'ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి టిడిపి మద్దతు'

తిరుపతి, 14 నవంబర్‌ 2012: రాష్ట్రప్రభుత్వం మైనార్టీలో పడిపోయినప్పటికీ అవిశ్వాసం పెట్టేందుకు టిడిపి ముందుకు రాకపోవడాన్ని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి తప్పుపట్టారు. ఆల్‌ ఇండియా మజ్లిస్‌ ఇత్తెహాదుల్‌ ముస్లిమీన్‌ (ఎఐఎంఐఎం) మద్దతు ఉపసంహరించుకున్న నేపత్యంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం నైతికంగా మైనార్టీలో పడిపోయిన విషయాన్ని భూమన ఉటంకించారు. కాంగ్రెస్‌ పార్టీకి బలం ఉన్న సమయంలో నామ్‌ కే వాస్తేగా అవిశ్వాసం పెట్టిన టిడిపి ఇప్పుడు మైనార్టీలో పడిన ప్రభుత్వాన్ని గద్దె నుంచి దించేందుకు ముందుకు రాకపోవడం సిగ్గుచేటు అన్నారు. బుధవారంనాడు ఆయన తిరుపతిలో ఈ వ్యాఖ్యలు చేశారు.

నిజానికి కిరణ్‌ కుమార్‌రెడ్డి ప్రభుత్వాన్ని టిడిపి తన భూజానికి ఎత్తుకుని మోస్తున్నదని భూమన దుయ్యబట్టారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వంపై టిడిపి అవిశ్వాసం పెడితే కుప్పకూలిపోవడం తథ్యమని ఆయన వ్యాఖ్యానించారు. అయినప్పటికీ టిడిపి ఆ దిశగా చర్యలు చేపట్టేందుకు ముందుకు రాకపోవడం సిగ్గుచేటు అన్నారు. అవిశ్వాస తీర్మానాన్ని టిడిపి ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టే విధానం ఎంతమాత్రమూ కనిపించడంలేదన్నారు. అడుగడుగునా ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని కాపాడేందుకు టిడిపి ప్రయత్నిస్తున్నట్లు ఉన్నదన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలు కొనసాగిస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వానికి కొమ్ముకాయడమే టిడిపి విధానంగా ఉందని భూమన ఆరోపించారు. ఈ ప్రభుత్వం నిలబడడానికి, ఈ ప్రభుత్వమే కొనసాగాలని టిడిపి కంకణం కట్టుకుని పనిచేస్తున్నట్లు కనిపిస్తోందన్నారు.

అసెంబ్లీలో మెజారిటీ లేని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని అవిశ్వాస తీర్మానం పెట్టమని అనడం టిడిపి సిగ్గులేనితనానికి నిదర్శనం అని భూమా దుయ్యబట్టారు. ఎంఐఎం మద్దతు ఉపసంహరించుకున్నందునే మేం అవిశ్వాసం పెట్టబోమని టిడిపి నాయకుడొకరు చెప్పడాన్ని ఆయన ఎద్దేవా చేశారు. ఈ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నదని, రాబందుల్లా పరిపాలిస్తున్నదన్న విషయం తెలిసి కూడా దానిపై అవిశ్వాసం పెట్టబోమని టిడిపి అనడాన్ని ఆయన తప్పుపట్టారు. ఈ విషయంలో టిడిపి కుయుక్తి మరోసారి తేటతెల్లం అయిందన్నారు.
Back to Top