తాడేపల్లి: తనకు జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతను పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ అందచేసిన వినతి పత్రాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోవడాన్ని ప్రశ్నిస్తూ మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్‌సీపీ అధినేత వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. తనకు కేంద్ర సంస్థలైన సీఆర్‌పీఎఫ్ లేదా ఎన్‌ఎస్‌జీలతో తగిన భద్రత కల్పించకపోవడం రాజ్యాంగ విరుద్ధమంటూ గురువారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనకున్న ప్రాణహానిని తాజాగా, స్వతంత్రంగా మదింపు చేసి నిర్దిష్ట ప్రొటోకాల్‌కు అనుగుణంగా జెడ్ ప్లస్ భద్రతను పునరుద్ధరించేలా ఆదేశాలు జారీ చేయాలని అభ్యర్థించారు. వ్యక్తిగత భద్రతాధికారులు, జామర్లు, ఇల్లు, కార్యాలయం వద్ద భద్రత, పనిచేస్తున్న బుల్లెట్‌ప్రూఫ్ వాహనాన్ని సమకూర్చేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అలా సమకూర్చలేని పక్షంలో తన సొంత బుల్లెట్‌ఫ్రూఫ్ వాహనాన్ని వినియోగించుకునేందుకు అనుమతినివ్వాలని విన్నవించారు. తనకున్న ప్రాణహాని దృష్ట్యా తక్షణమే సీఆర్‌పీఎఫ్, ఎన్‌ఎస్‌జీతో తగిన భద్రత కల్పిస్తూ చర్యలు తీసుకునేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని కోరారు. తనకున్న ప్రాణహాని, తనపై జరిగిన హత్యాయత్నాన్ని పరిగణనలోకి తీసుకుని తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జెడ్ ప్లస్ భద్రతను కల్పించారని వైయస్ జగన్ తన పిటిషన్‌లో నివేదించారు. హాని చేస్తామంటూ కూటమి వర్గాల బెదిరింపులు.. రాష్ట్రంలో ప్రభుత్వం మారాక ఎలాంటి నోటీసు, ముందస్తు సమాచారం ఇవ్వకుండా తన భద్రతను భారీగా కుదించేశారని వైయస్ జగన్ తెలిపారు. తనకున్న ప్రాణహానిని కనీస స్థాయిలో కూడా పరిగణనలోకి తీసుకోలేదన్నారు. భౌతికంగా హాని చేస్తామంటూ అధికార కూటమి ప్రభుత్వ వర్గాల నుంచి బెదిరింపులు వస్తున్నాయన్నారు. ప్రస్తుతం తనకు క్యాట్ బృందాలతో కల్పిస్తున్న భద్రత, పూర్తిస్థాయిలో పనిచేయని బుల్లెట్‌ప్రూఫ్ వాహనం వల్ల ఉపయోగం లేదని తెలిపారు. గతంలో ఉన్న జెడ్ ప్లస్ భద్రతను పునరుద్ధరించాలని పలుమార్లు విజ్ఞప్తి చేసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. తన భద్రత కుదింపుపై గతంలోనే హైకోర్టును ఆశ్రయించానని, ఆ పిటిషన్ ఇప్పటికీ పెండింగ్‌లో ఉందని తెలిపారు. పార్టీ ఎంపీలు, సీనియర్ నేతలు తన భద్రత విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పలు దఫాలు వినతిపత్రాలు సమర్పించినా ఫలితం లేకపోవడంతో హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందన్నారు. గత ఫిబ్రవరిలో తాను రైతులకు సంఘీభావం తెలిపేందుకు గుంటూరు మిర్చి యార్డ్‌కి వెళితే కనీసం ఒక్క కానిస్టేబుల్‌ని కూడా అందుబాటులో ఉంచలేదన్నారు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే జనాలను నిలువరించేందుకు ఎలాంటి చర్యలు చేపట్టలేదని తెలిపారు. ప్రజా నేతలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే.. 2024 తర్వాత తమ పార్టీ నేతలు, కార్యకర్తలపై భౌతిక దాడులు పెరిగిపోయాయని వైయస్ జగన్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. తనను అంతమొందిస్తామంటూ అధికార పార్టీ నేతలు బహిరంగంగానే బెదిరిస్తున్నారన్నారు. టీడీపీ ఎమ్మెల్యే అయ్యన్న పాత్రుడి వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమన్నారు. ఇటీవల శ్రీ సత్యసాయి జిల్లా కుంటిమద్ది గ్రామం నుంచి తిరుగు ప్రయాణం సందర్భంగా తీవ్ర భద్రతా లోపాలను అందరూ చూశారన్నారు. హెలీప్యాడ్ వద్ద భద్రతా లోపాలు స్పష్టంగా కనిపించాయన్నారు. ఈ ఘటనపై పోలీసులు ఇప్పుడు తీరిగ్గా విచారణ జరుపుతున్నారని తెలిపారు. భద్రతా లోపాలను సరిదిద్దుకోవాల్సిన పోలీసులు తనను చూడటానికి వచ్చిన పార్టీ కార్యకర్తలు, ప్రజలపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యతలను పూర్తిగా విస్మరించిందన్నారు. ప్రాణహాని నుంచి ప్రజా నేతలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని తనకు జెడ్ ప్లస్ భద్రతను పునరుద్ధరించేలా ఆదేశాలు జారీ చేయాలని హైకోర్టును అభ్యర్థించారు. వైయస్ జగన్ దాఖలు వ్యాజ్యంపై హైకోర్టు శుక్రవారం విచారణ జరపనుంది.