ప్రజాభిమానం ఆరు నెలలుగా బందీ

ఆడి తప్పని వాడు లేడు అనుకున్నారంతా. ఉన్నానని ఓ జన సమ్మోహన రూపం కట్టెదుట నిలిచేసరికి కళ్ళు బైర్లు కమ్మాయి కొందరికి. ఆ వెలుతురును తట్టుకోలేక గింగిరాలు తిరిగారు. ఆ వెలుగును ఆర్పడానికి అక్రమ కూటములు కట్టారు. ఓ మహా కుట్రకు తెరదీశారు. ఫలితంగా ఆ వెలుగు తాత్కాలికంగా నిర్బంధానికి గురయ్యింది. ఇది జరిగి నేటికి ఆరు నెలలైంది.

జగన్మోహన్ రెడ్డి... వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు.. మూడేళ్ళ క్రితం కర్నూలు జిల్లాలోని నల్ల కాలువ వద్ద ఏర్పాటైన బహిరంగా సభలో 'మీ ఇళ్ళకు వచ్చి ఓదారుస్తా'నని ఇచ్చిన మాట ఓదార్పు యాత్ర రూపాన్ని దాల్చింది.
    
     జన సంక్షేమమే జెండాగా, ఎజెండాగా పనిచేసిన మహానేత కన్నుమూసిన దురదృష్టకర ఘటన రాష్ట్రాన్ని కుదిపేసింది. ఆ వార్త విని ఎన్నోవందల గుండెలు ఆగిపోయాయి. ఈ పరిణామం ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డిని మరింత  కుంగదీశాయి. వైయస్ఆర్ కన్నుమూసిన పావురాలగుట్ట చెంత, నల్లకాలువ సాక్షిగా సభ నిర్వహించారు. సభలో జగన్ ఈ మరణాలను గుర్తుకు చేసుకుని ఉద్వేగానికి లోనయ్యారు. చనిపోయినవారంతా తనకు ఆత్మబంధువులనీ, వారి కుటుంబ సభ్యులందరినీ కలుసుకుని ఓదార్చి, తన ధర్మాన్ని నెరవేరుస్తాననీ  ప్రకటించారు. అందుకు అత్యున్నత అధికార పీఠం అంగీకరించలేదు. ఆజ్ఞ మీరితే కష్టాలు తప్పవనీ  సంకేతాలిచ్చింది. తాను నమ్మిన ధర్మం ముందు సంకేతాలు నిర్వీర్యమైపోయాయి.
వణికించిన ఫలితమా ఇది..
      ఓదార్పు యాత్రలో జగన్మోహన్ రెడ్డి పట్ల ప్రజలు చూపిన ఆదరణ ఢిల్లీ గద్దెను వణికించాయి. తత్ఫలితంగా కుట్రలు పన్ని ఓ వ్యూహం ప్రకారం ఆయనను జైలులో  పెట్టించింది. ఢిల్లీ గద్దె ఆడిన నాటకంలో సీబీఐ, రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్ష పార్టీలు పావులయ్యాయి. అలా జగన్ జైలుపాలయి నేటికి నవంబరు 27కు ఆరు నెలలయింది. రాజకీయ పద్మవ్యూహంలో జననేతను ఇరికించిన విషయం ప్రజలకు అవగతమైంది. జన బలంతో ఆయన ఈ వ్యూహాన్ని ఛేదిస్తారని వారంతా నమ్ముతున్నారు.
 అధికారంలో లేని వ్యక్తిపై కేసులా!       
     ఆయనను జైలులో ఎందుకుంచారనే అంశంపై ప్రజలు ప్రభుత్వానికి కొన్న మౌలికమైన ప్రశ్నలను సంధిస్తున్నారు. అధికార దుర్వినియోగం కారణంగానే జగన్మోహన్ రెడ్డి వ్యాపార సంస్థల్లోకి పెట్టుబడులు వచ్చాయని పెట్టిన ఈ కేసులో మంత్రులెవరూ అధికార దుర్వినియోగానికి పాల్పడలేదని రాష్ట్ర ప్రభుత్వం తేల్చింది. వారు జారీ చేసిన జీఓలన్నీ నిబంధనలకు అనుగుణంగానే జారీ అయ్యాయని పేర్కొంది. అదే నిజమైతే.. ఎన్నడూ అధికారంలో లేని జగన్ మీద కేసు ఎందుకు పెట్టారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఎంపీ పదవికి రాజీనామా చేసిన జగన్ సాక్షుల్ని ఎలా ప్రభావితం చేస్తారనే అంశంపై ఎవరూ నోరు మెదపడం లేదు. సీబీఐనీ, సాక్షుల్ని యధేచ్ఛగా వాడుకుంటున్న వారంతా బయటే ఉన్నారు. జగన్ మీద దర్యాప్తు చేయాలని కాంగ్రెస్, టీడీపీలు అడిగితే హైకోర్టు ఎలా అంగీకరించిందని కూడా వారు ప్రశ్నిస్తున్నారు. ఐఎంజీ కేసులో చంద్రబాబు మీద విచారణ చేయడానికి సిబ్బంది, డబ్బూ లేవని బదులిచ్చిన సీబీఐ, జగన్ కేసును విచారిస్తానని తనంతట తాను అడిగిన దాని వెనుక ఉద్దేశం సుస్పష్టం.

