ప్రజల కష్టాలు పట్టించుకోని కేసీఆర్


కొత్తూరు (మహబూబ్ నగర్ జిల్లా), 10 డిసెంబర్ 2012:

దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి షర్మిల టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌పై నిప్పులు చెరిగారు. ఓట్లేసి గెలిపింపిన ప్రజల కష్టాలను పట్టించుకోకుండా ముఖం చాటేశారని విమర్శించారు. పాలమూరు జిల్లాలో ప్రజలు తాగునీరు, సాగు నీరు లేక అల్లాడుతుంటే కేసీఆర్ మాత్రం ఫామ్ హౌజ్, ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో గెలిచినప్పటి నుంచి ఇప్పటి వరకు స్థానిక సమస్యల మీద పోరాడిందీ లేదన్నారు.

     అక్టోబర్ 18న ఇడుపులపాయలో 'మరో ప్రజా ప్రస్థానం' పాదయాత్ర ప్రారంభించిన శ్రీమతి షర్మిల కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల మీదుగా పాలమూరు జిల్లాలో కొనసాగుతున్నారు. పాదయాత్రలో భాగంగా సోమవారం 54వ రోజు జిల్లాలోని కొత్తూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో శ్రీమతి షర్మిల ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. జిల్లాలో ఎంతో మంది విద్యార్థులు ఫీజులు కట్టలేక, కూలి పనులు దొరక్క ఇళ్లకే పరిమితమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఆర్భాటాలే కానీ అమలు శూన్యం


     ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటనలతో ఆర్భాటాలు ప్రదర్శించడమే తప్పా ఆచరణలో మాత్రం జీరో అని శ్రీమతి షర్మిల విమర్శించారు. మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు ఇస్తామని ప్రకటించిన సీఎం కిరణ్ అసలు రుణాలే ఇవ్వడం లేదన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని నిర్వీర్యం చేశారన్నారు. ఆర్టీసీ, విద్యుత్తు చార్జీలు, అన్ని రంగాల్లో పన్నులు పెంచుతూ ప్రజలపై భారం మోపుతున్నారని ఆరోపించారు. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన ప్రతిపక్ష నేత చంద్రాబు ప్రభుత్వంతో కుమ్మక్కు అయ్యారని ఆరోపించారు.

పన్నులు పెంచని ఘనత వైయస్‌ఆర్‌ది

     రాష్ట్రంలో ఆర్టీసీ, కరెంటు చార్జీలు, పన్నులు పెంచని ఘనత మహానేతకే దక్కుతుందని శ్రీమతి షర్మిల అన్నారు. ఏ చార్జీలు పెంచకుండానే రాష్ర్టాన్ని అభివృద్ధి చేశారన్నారు. నిరు పేద విద్యార్థులు కూడా ఉన్నత చదువులు అభ్యసించాలని ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని అమలు చేశారన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా రోజుకు వంద రూపాయలకు పైగా చెల్లించి గ్రామీణ ప్రజలకు పని కల్పించారన్నారు. ఇప్పుడున్న ప్రభుత్వం ఆ పథకాన్ని నీరుగార్చుతోందన్నారు.

జగనన్నను ఎవరూ ఆపలేరు

     కుట్రలు, కుతంత్రాలతో జగనన్నను జైలుకు పంపారని శ్రీమతి షర్మిల ఆరోపించారు. ఓదార్పు యాత్ర చేస్తానని ఇచ్చిన మాట కోసం ముందుకు సాగిన జగనన్నను అన్యాయంగా కేసుల్లో ఇరికించారన్నారు. ఎవరెన్ని కుయుక్తులు పన్నినా జగనన్నను అడ్డుకోలేరని అన్నారు. త్వరలోనే బయటకు వచ్చి రాజన్న రాజ్యం తీసుకు వస్తారన్నారు. ప్రజలు అండగా ఉండి సమయం వచ్చినప్పుడు ఆశీర్వదించాలని శ్రీమతి షర్మిల కోరారు.

     పరిసర గ్రామాల నుంచి జనం భారీగా తరలి రవడంతో కోత్తూరు నగర వీధులు కిక్కిరిసి పోయాయి. శ్రీమతి షర్మిల ప్రసంగాన్ని ప్రత్యక్ష చూసేందుకు ప్రజలు మధ్యాహ్నం నుంచే కొత్తూరు బాట పట్టారు.

Back to Top