ప్రభుత్వంపై పోరాడుతున్నది వైయస్ఆర్‌ కాంగ్రెసే

హిందూపురం:

ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై నిరంతర పోరాటాలు చేస్తోంది ఒక్క వైయస్ఆర్ కాంగ్రెసేనని అనంతపురం ఎమ్మెల్యే గురునాథ రెడ్డి, పార్టీ జిల్లా కన్వీనర్ శంకరనారాయణ అన్నారు. కొల్లకుంటలో వైయస్ఆర్‌ కాంగ్రెస్ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు కొండూరు వేణుగోపాల్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో గ్రామానికి చెందిన 200 కుటుంబాల వారు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి ఎమ్మెల్యే గురునాథరెడ్డి, పార్టీ జిల్లా కన్వీనర్ శంకరనారాయణ మాట్లాడారు. తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు రాష్ట్ర ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారానికి కృషి చేయలేదని ఆరోపించారు.  కాంగ్రెస్, టీడీపీ కుట్ర పన్ని జనాభిమానం పొందుతున్న వైయస్ జగన్‌ను జైలు పాలు చేశాయని ధ్వజమెత్తారు. ఈ కుట్రలో భాగంగానే చంద్రబాబు హిందూపురం నుంచి పాదయాత్ర చేపట్టారని విమర్శించారు.  వైయస్ఆర్ తనయ షర్మిల పార్టీలో ఎటువంటి హోదా లేకున్నా 3 వేల కిలోమీటర్ల మేర పాదయాత్ర చేపడుతుండడం గర్వకారణమన్నారు.

Back to Top