'ప్రభుత్వాన్ని నిద్ర లేపేందుకే ఫీజు పోరు దీక్ష'

హైదరాబాద్, ‌4 సెప్టెంబర్‌ 2012 : రాష్ట్రంలోని పేద, బడుగు బలహీన వర్గాల విద్యార్థుల భవిష్యత్తును గాలికి వదిలేసి మొద్దు నిద్రపోతున్న ప్రభుత్వాన్ని జాగృతం చేసేందుకే తమ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ గురు, శుక్రవారాల్లో ఫీజు పోరు దీక్ష చేస్తున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు వైవి సుబ్బారెడ్డి పేర్కొన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి నిరుపేద విద్యార్థులు ఉన్నత చదువులు చదివి అభివృద్ధి చెందాలన్న సదుద్దేశంతో ప్రారంభించిన ఫీజు రీయింబర్సుమెంట్‌ పథకాన్ని యధావిధిగా అమలు చేయాలన్న డిమాండ్‌తో విజయమ్మ ఈ దీక్షకు ముందుకు వచ్చారని ఆయన వివరించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారంనాడు ఆయన ‘ఫీజు పోరు దీక్ష’ పోస్టర్‌ను విడుదల చేశారు. దివంగత వైయస్‌ఆర్‌ ఉదాత్తమైన ఆశయంతో ప్రవేశపెట్టిన ఫీజుల పథకాన్ని, దాని వెనుక ఉన్న ఉద్దేశాలను పరిగణనలోకి తీసుకోకుండా ప్రభుత్వం నీరు గారుస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో ఈ నెల 6, 7 తేదీల్లో విజయమ్మ నిర్వహించే ఫీజు పోరు దీక్షను విజయవంతం చేయడానికి జంటనగరాల, రంగారెడ్డి జిల్లా పార్టీ నేతలు, శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. పోస్టర్ విడుదలలో పార్టీ సంస్థాగత వ్యవహారాల రాష్ట్ర కో‌ ఆర్డినేటర్ పి.ఎ‌న్.వి.ప్రసా‌ద్, యువజన విభాగం అధ్యక్షుడు పుత్తా ప్రతాపరెడ్డి, రంగారెడ్డి జిల్లా పార్టీ అ‌డ్‌హాక్ కమిటీ కన్వీన‌ర్ బి.జనార్ద‌న్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Back to Top