ప్రజల రక్తం పీలుస్తున్న రాబందుల రాజ్యం

రావిరాల (రంగారెడ్డి జిల్లా), 13 డిసెంబర్‌ 2012: రాష్ట్రాన్ని ఏలుతున్న కిరణ్‌ కుమార్‌రెడ్డి ప్రభుత్వం అన్ని వస్తువుల ధరలు అడ్డదిడ్డంగా పెంచేసి ప్రజల రక్తం తాగుతున్నదని శ్రీమతి షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర 57వ రోజు గురువారంనాడు ఆమె రంగారెడ్డి జిల్లా మహేశ్వరరం నియోజకవర్గంలోని రావిరాలలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. రాష్ట్రంలో ఇప్పుడున్నది రాబందుల రాజ్యమని ఆమె వ్యాఖ్యానించారు. దివంగత మహానేత డాక్టర్ వై‌యస్ రాజశేఖరరెడ్డి‌ అధికారంలో ఉన్నప్పుడు ఛార్జీలు పెంచకుండానే సంక్షేమ కార్యక్రమాలనూ చేపట్టారని శ్రీమతి షర్మిల గుర్తు చేశారు. కరెంటు ఇచ్చేది నాలుగ్గంటలట! దానికి బిల్లు వచ్చేదేమో నాలుగింతలట! ఈ రాబందుల రాజ్యంలో ఇలాంటి దారుణాలే జరుగుతున్నాయని శ్రీమతి షర్మిల నిప్పులు చెరిగారు. రాష్ట్ర ప్రజలకు దివంగత మహానేత ఇచ్చిన మాటను ఈ ప్రభుత్వం పక్కన పెట్టేసిందని దుయ్యబట్టారు.

జగనన్న నేతృత్వంలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే మహిళలు, రైతులకు వడ్డీ లేని రుణాలు అందిస్తారని శ్రీమతి షర్మిల హామీ ఇచ్చారు. జగనన్న ముఖ్యమంత్రి అయితే, మీకు ఇచ్చిన వాగ్దానాన్ని తప్పకుండా నెరవేరుస్తారని భరోసా ఇచ్చారు. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు వీలుగా వడ్డీ లేని రుణాలు మంజూరు చేస్తారని చెప్పారు. అలాగే రైతుల ఆర్థిక ఇబ్బందులకు ఫుల్‌స్టాప్‌ పెట్టేందుకు వడ్డీ లేని రుణాలు అందిస్తారన్నారు. పావలా వడ్డీ పేరుతో కిరణ్‌ కుమార్‌ ప్రభుత్వం మహిళలు, రైతులను దారునంగా మోసగిస్తోందని దుయ్యబట్టారు. పావలా వడ్డీకే రుణాలు ఇచ్చామని చెప్పుకుంటున్నప్పటికీ రైతులు, మహిళల నుంచి రూ. 1.50 నుంచి రూ. 2 వడ్డీ వసూలు చేస్తున్నారని ఆరోపించారు.

అంతకు ముందు రావిరాలలో మహిళలు తమ బాధలను శ్రీమతి షర్మిల ముందు ఏకరువు పెట్టారు. కరెంటు సరఫరా సరిగా లేకపోయినా బిల్లులు మాత్రం ఎక్కువగా వస్తున్నాయని ఆవేదన చెందారు. పావలా వడ్డీ రుణాలు తీసుకున్నా తమ నుంచి ఎంతెంత మొత్తాల్లో వడ్డీ వసూలు చేస్తున్నదీ వారంతా శ్రీమతి షర్మిలకు చెప్పి విచారం వ్యక్తంచేశారు. 

Back to Top