కక్ష సాధింపేనా..!
     ఇది 26 జీవోలకు సంబంధించిన కేసా లేక, జగన్ పత్రిక, పరిశ్రమలు, పార్టీ పెట్టుకున్నందుకు కక్షసాధింపుగా పెట్టుకున్నారా అనే సందేహమూ కలుగుతోంది. అధికార, ప్రతిపక్షాలు కలిసి మూడో పార్టీ రాజకీయ యవనికపై మెరవకూడదని ఇలా అరెస్టులకు పాల్పడిందనేదీ స్పష్టమవుతోంది. కేసును విచారించాల్సిందిగా హైకోర్టు 2011 జూలైలో ఆదేశించింది. ఇప్పటికీ 16 నెలలు గడిచింది. జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేసి ఆర్నెల్లయ్యింది. 2011 మార్చిలో తెలుగుదేశం, 2010 నవంబరులో శంకరరావు వేసిన కేసులో ప్రాథమిక విచారణను రెండు వారాల్లో పూర్తిచేసి సీల్డు కవరులో నివేదిక సమర్పిస్తామని సీబీఐ కోర్టుకు విన్నవించింది. మూడు వారాల్లో నివేదిక సమర్పించింది. అన్ని ఆధారాలనూ మూడు వారాల్లో సంపాదించిన ఆ సంస్థ ఇప్పుడు ఇన్ని నెలలు ఎందుకు తాత్సారం చేస్తోందనే అనుమానం అందరిలోనూ బలపడుతోంది. ఉప ఎన్నికలకు ముందు అరెస్టు చేసి ఆరు నెలలపాటు జైలులో బంధించి ఉంచడానికి కారణాలు ఏవైనప్పటికీ, బెయిలు ఇవ్వకుండా వ్యూహాలు పన్నడం వెనుక రాజకీయ కుట్ర ఉందని అందరూ విశ్వసిస్తున్నారు. ఇలాంటి కుట్ర రాష్ట్ర చరిత్రలోనే లేదంటే అతిశయోక్తి కాదు. ఇంకా ఆయన్ను జైల్లోనే ఉంచాలని భావించడానికి కారణం ఆరు నెలలుగా చేసిన దర్యాప్తులో  ఆధారాలేవీ బయటపడలేదని భావించాల్సి వస్తుంది. ఇప్పటికీ 16 నెలలుగా దర్యాప్తు చేస్తున్నా సమయం చాలలేదని కూడా అనుకోవాల్సి ఉంటుంది. ఈ కాలంలో జగన్ ఏ సాక్షుల్నీ ప్రభావితం చేయలేకపోయినా ఆయన్నెందుకు జైలులోనే ఉంచాలనుకుంటున్నారో అర్ఝథం కాని అంశం.

