ప్రభుత్వాస్పత్రులకు వెళ్ళే ధైర్యముందా?

కందుకూరు(అనంతపురం): మీకు అనారోగ్యం వస్తే ప్రభుత్వాస్పత్రులకు వెళ్ళే ధైర్యముందా అంటూ కాంగ్రెస్, టీడీపీ నేతలను ప్రశ్నించారు వైయస్ షర్మిల. ఆదివారం మరో ప్రజా ప్రస్థానం పదకొండో రోజు యాత్రలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల ప్రభుత్వాస్పత్రుల పరిస్థితిపై ధ్వజమెత్తుతూ వారినీవిధంగా నిలదీశారు. ఆదివారం సాయంత్రానికి యాత్ర కందుకూరు గ్రామానికి చేరుకుంది. కాంగ్రెస్, టీడీపీ నేతలకు వంట్లో బాగో లేకపోతే ప్రైవేట్ ఆస్పత్రులకో, విదేశాలకో వెడుతున్నారని ద్వజమెత్తారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుపై కూడా ఆమె నిప్పులు చెరిగారు. ఇప్పుడాయనకు పాదయాత్ర చేయాల్సిన అవసరమేమొచ్చిందని ఆమె అడిగారు. ప్రజలను కాల్చి చంపిన పోలీసులను పరామర్శించిన బాబు.. ప్రజాకంటకంగా తయారైన కిరణ్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం బదులు విశ్వాస తీర్మానం పెట్టిన పెడతారని చెణుకు విసిరారు. అన్నదాతలు నివసించాల్సిన గ్రామాలలో రైతులకు ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితి కల్పించి శ్మశానాలుగా మార్చారని బాబుపై ధ్వజమెత్తారు. అలాంటాయన ఏమొఖం పెట్టుకుని ఇప్పడు గ్రామాల్లో తిరుగుతున్నారని ప్రశ్నించారు. వీరిని నమ్మడానికీ, వచ్చే ఎన్నికల్లో ఓటేయడానికీ ప్రజలు అమాయకులు కాదనీ, పిచ్చివాళ్ళు అంతకంటే కాదనీ షర్మిల చెప్పారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు కలిసి కుమ్మక్కయ్యి నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. రెక్కల కష్టంమీద తెచ్చిన ప్రభుత్వంతో వైయస్ఆర్ ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారన్నారు. వాటినన్నింటినీ తుంగలో తొక్కుతున్నారని ఆరోపించారు. నిత్యావసర వస్తువుల ధరలను 55 శాతం పెంచారనీ, అది చాలదన్నట్టు నాలుగు శాతం అమ్మకపు పన్ను విధించి మరింత భారం మోపారని ఆరోపించారు. ఇంత జరుగుతున్నా చంద్రబాబు చోద్యం చూస్తున్నారని షర్మిల పేర్కొన్నారు.  అనంతపురం జిల్లా అంటే వైయస్ రాజశేఖరరెడ్డిగారికి చాలా ఇష్టమని చెప్పారు.

తాజా వీడియోలు

Back to Top