ జగన్ పరిష్కరిస్తారని ఆమె స్పష్టం చేశారు. వెనుకబాటుతనానికి చదువే పరిష్కారమని, విద్యార్థులు చదువుపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు.

Back to Top