ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరుస్తాం

కాకినాడ నగరంలో ఇంటింటి ప్రచారంలో వైయస్‌ఆర్‌సీపీ అభ్యర్థులు
కాకినాడ: కాకినాడ నగర పాలక ఎన్నికల్లో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధిస్తే ప్రజల జీవన ప్రమాణాలు పెంచుతామని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. కాకినాడ కార్పొరేషన్‌ ఎన్నికల్లో వైయస్‌ఆర్‌సీపీ అభ్యర్థుల తరఫున మంగళవారం విజయసాయిరెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, సిటీ కో–ఆర్డినేటర్‌ ముత్తా శశిధర్‌ తదితరులు ప్రచారం నిర్వహించారు. నగరంలోని పలు వార్డులలో వైయస్‌ఆర్‌సీపీ అభ్యర్థులు ఇంటింటా ప్రచారం నిర్వహిస్తున్నారు. 19, 20వ వార్డులలో ప్రచారం నిర్వహించిన విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. కాకినాడలో డ్రైనేజీ లేకపోవడంతో  ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. దోమల బెడదతో రోగాల బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నగరంలో మురుగునీటి పారుదల వ్యవస్థ అధ్వాన్నంగా ఉందని మండిపడ్డారు. వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే డ్రైనేజీ సమస్యను పరిష్కరిస్తామన్నారు. నగరంలోని అన్ని సమస్యల్ని చిత్తశుద్ధితో సామరస్యంగా పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. టీడీపీ మూడున్నరేళ్ల పాలన పట్ల ప్రజలు పూర్తి వ్యతిరేకతతో ఉన్నారని తెలిపారు. సమస్యల పరిష్కారంలో చంద్రబాబు సర్కార్‌ విఫలమైందన్న భావన ప్రజల్లో ఉందన్నారు. కాకినాడ పట్టణాన్ని స్మార్ట్‌ సిటీగా ప్రకటించినా ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదని ధ్వజమెత్తారు. రూ.200 కోట్లు ఖర్చు చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు రూ.2 కోట్లు మాత్రమే నిధులు ఖర్చు చేశారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న దోరణిని కాకినాడ ప్రజలు తీవ్రంగా ఖండిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ వైఫల్యాలే వైయస్‌ఆర్‌సీపీ గెలుపునకు దోహదపడుతాయని విజయసాయిరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.
Back to Top