కోర్టు చెప్పిందేమిటి.. సీబీఐ చేస్తున్న దేమిటి?
    26 జీవోల కేసులో ప్రభుత్వపరంగా అక్రమాలు, అధికార దుర్వినియోగం చోటుచేసుకుని జగన్మోహన్ రెడ్డి కంపెనీల్లోకి నిధులు వచ్చాయా అనే అంశాన్ని తేల్చి చెప్పాలని హైకోర్టు సీబీకి సూచించింది. ఆ పెట్టుబడుల వివరాలు తెలుసుకోమంది తప్ప.. అక్రమ పెట్టుబడులున్నాయనీ, ఆయన ఆస్థులపై దాడులు చేయమనీ ఏ కోర్టూ ఆదేశించలేదు. కోర్టు ఆదేశాలను అందుకున్న వారంలోగానే సీబీఐ 29 బృందాలను నియమించింది. దేశ చరిత్రలో ఎన్నడూ లేనంత స్థాయిలో పెట్టుబడిదారుల ఇళ్ళు, కార్యాలయాలపై దాడులు చేయించింది. ఈ చర్య చూసిన వారందరికీ ఇది దర్యాప్తు కాదనీ, పక్కా రాజకీయ వ్యూహాన్ని అమలు చేస్తున్నారనీ అవగతమైంది.
మాట మాట్లాడితే.. సాక్షుల్ని ప్రభావితం చేస్తారంటూ బెయిలు నిరాకరిస్తున్న సీబీఐ సక్రమంగా దర్యప్తు చేస్తే చర్యలు తీసుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డిమీదో, సీబీఐ అధికారుల మీతో తేలుతుంది. ఆయన వ్యతిరేక మీడియా సంస్థలతో, వ్యతిరేక రాజకీయ పార్టీలతో చేతులు కలిపి కాకమ్మ కథనాలు రాయించిన సీబీఐ అధికారులను అరెస్టు చేయించాలా లేక ఇంకెవరినైనా అరెస్టు చేయించాలో తేలుతుంది. జగన్మోహన్ రెడ్డిపై పగ పట్టిన వారందరి చేతికీ పగ్గాలు ఇచ్చి ఆయననకు వ్యతిరేకంగా కేసే ఇది తప్ప.. సీబీఐ ఏ భారతీయ న్యాయ చట్టాన్నీ పట్టించుకోలేదన్నది స్పష్టమైపోయింది. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల హై కమాండ్లు ఏ కమాండ్లు ఇచ్చారో వాటినే పట్టించుకున్నారనేది తేలిపోయింది. వేసిన నాలుగు అభియోగ పత్రాల్లో నిందితులుగా చూపించిన వారిలో అతి తక్కువ మందికి మాత్రమే సీబీఐ బెయిల్ పిటిషన్లను వ్యతిరేకిస్తున్న విషయమూ వెల్లడవుతోంది. ఎక్కువమంది విషయంలో బెయిలు పిటిషన్లకు నామమాత్రంగా కూడా అడ్డు చెప్పడంలేదు.
   
బెయిలు దరఖాస్తుల అభ్యంతరంలోనూ పక్షపాతం
     సాక్షులను ప్రభావితం చేసే శక్తిమంతులు, అధికారంలో ఉన్న వారి బెయిలు దరఖాస్తులను అస్సలు అభ్యంతరపెట్టడంలేదు. ఈ ఉదంతాలు చాలు సీబీఐ కుట్ర పూరితంగా దురుద్దేశపూర్వకంగా దర్యాప్తు చేస్తోందని చెప్పడానికి.  జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా సాక్ష్యం ఇవ్వడానికి ఇష్టపడని వ్యక్తులను అరెస్టు చేయడం.. ఇతరత్రా వేధించడం చేస్తోంది. ఆయనకు వ్యతిరేకంగా కేసులను అల్లడానికి కాంగ్రెస్, టీడీపీలకు సీబీఐ ఓ సాధనంగా మారింది. ఇందుకోసం అధికార దుర్వినియోగం చేస్తోంది. లగడపాటి శ్రీధర్ జగన్మోహన్ రెడ్డి కంపెనీల్లో సక్రమంగానే షేర్ కొన్నారనీ, మిగిలిన వారు అదే ధరకు అక్రమంగా కొన్నారనీ చెప్పడం చూస్తేనే సీబీఐ కేసును ఎలా నడుపుతున్నదీ తేటతెల్లమవుతోంది.
     సుప్రీం కోర్టులో బెయిలు పిటిషన్ వేసినపుపడు మూడు నెలల్లో విచారణ ముగించి, అభియోగ పత్రం నమోదు చేస్తామని న్యాయవాదులతో చెప్పించిన సీబీఐ జేడీ హైదరాబాద్‌లో అభియోగపత్రం దాఖలుకు గడువేదీ లేదని చెప్పడం చూస్తే సంస్థకు సుప్రీం కోర్టన్నా లెక్క లేదన్న ధోరణి వ్యక్తమవుతోంది. మమ్మల్నేం చేయగలరనీ, ఎన్నాళ్ళయినా జగన్మోహన్ రెడ్డిని జైల్లో ఉంచగలమన్న వైఖరితో సీబీఐ ప్రవర్తిస్తోందనిపిస్తోంది. ప్రజల నుంచి సంక్రమించిన రాజ్యాంగబద్ధమైన అధికారాన్ని దుర్వినియోగం చేయాలనే కుట్ర ఎంతకాలమో సాగదు.

Back to Top