పులివెందులలో వైయస్ఆర్‌ కాంగ్రెస్ ధర్నా

పులివెందుల, 30 నవంబర్ 2012: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డికి బెయిల్ రాకుండా అడ్డుతగులుతున్న సీబీఐ తీరుకు నిరసనగా  వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆందోళనకు దిగారు.  సాక్షులను ప్రభావితం చేస్తారనే వింత వాదనతో కోర్టులను కూడా సీబీఐ తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించారు.

     సీబీఐ తీరుకు నిరసనగా వైయస్ఆర్ కడప జిల్లాలోని పులివెందులలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పట్టణంలోని దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహం వద్ద నల్ల బ్రాడ్జీలు ధరించి ఆందోళనకు దిగారు. పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవినాష్ రెడ్డి మాట్లాడుతూ,  కాంగ్రెస్ పార్టీ కనుసన్నుల్లో సీబీఐ నడుస్తోందని ఆరోపించారు.

    శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి కేసులో సీబీఐ అనుసరిస్తున్న తీరు దారి తప్పినట్టుగా కనిపిస్తోందని అవినాష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్టైయిన 90 రోజుల్లో చార్జీషీట్ దాఖలు చేయాల్సి ఉన్నప్పటికీ సీబీఐ కావాలనే కాలయాపన చేస్తోందన్నారు. సాక్షులను ప్రభావితం చేస్తారనే కుంటి సాకుతో శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డికి బెయిల్ రాకుండా చేస్తోందని ఆయన విమర్శించారు.

Back to Top