వైయస్ఆర్ జిల్లా: వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలను వేధించడమే లక్ష్యంగా చంద్రబాబు సర్కార్ పనిచేస్తోందని వైయస్ఆర్ జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూటమి ప్రభుత్వం నెరవేర్చలేదన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంలో స్కీములు లేవు.. కానీ అన్ని స్కాములే’’ అంటూ దుయ్యబట్టారు. 1.70 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఒక్క అభివృద్ధి పనులు చేయలేదని మండిపడ్డారు. ‘‘సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనుంజయ రెడ్డి ఇంటిపై పోలీసుల దాడులు అప్రజాస్వామికం. కనీసం ఎటువంటి నోటీసు కూడా ఇవ్వకుండా కుటుంబ సభ్యులను వేధించడం దారుణం. సాక్షి మీడియా ప్రతినిధులను బెదిరిస్తూ అక్రమాలు ప్రశ్నిస్తే కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. లేని లిక్కర్ స్కాం బయటకు తీసి అబద్ధాలే ఆరోపణలుగా కేసులు పెడుతున్నారు. అధికారులను, నాయకులను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలో అమాంతంగా విద్యుత్ ఛార్జీలు పెంచి పేద ప్రజల నడ్డి విరుస్తున్నారు. రాబోయే రోజుల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారు’’ అని రవీంద్రనాథ్‌రెడ్డి హెచ్చరించారు. ఆపరేషన్ సిందూర్‌పై ఆయన మాట్లాడుతూ.. దేశం కోసం నిత్యం శ్రమిస్తున్న సైనికులకు సెల్యూట్ చెప్పారు. పాకిస్థాన్ ఉగ్రవాద చర్యలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టడం హర్షణీయం అని రవీంద్రనాథ్‌రెడ్డి పేర్కొన్నారు.