ప్రభుత్వాన్ని పడగొట్టండంటే పాదయాత్ర

ఐజ:

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు  పాదయాత్ర ఓ నాటకమని మహానేత తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన వైయస్ షర్మిల ఎద్దేవా చేశారు.  మరో ప్రజాప్రస్థానంలో భాగంగా ఆమె ఆదివారం అలంపూర్ నియోజకవర్గంలో ఆమె పాదయాత్ర చేశారు. 'తొమ్మిదేళ్ల పాలనలో తాను శ్మశానాలుగా  మార్చిన పల్లెల మీదుగానే ఆయన ఇప్పుడు పాదయాత్ర చేస్తున్నారని అన్నారు. ఆయనకు  పాదయాత్ర చేయాల్సిన అవసరం ఏమిటి? అవిశ్వాసం పెట్టడానికి సరిపడా ఎమ్మెల్యేలు ఆయన వద్ద ఉన్నారు. ఈ ప్రజాకంటక ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టి దించేయొచ్చు.. కానీ దించేయడంలేదని' చెప్పారు.  పేరుకు మాత్రం ఈ ప్రభుత్వం పనిచేయడం లేదంటూ చంద్రబాబు తిడుతూనే ప్రభుత్వానికి మిత్రపక్షంగా మారారని షర్మిల వివరించారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినపుడు ఆయన ఆస్థి రెండెకరాలనీ, అలాంటాయన  వేల కోట్లు ఎలా సంపాదించారని కమ్యూనిస్టులు ప్రశ్నించినా ఈ ప్రభుత్వం  విచారణ చేయదన్నారు. చంద్రబాబును మించిన ధనవంతుడైన రాజకీయ నేత లేడని తెహల్కా వెబ్‌సైట్ ఆరోపించినా విచారణ చేయరన్నారు. రాష్ట్రానికి ఉపయోగపడుతుందన్న ఇంగితజ్ఞానం కూడా లేకుండా చంద్రబాబు కేజీ బేసిన్‌లోని లక్షల కోట్ల రూపాయల విలువైన గ్యాస్‌ను రిలయన్సు సంస్థకు కట్టబెట్టారన్నారు. అయినా దానిపై విచారణ చేపట్టడంలేదని  విమర్శించారు. ‘ఆపద్ధర్మ సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు.. ఎకరా రూ.2 కోట్ల దాకా విలువ చేసే 850 ఎకరాల భూమిని ఎకరా రూ.50 వేలకే తన బినామీ సంస్థ అయిన ఐఎంజీ భారతకు కట్టబెడితే దానిపైనా విచారణ లేదన్నారు. ఐఎంజీ వ్యవహారాన్ని వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ న్యాయస్థానం దృష్టికి తీసుకెళితే.. దీనిపై ఎందుకు విచారణ చేయరని జడ్జిగారు సీబీఐని ప్రశ్నించారనీ,  తమ వద్ద సిబ్బంది లేరని సీబీఐ బదులిచ్చిందనీ చెప్పారు.  అదే సీబీఐ.. జగనన్న, ఆయన బంధువులు, స్నేహితుల ఇళ్లల్లో 28 బృందాలతో ఒకేసారి సోదాలకు దిగింది. కానీ చంద్రబాబుపై విచారణకు సిబ్బంది లేరని చెప్పింది’  అన్నారు. షర్మిల ఆదివారం యాత్రను ఉదయం పరిదిపురం నుంచి ప్రారంభించారు. ఐజ మండల కేంద్రానికి చేరుకునే మార్గ మధ్యంలో బుడగ జంగాలు, గీత కార్మికులు కలిశారు. ఐజలో భారీ ఎత్తున తరలి వచ్చిన ప్రజలను ఉద్దేశించి షర్మిల ప్రసంగించారు. ఐజ మండల కేంద్రానికి 5 కిలో మీటర్ల దూరంలో ఏర్పాటు చేసిన బసకు రాత్రి 7 గంటలకు చేరుకున్నారు. ఆదివారం 15 కిలోమీటర్ల మేర యాత్ర సాగింది. ఇప్పటివరకు మొత్తంగా 522.90 కి.మీ. పాదయాత్ర పూర్తయింది.

Back to Top